మానవీయ విలువలు లేని దేశ బడ్జెట్--- కత్తి పద్మారావు
కేవలం సబ్సిడీల ద్వారా ఉపశమనాల ద్వారా అంకెల గారడీ ద్వారా దేశ సంపద వర్ధిల్లదు. రాజ్యాంగకర్త డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను ప్రణాళికా సంఘం, బడ్జెట్ రూపకర్తలు తప్పకుండా సమన్వయించుకోవాలి. నూతన జీవన విధానానికి ప్రత్యామ్నాయ సామాజిక ఆర్థిక జీవన విధానాన్ని రూపొందించగలిగినప్పుడే మానవాభ్యుదయం ప్రతిఫలిస్తుంది. లేకుంటే బడ్జెట్, తాబేదారులకు విస్తరి అవుతుంది తప్ప అభివృద్ధి వుండదు.
భారతదేశ ఆర్ధిక పరిస్ధితి మరింత దిగజారడానికి కారణం పరిశీలిస్తే దేశీయ వనరులను, శ్రమను సమన్వయం చేసే ప్రయత్నం మన్మోహన్ ప్రభుత్వం చేయలేకపోవడమే. అంతకు ముందున్న యన్.డి.ఎ. ప్రభుత్వానికి సెక్యులర్ విధానం లేకపోవడం, బడుగు వర్గాల మీద సామాజిక న్యాయ దృష్టి లేకపోవడం వల్ల ఆ ప్రభుత్వాన్ని ప్రజలు దించేశారు. యు.పి.ఎ. కూటమి అధికారానికి వచ్చాక వీరు అంతకంటే తీసికట్టుగా సామాజిక ఆర్ధిక విధానాలను రూపొందించారు.
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మెజారిటీ ప్రజలకు పని కల్పించగలగాలి. దానితో పాటు జీవితం మీద ఆశ కల్పించాలి. నిరాశాజనకమైన వాతావరణంలో మనుష్యులు ఉత్తేజంగా వుండలేరు. తప్పక పునర్నిర్మాణాలకు ప్రత్యామ్నాయాలకు పునాదులు వేయాల్సివుంది. అప్పు లు చేసి బ్రతకండి, అప్పులతో జీవించండి వంటి పిలుపులనివ్వడం వల్ల వస్తూత్పత్తిరంగం కుప్పకూలింది. ప్రజలు వస్తు ఉత్పత్తిలో జీవన వ్యవస్ధల్ని పునరుజ్జీవింపచేసుకుంటారు.
వారికే పనిలేదంటే, పనినుంచి ఉత్పత్తి పరికరాల నుంచి తయారైన వస్తువు మార్కెట్టుకు వెళ్లి ధనాన్ని సంపాదించాల్సి వుంది. అయితే సామాజిక ఉత్పత్తులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. జీవనాధార అంశాల పట్ల ప్రభుత్వానికి ప్రభుత్వేతర సంస్ధలకు లక్ష్యం లేదు. ముఖ్యంగా ఆహారం, ఆహార్యం, నివాసం, వాహనం, విద్య, ఆరోగ్యం వంటివన్నీ ఒక క్రమంలో అభివృద్ధి చెందాల్సి వుంది. కానీ మౌలికాంశాల రూపకల్పనలన్నింటిలోనూ ప్రభుత్వం వెనుకబడి వుంది.
ఈ విషయంగా రైల్వే బడ్జెట్టును పరిశీలిస్తే దక్షిణ భారతదేశంలో 2010-2011 ఆర్ధిక సంవత్సరంలో కేవలం 33.7 కోట్ల మందిని రైళ్ల ద్వారా తరలించగలిగారు అంటే బ్రిటీష్ కాలం నుంచి రూపొందిన రవాణా వ్యవస్ధ వేగవంతం కాలేదని అర్ధం. ఆధునిక సమాజంలో వున్న కదలిక సామాజిక చలనాన్ని నిర్ణయిస్తుందనే సూత్రానికి కట్టుబడిందనే అర్ధం. కేంద్ర ప్రభుత్వం పనిమొత్తంలో ప్రధాన బాధ్యత భారత దేశ ప్రజలకు చలనాన్ని పెంచవలసివుంది. ఆయా రాష్ట్రాల్లో ఈ చలనం పట్ల కూడా వివక్ష వుంది. పశ్చిమబెంగాల్లో 44.06 కిలోమీటర్లు వుంటే ఆంధ్రప్రదేశ్‌లో 18.80 కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్లు వేసివున్నాయి. దీన్నిబట్టి సామాజిక చలనాన్ని పెంపొందించడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వుంది. అంతేగాక విద్య, వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధికి రైల్వే వ్యవస్ధ అభివృద్ధి కాకపోవడం కూడా గొడ్డలిపెట్టే అవరోధం అవుతుంది.
