ఇరవైఐదేళ్ళ కారంచేడు ఉద్యమం - డాక్టర్ కత్తి పద్మారావు Andhra Jyothi 27/12/2010
కారంచేడు దళితులపై 1985 జూలై 17 మారణహోమం జరిగిన తరువాత పెల్లుబికిన దళిత ఉద్యమం ఆంధ్రుల సామాజిక చరిత్రను మార్చివేసింది. అంతవరకు వర్గాధిపత్యం మీద జరుగుతున్న పోరు, కులాధిపత్యం మీద సిద్ధాంత పరం గా మళ్లింది. వధించిన వారిలో కేవలం వర్గాన్నే చూసేవారు అర్ధ సత్యమే పలుకుతున్నారని ఆ దాడికి ప్రధాన కారణం కులాధిపత్యమేనని దళిత ఉద్యమం తేల్చిచెప్పింది.
దళితుల ఐక్యత వర్ధిల్లాలనే నినాదంతో చీరాలలో 1985 సెప్టెంబర్ 1న జరిగిన 'దళిత మహాసభ' ఒక ఉద్యమానికి, ఒక పోరాటానికి, ఒక సిద్ధాంతానికి బాట వేసింది. మార్క్స్ వర్గాధిపత్య సిద్ధాంతాన్ని భారతదేశానికి అన్వయించినప్పుడు అది అర్ధ సత్యంగానే మిగులుతుందని, అంబేద్కర్ చెప్పిన కుల నిర్మూలనా దిశగా సమాజాన్ని నడిపించాలంటే తప్పక కులాధిపత్యం మీద పోరు చేసి తీరాలని నిర్ధారించింది. కారంచేడులో జరిగిన మారణ హోమం వెనుక కులకక్ష, కుల ద్వేషం, కులాధిపత్య రాజ్య స్వభావం ఉన్నాయని నిగ్గు తేల్చింది.
స్వాతంత్య్రానంతరం లభించిన రిజర్వేషన్ హక్కువల్ల, అనేక సాంఘిక పోరాటాల మూలంగా దళితులు స్వేచ్ఛా స్వాతంత్య్రా ల్ని కోరుకున్నారు. భారతదేశంలో కుల గ్రామం, కుల పంచాయతి ఆనవాయితీ. ఒకే ఊరు కులాలుగా విభజించబడి ముక్క లై ఉంది. బ్రహ్మకున్న నాలుగు ముఖాలు ఊర్లో ఉన్నాయి. శూద్రులు పాదాల దగ్గర ఉన్నారు. దళితులు ఊరికి అవతల వాడలో ఉన్నారు.
మౌఖిక విద్య, ప్రకృతి జ్ఞానం, విశ్వ సంస్కృ తి, సమత్వా మానవత, లోతైన మాతృత్వం ఇవన్నీ దళిత సమాజంలో భాగంగా ఉన్నాయి. లిఖిత విద్య వచ్చిన తరువాత వర్గ సమాజంతో కూడుకున్న, కులతత్వంతో నిండిన ఊరిని దళితవాడ ప్రశ్నించడం మొదలుపెట్టింది. దానికి ఊరు ఉరిమి చూసింది. అదే కారంచేడు దుర్ఘటనకు మూలం.
దళితుల తరఫున చరిత్ర పూర్వకాలంలో ఎందరో పోరాడా రు. చార్వాకులు వర్ణ వ్యవస్థను నిరసించారు. బ్రాహ్మణ ఆధిపత్యం మీద పౌరోహిత పెత్తనం మీద తిరుగులేని పోరాటం చేశారు. బౌద్ధులు మానవులందరూ సమానమేనని సంఘనీతిని బోధించారు. హింస మీద యుద్ధం చేశారు. జైనులు జీవ హింస నే కాదన్నారు. సాంఖ్యులు అణు వాదాన్ని బోధించారు.
వైశేషికులు ప్రకృతివాదాన్ని ముందుకు తెచ్చారు. తాంత్రికులు ఈ శరీరం బూడిదైపొయ్యేదే కనుక దీనికి వర్ణాలు అక్కరలేదని చెప్పారు. ఇవన్నీ దళితవాడల్లో పుట్టిన తత్వ శాస్త్రాలే. బ్రాహ్మణ అగ్రహారాల్లో యజ్ఞ యాగాదులు జంతు బలులే జరిగాయి గాని తత్వ శాస్త్రం పుట్టలేదు. అస్పృశ్య వాడలు పుట్టటానికి కార ణం దళితులు బౌద్ధాన్ని స్వీకరించడమేనని అంబేద్కర్ చెప్పా రు.
