ప్రకృతి భాష

సముద్రం
కొండ చరియలను
తాకినపుడు అందం
అనంతమైనదాన్ని
పట్టి పుడిసిలించినట్లు అనుభూతి
శిల్పంలో
సజీవతే కాదు
వైజ్ఞానికతావుంది
ఏ శిల్పి నైపుణ్యమైనా
అది సృష్టిలోని సౌందర్యాభివ్యక్తే.

అవును
ఎన్నో అభివ్యక్తులు శిలా సదృశాలే
మనిషికి
దేనికి స్వేఛ్చవుంది
ఏ విలువల కోసం పోరాడుతున్నామో
అవి సంకెళ్ళు బిగిస్తాయి.
ఆధార ఆధేయితాల పెనవేత
తగ్గేకొలదీ
ఏపుగా పెరుగుతున్న
సరిగ చెట్టులా
ఒంటరి సంగీతం

అవును! నిజమే
తోడు గొప్పదే
అక్షరాలు తోడు కోల్పోతే
భావ శున్యమైనట్టు
అవును!
భయం ఒక భూతంమే
చల్లగాపారుతున్ననదిని కూడా
విసురుతున్న తుఫానులాగే భావిస్తుంది
నిజమే! ఆ నది
పాయలు పాయలుగా
విడిపోతున్న చోట
బొట్లు సందిగ్ధంలోనే ఉన్నాయి!
ప్రకృతిది సహజ సౌందర్యం
ఒక్క  గడ్డిపూవు చాలు
ఎంత ఎత్తైన కొండకు కూడా
కిరీటమే

నిజమే!
అది కారపు బంతిపువ్వే
నీళ్ళ పోత కూడా లేకుండా
మంచులో పెరిగింది
ఆ  పక్కన గట్టుమీద
పుట్ట కొక్కులు
సహజంగానే మోలిశాయి
అవును!
ఆ  కృత్రిమ ఉద్యానవనాల కంటే
యివే నన్ను ఆకర్షిస్తున్నాయి
వీటికి సూర్యుడు తెలుసు
వెన్నెల తెలుసు
మనిషి వెలుగులో వున్నాననుకొని
అంధకారంలో వున్నాడు

సరిగా ఆ సూర్యుణ్ణి చూడగలిగితే
ఈ మెర్క్యురీ లైట్ల కూసం
ఆరాటం ఎందుకు?
కొన్నిసార్లు కళ్ళు మాట్లాడీ
మాట్లాడీ అలసిపోతాయి
అభివ్యక్తి శూన్యతను అంతా
కనురెప్పలే మోయాలి
ఇసుక తిన్నెల మీద
ముద్రించిన ప్రతి అడుగు
శిలా శాసనమే,
అడుగులు కూడా అన్నిసార్లు వేయలేము
చరిత్ర అనేక అస్తికలను
మిగిల్చింది
వాటి ఆరాటం సముద్రంలో
ఘోష పెడుతూనే వుంది

నిజమే!
ముగింపు లేనిదే మౌనం
దానికి అనంత భాష
ప్రకృతి దాని బడి
జీవన వ్యవస్థలన్నీ
ప్రతిఫలిస్తాయనేదే ఆశ
అటు వేపే నా పయనము...
నడుస్తున్న చరిత్ర జూలై 2011 సంచికలో ప్రచురించబడినది.

No comments:

Post a Comment