2012-2013 బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి 6,300 కోట్లు అంచనా వేశారు. నిజానికి భూమి పంపిణీ ప్రస్తావనే ఈ బడ్జెట్‌లో లేదు. బడ్జెట్‌కు భూమి పంపిణీకి సంబంధం వుంది. భూమి కొనుగోలు ప«థకం డా.బి.ఆర్.అంబేద్కర్ మొదటి బడ్జెట్‌లోనే ప్రతిపాదించారు. ప్రభుత్వం భూములన్నింటిని మల్టీనేషనల్స్ కంపెనీలకు అమ్ముకుంటున్న దశలో దళితులకు, ఆదివాసీలకు, భూమిలేని నిరుపేదలకు భూమిని పంచడం వల్లనే ఉత్పత్తి క్రమం పెరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయం ఆయా రాష్ట్రాలలో రెండు, మూడు కులాల చేతుల్లోనే వుంటుంది. వారిచేతుల్లోనే రాజ్యాధికారం వుంది.
వ్యవసాయం కొన్ని కులాల చేతుల్లోనే వుంటే దేశం బాగుపడదు. వ్యవసాయదారుడు భూమిమీద, వ్యవసాయం మీద నిలబడి లేడు. పెట్టుబడిదారులు కొందరు వడ్డీ వ్యాపారస్ధులుగా రూపొందుతుంటే కొందరేమో వ్యవసాయం గిట్టక అప్పులుచేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు వ్యవసాయ భూములను ప్రభుత్వమే తగురేటుకు కొని దళితులకు, గిరిజనులకు పంచాలనేది అంబేద్కర్ ఆలోచన. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి దళిత గిరిజనుల మీద నిర్లక్ష్యం వుంది. ప్రణబ్‌ముఖర్జీ రాజకీయ నిపుణుడు కాదు. ఆయన 2012-2013 వార్షిక బడ్జెట్ మొత్తం 14,90,925 కోట్లలో పార్లమెంటుకు సమర్పించబడింది. ఇందులో పన్నుల రాబడి 10,77,612 కోట్లు గాక పన్నులకు ఇతర ఆదాయం, లక్షాఅరవై నాలుగు వేల కోట్లు. నికర మార్కెట్ రుణాలు 4, 79,000 కోట్ల రూపాయలుగా తేల్చారు.
ఇందులో ప్రధానంగా 1,93,407 కోట్లు రక్షణకు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది 13 శాతం ఎక్కువ. చైనాతో పాకిస్తాన్‌తో పోటిపెట్టి దేశీయ రక్షణకు ఇబ్బడిముబ్బడిగా పెంచే క్రమం కొనసాగుతుంది. ఇందువల్ల ప్రధానమైన పరిణామానికి మూలమైన ప్రాధమిక విద్యకు క్రిందటి బడ్జెట్‌లో 52వేల కోట్లు కాగా, ఇప్పటి బడ్జెట్‌లో 61వేల కోట్లు పెంచారు. 9వేల కోట్లు మాత్రమే పాఠశాలకు పెంచారు. ఇంతవరకు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు, ప్రహరీలు ఆటస్థలాలు, ఆట వస్తువులు, చాక్‌పీసులు కూడా లేని బడులు వున్నాయి. విద్యాహక్కు చట్టం కింద 25 శాతం పేద విద్యార్ధులను ప్రయివేటు విద్యాలయాల్లో చేరుస్తామన్నారు. అది అమలు జరగడం లేదు.