వీర శైవులు, వీర వైష్ణవులు భక్తి వాదాన్ని దళిత వాడలకు తీసుకెళ్ళారు. దళిత వాడల్ని చూడని వారెవరు తాత్వికులు కాలేకపోయారు. అస్పృశ్యమైన గీత అవతల మాతృస్వామ్య జీవన వ్యవస్థ బ్రతికుంది. ఈ పునాదుల మీదినుంచే దళిత వాదం, దళిత తత్వం, దళిత ఉద్యమం లేచింది. క్రీ.పూ. 3000 సంవత్సరాల నుంచి భారత సమాజంలో వలస వచ్చిన అనేక జాతులపై చేసిన పోరాటాల స్ఫూర్తి దళితులపై ఉంది.
దళిత ఉద్యమం ఈ చారిత్రక నేపథ్యాన్ని తీసుకుని తన పోరాటాన్ని ప్రారంభించిన తరువాత ఆంధ్రదేశంలో అప్పటికి ఉన్న పార్టీలు, ఉద్యమాలు అన్నీ తమ ఎజెండాలో కులాధిపత్యం కుల వైరుధ్యం, కుల వివక్ష అనే అంశాల్ని చేర్చుకోవాలనే పరిస్థి తి వచ్చింది. దళిత ఉద్యమం చార్వాకుల నుంచి అంబేద్కర్ వర కు, మహాత్మాఫూలే, పెరియార్, నారాయణ గురు వంటి కుల నిర్మూలన పోరాట వాదాలన్నిటిని సమన్వయం చేసుకుంది. అప్పటికి ఎం.ఎల్.పార్టీలు వర్గ నిర్మూలన వాదాన్నే బలంగా చెబుతున్నాయి.
కారంచేడు జరిగిన తరువాత భారతదేశంలో ఉన్న దేశీయ తత్వ శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసిన అంశాన్ని, దేశీయ వాస్తవ పరిస్థితులను స్వాతంత్య్రానంతరం వచ్చిన పరిణామాల కు బేరీజు వేసి ఎం.ఎల్. పార్టీలు తమ సిద్ధాంతాలను సర్దుకోవలసి వచ్చింది. ఈ సిద్ధాంత చర్చలో కులాధిపత్యాన్ని గుర్తించాల్సినంత గుర్తించలేదని కొందరు నాయకులు పార్టీ నుంచి బయటకు కూడా వచ్చారు.
పౌర హక్కుల సంఘాల్లోను, ఓపీడీఆర్ సంఘాల్లోను, విరసంలోను, జనసాహితీ సాంస్కృతిక సమాఖ్యలోనూ భారతదేశంలో కులం ప్రా«ధాన్యం మీద చర్చ జరిగింది. సిపిఎం, సిపిఐలో కూడా బలమైన ప్రశ్న ముందుకు వచ్చింది. ఇది వర్గ సమాజమా? కుల వర్గ సమాజమా? అనే ప్రశ్నల మీద అన్ని పార్టీల్లో ఉన్న దళితులు చర్చ చేశారు.
గ్రామాల్లో మంచినీటి బావుల దగ్గరకు వెళ్ళే దగ్గర, పాఠశాలలకు వెళ్ళే దగ్గర, బస్సులు ఎక్కే దగ్గర, హోటళ్ళలో కూర్చునే దగ్గర, భూముల్లోకి వెళ్ళే దగ్గర, వ్యవసాయం దగ్గర దళితుల ప్రవేశాన్ని నిరోధించాలని అగ్రకులాలు ప్రయత్నం చేస్తుంటే ఎప్పుడో వర్గ నిర్మూలన జరిగిన తరువాత, అందరూ ఆర్థికంగా బాగుపడిన తరువాత కులం పోతుంది. అస్పృశ్యత కూడా పోతుంది- అనే వాదం ఎంతవరకూ శాస్త్రీయం? అనే ప్రశ్న మీద వాదోపవాదాలు జరిగాయి. అయితే దళిత ఉద్యమం కులానికి ప్రత్యామ్నాయమైన ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు నడుస్తూ వచ్చింది.
