పక్షి వీక్షణం


పక్షి వీక్షణం
విశాలమైన పచ్చిక బయళ్ళు
ఆ మధ్యలో
ఏపుగా పెరిగిన ఒక చెట్టు
ఆ పైన రెండు పక్షులు
అవి తెల్లగా ఉన్నాయి.
ప్రపంచ పరిణామం గురించి ముచ్చట్లు
నిన్నటి ధనవంతుడు
నేడు పేదరికాన్ని నటిస్తున్నాడు
పేదవాణ్ణి అడిగి చిరుగు చొక్కాలు
ధరిస్తున్నాడు.

యుద్ధ నౌకల్లో సరుకుమాత్రం
లోడ్‌ అవుతూనే ఉంది.
తెల్ల భవనాల్లో
పావురాలమేతకేమి తిరుగు లేదు
డాలరుని ఒక
మారక ద్రవ్యంగా గాక
ఒక మత్తు మందులా చల్లారు.
మానవతా స్ఫూర్తిని విస్మరించి
ఎందరినో ఆకాశానికి
వేలాడ దీసి చూస్తున్నారు.

ఓ పక్షి అన్నది
‘ఒబామా ఎందుకు
రాత్రుళ్ళు నిద్రించటంలేదు’ అని?
నిద్ర చిన్న విషయం కాదు.
అది నిర్మలమైనవారికే వస్తుంది.
ఆకాశంలో ఎగిరే అన్ని పక్షులు
చిన్న గూటిలో నిద్రిస్తున్నాయి
నాలుగు చెత్త పరకల పరుపుతో
ఒక తోడుతో, గుంపు జీవనంతో
ఏ సంకెళ్ళులేని జీవితం మనది.
సంకెళ్ళు వేయడమైనా
బిగించడమైనా
అదొక విద్యే!

ముసోలినీ, హిట్లర్‌ వంటివారందరిని
తెల్ల భవనం నిందించింది.
ఇవాళ్ళ వాళ్ళు చేస్తుందేమిటి?
మన ముఖర్జీలు, చిదంబరంలు
పార్లమెంటులో గారడీలు చేస్తున్నారు.
కనికట్టు విద్యతో
ప్రశ్న వేసినవాణ్ణి చిక్కుల్లో
పెడుతున్నారు.
అధినేత్రి చికిత్సకు
హాస్పటల్‌ కట్టుకోలేనివాళ్ళు
దేశాన్ని ఎలా పాలిస్తారు?
అందరూ శస్త్ర చికిత్సలకు
మంచు దేశాలకు వెడితే
ఇక సూర్యోదయ ఉపఖండాలకు
బతుకేది?

బొమ్మలేమో చైనావా!
చేతి ఫోన్‌లేమో జర్మనీవా!
కెమెరాలేమో సింగపూర్‌వా!
ఇక్కడ బియ్యమేమో
ముక్కి పోతున్నాయా!
అని రెండో పక్షి విశ్లేషణ చేసింది.
అవును తెల్ల దేశాలకంటే
బొగ్గు దేశాలకు మోజే!
అనుకరించటమే వీరిపని!
అమ్ముకోవడమే వీరికి వచ్చినపని!

ఆత్మగౌరవం తాకట్టులో ఉంది
చెత్తనేరే పిల్లల,
గాజు పెంకులు అతుకుతున్నవారి
అర చేతులన్నీ
నేటివిటీ మరకలే మరి!
మనలాగా మబ్బులు పల్లకీలు
వారికెక్కడివి?

చినుకు పడితే చిత్తడిలో
ఒళ్ళంతా పుండ్లు
జీవితానికి కునుకు లేదు
ఓ వీక్షణమా!

katipadmarమన దేశాన్ని మనం పచ్చగా చూడాలి!
ముందు మనసులకు
వ్యవసాయం
జరగాలి!
మనల్ని మనం
నిర్మించుకోవాలి!
అప్పుడే,
పునరుజ్జీవనోద్యమం
తథ్యం!

No comments:

Post a Comment