భారతదేశ వ్యాప్తంగా ప్రాధమిక విద్య కుంటుబడటంతో చైల్డ్‌లేబర్ పెరిగిపోతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న చిన్న కర్మాగారాలు, గృహనిర్మాణ పనుల్లో కోట్లాది మంది చైల్డ్‌లేబర్ తమ జీవితాన్ని బుగ్గిచేసుకొంటున్నారు. దేశానికి పునాదియైన చిన్నారుల మీద కనికరం లేదు. ప్రాథమిక విద్య అభివృద్ధి చెందాలంటే భూమి పంపకం తల్లిదండ్రుల నికరాదాయంలోకి రావలసిన అవసరం వుంది.
ఉన్నత విద్యలు అభ్యసించే వారు ప్రపంచ సగటు 23 శాతం వుంటే, మన శాతం 12.4 మాత్రమే. సంపన్న వర్గాలే ఎక్కువగా ఈ విద్యకు చేరగలుగుతున్నారు. దేశంలోని 22 కేంద్రీయ విశ్వవిద్యాలయల్లో బ్రాహ్మణవాదం కొనసాగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మొదలైన సబ్జెక్టుల్లోకి శూద్రులను, అతిశూద్రులను రానివ్వడం లేదు. విశ్వవిద్యాయలాలు బ్రాహ్మణ అగ్రహారాల్లా నడుస్తున్నాయి. ప్రోగ్రెసివ్ సెక్టారులో కూడా బ్రాహ్మణులే ఎర్రముసుగులతో ఛాంపియన్‌లుగా వుంటున్నారు. ఇటు ఉన్నత విద్యలో బ్రాహ్మణులు, అటు భూస్వామ్య కులవ్యవస్ధలను కొనసాగిస్తున్న శూద్ర అగ్రకులాలు ఈ బడ్జెట్‌ల సారాన్ని పిండుకొంటున్నాయి.
మంత్రులు, అధికార యంత్రాంగంలోను ఉన్నత విద్యలోను ఉన్న కుల వివక్ష కారణంగా దళితులకు కేటాయించిన నిధులు దళితులకు చేరడం లేదు. దారి మళ్ళించబడుతున్నాయి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్లు దెబ్బకొట్టిన రెండు అంశాలు చేనేత, వ్యవసాయం. మిల్లు వస్త్రాల వల్ల మొత్తం చేనేత వ్యవస్థలను కుప్పకూల్చి నష్టాల్లోకి నెట్టారు. స్కూల్ డ్రస్‌లు, మిల్ట్రీ, పోలీసు, టీచర్లు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ వ్యవస్ధలన్నింటికి చేనేత వస్త్రాలను కంపల్సరీగా కొనడం నిర్ణయిస్తే ఇప్పుడున్న చేనేత కార్మికులు చాలరు. చేనేత మొదటి దళితులే ప్రామినెంట్‌గా నేసేవాళ్ళు. దీనికి ఆదాయ వనరులు పెంచి ఎస్‌సి, బిసిలకు సమాన ప్రతిపత్తి ఇందులో పెంచాలి. నశించిపోతున్న వృత్తులను పునరుద్ధరించడం ద్వా రా సామాజిక ఆర్ధిక పునరుజ్జీవనం జరుగుతుంది. ఆర్ధిక మంత్రికి భారతీయ మూల ప్రకృతుల మీద పట్టూ ఉండాలి. ఆంధ్రదేశంలో దొరుకుతున్న భూవనరులను ఇతర దేశాల కమ్ముకున్న ఉన్నతాధికారులు ఎంత దేశ ద్రోహానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా హోంశాఖకు కూడా నిధులు తగ్గించారు. ఒక పక్క అవినీతిని నిర్మూలించామంటున్నారు.
మరో ప్రక్క స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) నిష్పత్తి 2007-08లో 17.7 శాతం ఉండగా, అందులో కేంద్రం వాటా 12 శాతం. నేడు అది వరుసగా 15.4 శాతానికి పడిపోయింది. పనుల్లో ఇచ్చే మినహాయింపులు కూడా సబ్సిడీలే. కేంద్ర బడ్జెట్‌లు 2006-2007 నుంచి రాబడులు విషయం ముందే ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నాయి. సారాంశం ఏమిటంటే, మినహాయింపులు కనుక లేకపోతే పన్ను జిడిపిలో 5.5 శాతం పెరుగుదల కనిపించి ఉండేది. 2011-2012 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ లక్ష్యాలను, ముఖ్యంగా ఆహారం, పెట్రోలియమ్ ఉత్పత్తులకు సంబంధించి చేరుకోలేదని మనకు తెలుసు. కానీ, అదే బడ్జెట్ అంచనాలకు ఎవరైనా కట్టుబడి ఉండి, మిగిలిన సబ్సిడీలన్నింటినీ మినహాయించినప్పటికీ కూడా, ఇతరత్రా వెచ్చించగలిగిన మొత్తం 1.44 ట్రిలియన్ల వరకు ఉంటుందని నిపుణుల అంచనా.