ఆ తరువాత చిత్తూరు జిల్లా బండ్లపల్లిలో అర ఎకరం భూమికోసం నలుగురు అన్న దమ్ములను, వారి తోబుట్టువుని పొలం లో చంపేసిన సంఘటనను తీసుకొని పోరాడింది. ఆ తరువాత చుండూరులో జరిగిన మారణ హోమంలో ఎనిమిది మంది హతులయ్యారు. ఆ పోరాటాన్ని జాతీయ స్థాయిలో నడిపింది. 107 మంది ఎంపీలను ఏకం చేసి ప్రధానమంత్రితో చర్చలు చేసి ఊర్లోనే ప్రత్యేక కోర్టును సాధించింది.
అనేక పార్టీల్లో దళిత అనుకూల వాదాలను ముందుకు తీసుకెళ్ళిన అనేక ప్రజా సంఘాలు చుండూరు కోర్టులో ముద్దాయిలకు శిక్ష పడడటం కోసం దళిత ఉద్యమంతో పాటు కృషి చేయడం ఒక చారిత్రక మలుపు. అయి తే దళిత ఉద్యమానికి ఉన్న సామాజిక స్ఫూర్తి మండల్ కమిషన్ తరువాత బహుజనుల మీద బలంగా పడింది. అంబేద్కర్‌తో పాటు ఫూలే ఆలోచనలు బిసిల్లో కూడా విస్తరించాయి.
1990 దశకంలో దళిత బహుజనుల సామాజిక, ఆర్థిక, రాజకీయ పోరాటాలు పెరిగాయి. మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఉన్న ఎస్సి, బిసి నాయకులు కూడా ఈ ఉద్యమాల ప్రభావంతో అగ్రకుల పార్టీల్లో కూడా తమ కు మెరుగైన స్థానాల కోసం పోటీ పడటం ప్రారంభించారు. ఎస్సి, బిసి ఎమ్మెల్యే ఫోరంలు ఏర్పడి తమ హక్కుల కోసం పోరాడటం నేర్చుకున్నారు. అనేక ఉద్యోగ సంఘాలు కేవలం తమ డి.
ఏ పెంపుదల కోసమే కాకుం డా ఏదైనా సంఘటన జరిగినపుడు దళిత బహుజన ఉద్యమాలకు మద్దతు పలకడం, రోడ్డున పడడం పెరిగింది. కుల నిర్మూలన భావం, కుల అస్తిత్వ వాదాలనుంచే పెరగాలని అనేక పొర ల్లో కులాలు, ఉపకులాల్లో ఉన్న అంతరాలు కూడా తొలగిపోవాలని ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. కారంచేడు ఉద్యమం ఈ పరిణామాల్లో తన పాత్ర తాను నిర్వహిస్తూ వచ్చింది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో హక్కులు కాలరాయబడుతున్నప్పుడు ప్రతిఘటన పోరాటంలో భాగంగా ప్రత్యేక సెటిల్ మెంట్ ప్రతిపాదన పెట్టింది. కారంచేడులో చనిపోయింది ఆరుగురు అయినా, చుండూరులో ఎనిమిది మంది అయినా ఊరు మొత్తానికి రీహ్యాబిటేషన్ చేయాలనే ప్రతిపాదన పెట్టి ఇళ్లు, భూములు, ఉద్యోగాలు సాధించి దళితుల్లో సాధికారితను పెంచింది.
దళితుల హక్కుల్లో ప్రధానమైన కేసుల విషయంలో పోలీసు కేసులు విఫలమైనప్పుడు ప్రైవేటు కేసులు పెట్టి ముద్దా యి ఎంతటివాడైనా ముఖ్యమంత్రి వియ్యంకుడైనా బోనులో నిలబెట్టడం నేర్పింది. భూస్వాములు శిక్షల నుంచి తప్పించుకోవడం కోసం హైకోర్టు కెళ్ళినా, సుప్రీంకోర్టు వరకు వెళ్లి కుల భూస్వాములకు శిక్ష వేయించగలిగింది. చుండూరులో ఊరిలో నే కోర్టు పెట్టి ముద్దాయిని ఊర్లోనే నిలేసి, సాక్షికి ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం ఇచ్చి సాక్ష్యాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాతావరణాన్ని ఉద్యమం రూపొందించ గలిగింది.
