అన్ని మతాల్లోకి మనువు

జిగేలుమంటున్న స్టార్లు
వీధుల నిండా కట్టి వున్నాయి
మనుషులు సంతోషంగానే వున్నారు
వారి పండగ వారు చేసు కుంటున్నారు

క్రీస్తు  పుట్టినరోజు ద్రాక్షా రసం
ఏరులై పారుతుంది
ప్రజలు మత్తులో జోగుతున్నారు
ప్రతి సంతోషం వెనుక ఒక దుః ఖం
అవునూ!
ఏసు  అంటే మేలు కొలుపే  కదా !
వీరు మత్తులో ఎందుకుంటున్నారు?
ప్రభుత్వాల దమన కాండను
ఎందుకు సహిస్తున్నారు ?
ప్రవహిస్తున్న నదీ తరంగాలలో 
వీరు ఒక అలగ  ఎందుకు లేరు?
క్రీస్తు బోధించిన నీతికి భిన్నంగా 
వీరు ఆయన దేవాలయ ప్రాంగణాలను
ఐదు నక్షత్రాల హోటళ్లకు ఎందుకు విక్రయిస్తున్నారు?
సమాజ సేవ పేరుతో  అనాధ పిల్లల
రొట్టెలను ఎందుకు కాజేస్తున్నారు?
మురుగు వాడల్లో ఎందుకు కునారిల్లు తున్నారు?
చలికి వణుకుతున్నముదుసళ్ళ కిచ్చిన రగ్గులను
మార్కెట్ చేస్తున్నది ఎవరు?
దోపిడీ ప్రభుత్వాలను దీవిస్తూ
దీప స్తంభాలను వెలిగిస్తున్నవారెవరు?

అవును !
వీరు హిందూ  సామ్రాజ్య వాదానికి
క్రీస్తు పేరు తో కొమ్ము కాస్తున్నారు
గుజరాత్ ఎన్నికల్లో మోడికి పట్టం గట్టిన
వీరి అవకాశవాదానికి
క్రీస్తు కన్నీరు కార్చడం లేదా!

 అవును !
 క్రిస్మస్
దళితుల జీవితాల్లో ఒక వెన్నెలే
కొత్త జండా
కొత్త బట్టలు
కొత్త సువార్త
అది ఒక నాటి మాట


ఈనాడు
చీకటి దొంతర్ల  మధ్య
చిరిగి పోతున్న జీవితాలను
అద్దంలో  చూపించి
సుఖ భోగాలనుభవిస్తూ
భోక్త స్వాముల దురన్యాయానికి
ఒక సాదృశ్యం

మనుస్మృతి  అన్ని మతాలకు ఈనాడు దర్శన మయ్యింది
అన్ని మతాలూ వర్ణ తత్వాన్నే పోషిస్తున్నాయి
కులం హద్దులు దాటలేక ప్రవక్తల్ని కూడ
కుల, వర్ణ, జాతి  గిరుల్లోకే మళ్లి  లాగుతున్నారు
విశ్వ  జనీన మైన భావనలు రంగురంగుల బూరల్లా  పగిలిపోతున్నాయి
సాంప్రదాయం  చాందసత్వం  బుర్రల్లో కూరుకుపోయి
నీతి , వ్యక్తిత్వాలు రాను రాను నశిస్తున్నాయి 
ఒక పక్క పెద్ద పెద్ద చర్చిలు, మసీదులు, గురుద్వారాలు
మర ఒక పక్క రామాలయాలు
మధ్యలో మాన భంగాలు
ఇది మన మతాలు సాధించిన సెక్యులర్ నీతి
ఈనాడు  మనకు కావల్సింది మనుధర్మం కాదు మానవ ధర్మం 

అంబేద్కర్ మతం మారటం కాదు
హిందూ వాదానికి
ప్రత్యామ్నాయాన్ని సృష్టించటమే
నిజమైన విప్లవం అన్నాడు
ఆ పండగ  కోసం ...........


డా . కత్తి పద్మారావు
25.12.12