అస్తవ్యస్తపు ప్రాధాన్యాల వల్ల ప్రభుత్వ, ఆరోగ్య, విద్యా రంగాలకు సంబంధించిన పథకాల కన్నా ఆహార సబ్సిడీకి, ఉపాధి హామీ పథకాలంటే మీదే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు చూపిస్తుంది. ఆహార సబ్సిడీకి రూ.60,750 కోట్లు కేటాయించింది. ఎస్ఆర్ఈడీఏకి 40,000 కోట్లు కేటాయించింది. ఆరోగ్య కార్యక్రమాలకి 26,750 కోట్ల కేటాయించింది. సర్వశిక్షా అభియాన్ 21,000 కోట్లు కేటాయించింది. పేదలకి ఇచ్చే ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు 60,000 కోట్లు వెచ్చిస్తోంది. బడ్జెట్‌లో భారీ వ్యయంతో కూడిన చట్టం ఏదైనా వుంటే అది ఆహార భద్రతా బిల్లుదే.
ఆహార సబ్సిడీల కోసం ఏటా చేస్తున్న ఖర్చును 90,000 కోట్లకు పెంచనుంది. దీనివల్ల ప్రతినెల రూ.2, రూ.3లకే 30 కిలోల బియ్యం పథకాలను రూపొందిస్తుంది. జనరల్ మార్కెట్‌లో కిలో బియ్యం రూ.36 లకు అమ్ముతున్నారు. సబ్సిడీలో ఇచ్చిన రూ.30 కిలోలు అయిపోయిన తర్వాత రూ.35కి జనరల్ మార్కెట్‌లో కొనాల్సి వస్తుంది. పెరిగిన రేట్లను బట్టి ప్రజలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోలేక పోతున్నారు. దానివల్ల ఎనిమిక్‌గా మారుతున్నారు. మనం ఆరోగ్య కార్యక్రమాలకి ఎంత ఖర్చు పెట్టినా మనుషుల శ్రమకు తగిన ఉపాధిని కల్పించకుండా ఉత్పత్తిని పెంచుకోకుండా శక్తిమంతమైన ఆహారాన్ని తీసుకోగలిగిన స్థాయికి చేర్చకుండా మానవ అభివృద్ధి, భారతదేశ ఆర్థిక ప్రగతి కుంటు పడక తప్పదుకదా!
ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే శ్రామికుడిని గుర్తించాలి. వ్యవసాయ దారుడిని గుర్తించాలి. విద్యావంతుడిని గుర్తించాలి. వారి అభివృద్ధికి , వారి ఉత్పత్తి రంగానికి నిరంతర ఉత్తేజం కలిగించాలి. కేవలం సబ్సిడీల ద్వారా ఉపశమనాల ద్వారా అంకెల గారడీ ద్వారా దేశ సంపద వర్ధిల్లదు. దేశం పురోగతి చెందదు. తప్పకుండా రాజ్యాంగ కర్త డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను ప్రణాళికా సంఘం, బడ్జెట్ రూపకర్తలు సమన్వయించుకోవాలి. నూతన జీవన విధానానికి ప్రత్యామ్నాయ సామాజిక ఆర్థిక జీవన విధానాన్ని రూపొందించగలిగినప్పుడే మానవాభ్యుదయం ప్రతిఫలిస్తుంది. లేకుంటే బడ్జెట్, తాబేదారులకు విస్తరి అవుతుంది తప్ప అభివృద్ధి వుండదు.
- కత్తి పద్మారావు
Andhra Jyothi News Paper Dated : 31/03/2012
No comments:
Post a Comment