ఈ శిక్షల తరువాత దళితుల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. అంతే గాకుండా కారంచేడు ఉద్యమాల వల్ల దళిత సాహిత్యం, దళిత చరిత్ర, దళిత సాహితీ విమర్శ దళితుల తత్వ శాస్త్రానికి బలమైన పునాదులు పడ్డాయి. దళితులకు వార, మాస పత్రికలు పెరిగాయి. మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో కూడా దళిత సమ్యలకు గుర్తింపు పెరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తరువాత అనేక సందర్భాల్లో దళిత సమస్యకు దృశ్య రూపం కూడా వస్తోంది. ఇది అనేక రంగాల్లో దళిత యుగంగా మారిపోయింది.
భారత, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక సదస్సుల్లో దళిత ఉద్యమ ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అణగారిన శక్తులన్ని కూడా ఏకమవుతున్నా యి. జాతి, మత, కుల, లింగ భేదాలతో అణగ ద్రొక్కబడుతు న్న వారంతా 1999లో మలేషియాలో ప్రపంచ దళిత మహాసభలు జరుపుకున్నారు. అక్కడ కారంచేడు, చుండూరు మృతవీరులకు ప్రపంచ వ్యాప్త ప్రతినిధులంతా నివాళులు అర్పించారు.
కారంచేడు సంఘటన జరిగి ఈ రోజుకి ఇరవై ఐదేళ్ళు. ఈ ఇరవై ఐదేళ్ళలో ఆంధ్రదేశంలో జరిగిన అన్ని పరిణామాల్లో దళిత ఉద్యమ ప్రభావం ఉంది. ముఖ్యంగా తెలంగాణ పోరా టం ముమ్మరమైన తరువాత ఆంధ్ర ప్రదేశ్ దళిత మహాసభ కారంచేడు, చుండూరులో ఎవరైతే నరికారో, ఆ రెండు అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ పోరాటాన్ని సమర్థించింది. కమ్మ, రెడ్డి కులాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో అనేక ఎత్తుగడల్ని వ్యూహాల్ని కూడా దళిత మహాసభ నేర్పింది.
అంబేద్కర్ ఆలోచనలని రాజకీయంగా ప్రయోగంలోకి తీసుకెళ్లింది. కాన్షీరామ్ మార్గంలో రెండు ప్రధాన కులాల ఆధిపత్యా న్ని ఎదుర్కోవడం కోసం ఇతరులతో చేయి కలపడం అనే వ్యూహాన్ని దళిత మహాసభ ఈనాడు అనుసరిస్తున్నది. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత దళితులే రాజ్యాధికారంలో ప్రధాన భూమికను వహించాలనే సిద్ధాంతంతో దళి త ఉద్యమం ముందుకు వెళుతున్నది.
అంబేద్కర్ ఆలోచనలో రాజ్యాధికారమే ప్రధానమైన 'కీ', అది మన చేతుల్లో ఉంటే అన్ని ద్వారాలు తెరవచ్చు అనే అవగాహనతో దళిత ఉద్యమం ముందుకు వెళుతుంది. ఈ శతాబ్దం దళితులది. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఎన్ని దశలున్నా యో దళిత ఉద్యమానికి కూడా అన్నే దశలు, అన్నే మెట్లు ఉన్నాయి. దళితుల అంతిమ విముక్తి వరకూ ఇది సాగుతూనే ఉంటుంది.
దళితులు నిరాపజయులు. ఇది కారంచేడు, చుండూరు మృతవీరులు ఇచ్చిన సందేశం. ఆ మృత వీరుల రుధిర క్షేత్రం, రక్త క్షేత్రం దళితుల పోరాటాన్ని చరిత్రీకరించా యి. అమరులైన వారి స్మృతి చిహ్నాలు భారతీయులకు ఎంత ముఖ్యమో, కారంచేడు, చుండూరు మృతవీరుల స్మృతి చిహ్నా లు దళితులకు అంతే స్ఫూర్తి . చరిత్రను నిర్మించడం కష్టం. ఆ తరువాత అందరూ ఈ చరిత్రలో భాగమనే ప్రకటించుకొంటారు. అదే దళిత ఉద్యమ పరిణామానికి అంబేద్కర్ తత్వ శాస్త్రమే దిక్సూచి.
- డాక్టర్ కత్తి పద్మారావు
(కారంచేడు దళితుల ఊచకోతకు నేటికి 25 ఏళ్లు)
No comments:
Post a Comment