నూతన వత్సరానికి స్వాగతం


                                                                                                                                           1.1.12
ఆ క్రిస్మస్ చెట్టు నిండా బూరలే వున్నాయి 
కొవ్వూత్తుల వెలుగు చీకటిని చేదిస్తుంది
చేకటి కూడా సౌందర్యవంతమైనదే
అనేక సార్లు మనం కళ్ళు మూసుకొని 
ఆనందాన్ని అనుభవిస్తాం 
నిజమే
కళ్ళు తెరచి ఆ దృశ్యాన్ని చూడలేక పోయాను
శరీరానికి నిప్పంటించుకొని 
కాల్చుకోవడం చూడలేక పోయాను
ధర్మావేశం ఉద్యమ కెరటాలు లేపింది 
లోతైన గుండె కోత కలిగించింది 
నిజమే
వాళ్ళు అర్ధరాత్రిలో  చైతన్యం గా వుంటున్నారు 
అర్ధనగ్నంగా కేరింతలు కొడుతున్నారు 
ముక్కు రంద్రాల నుండి కొకెయిన్ పీలుస్తున్నారు 
జీవితానికి వారు అర్ధం చెప్పాలేక పోతున్నారు
రక్తం లోపల ఏ జేర్రులో జలగలో 
పారే అనుభూతి వారికి కావాలంట?
అవును
ఆ రాస్తా ముందు నెత్తురు 
వారగా పారింది
అమాత్యుల వారి సతుల వేగానికి
తారే కాదు గులకే కాదు 
భూమి పొరలు కూడా తట్టు కోలేక 
పోతున్నాయి 
వారికి చెక్కు బుక్కులు 
స్లీవ్ లెస్ జాకెట్లు 
స్వీయ గమనంలో వేగం 
వారిని అతలాకుతలం చేస్తుంది 
తండ్రులకు వీరికి తరాలుకాదు
యుగాల దాటివేత 
నిజమే
ఆ చేనేత శిల్పికి 
చేతికి రంద్రాలయ్యాయి 
మగ్గం అనేక సార్లు తడిసి ఆరింది 
ఆకాశం వైపు చూడడమే కాదు
నక్షత్రాలను లెక్క పెట్టడమా 
అతనికి తెలిసింది 
ఆకలికి ఓ ఖగోళశాస్త్రం వుంది 
అవును
ఆ యానాదులు చిన్న చేపలే పడతారు 
చట్టిలోనే ఇంత కూర యిగరేసుకుంటారు
ఈ బర్గార్లకూ , జీడి పప్పు మిటాయికి
గుండె నాళాలు మూసుకు పోయిన వారు 
మేము నాగరికులం 
అందుకే నాగలోకానికి ప్రయాణమయ్యాం  అంటున్నారు?
తల్లంటే యింటిలో దీపం వెలిగించేది 
ప్రభుత్వం దీపం ఆర్పుతుంది
అన్నం పెట్టలేనివాడు 
దీపం వెలిగించలేనివాడు
ఏమి ప్రభువు అనేది ప్రశ్న
అతనెవరు
శవాన్ని భుజాన వేసుకొని తిరుగుతున్నాడు 
ఒక సారి దేశాన్ని దోచుకునే
అవకాశం ఇవ్వమంటున్నాడు
చచ్చిన  ప్రతివాడికీ  సానుభూతే, రాజతర్పణే  
వంశ పారంపర్య  చీడ 
ఈ సంవత్సరం ఎన్నో పీడకలలు 
అయినాఏమి?
పోరాటం
చైతన్యం
రక్తాక్షరాలు రాసాయి 
మనిషి, మానవత 
వెలుగొందుతూనే వున్నాయి 
మూగవోయిన డప్పులూ, డోలక్కులూ
మోగుతూనే వున్నాయి 
రాజ్యాధికారం ఒక కేకే కాదు 
ఒక ఆచరణ కూడా 
నూతన వత్సరానికి  స్వాగతం 
Dr.Kathi Padma Rao

1 comment:

  1. sir, i always wanted to try to point out the rich people comparing to the poor like how their activities are causing drastic problems to the poor, especially our people. i found it here sir.

    ReplyDelete