తెలుగు వారి "హోచ్ మాన్"

                                                                                            17.4.12
విప్లవ సూర్యుణ్ణి
ఆకాశం  నుండి 
భూమికి  దించినవాడు
తెలుగు సాహిత్యానికి 
నరుడూ, భాస్కరుడూ,
చెల్లి చంద్రమ్మకు  
నిజమైన అన్న 
ఆకాశాన్ని
నక్షత్రాన్ని ఏరుని
అలని
పోరాటానికి
సంకేతం 
చేసిన వాడు 
పోరాట సత్యమే 
మూర్తిగా కలవాడు
కటకటాల్లో 
కారడవుల్లో 
తెలుగు వారి "హోచ్ మాన్ గా
వెలుగొందిన వాడు 
ఎవరు కాదన్నా
అవునన్నా
తెలుగు వారి విముక్తి భానుడు 
సుర కుటుంబం నుండి 
బైటకు నెట్ట బడ్డ సూర్యుడుల్లా
దగా పడిన వాడు 
అతడే 
శివ సాగరుడు 
తెలుగు వీరుడు 
గర్వించ దాగిన 
విప్లవ వీరుడు 
నరుడు ...
భాస్కరుడు ...
సత్య మూర్తి గారు ఈరోజు మరణించిన సందర్భం గా  1986 లో రాసిన కవిత 

నెలబాలుడు

                                                                                                        17 .4 .12
దళిత విప్లవ యోధుడు 
యుగకర్త
అస్తమించని సూర్యుడు
విరసం మూలకర్త
naxalite ఉద్యమానికి ఒక సాహిత్య వేదిక నిర్మించిన వాడు
విప్లవోద్యమంలో కులాన్ని ప్రశ్నించిన వాడు 
అయన ఉద్యమ కారుడే కాదు ఉద్యమ నిర్మాణకర్త

శివసాగర్ గా విప్లవకారుడుగా ఆవిర్భవించాడు 
నేలబాలుడితో తాత్విక దృక్పధాన్ని 
కవిత్వంలో తీసుకు వచ్చిన వారు
దళిత ఉద్యమానికి విప్లవ స్పూర్తిని అందించిన వాడు 
దళిత ఉద్యమం ఒక పోరాట కేంద్రంగా మలచాడు 
Dr .అంబేద్కర్ లోని విప్లవ తాత్విక దృక్పధాన్ని 
కొత్త కోణంలో ప్రపంచానికి పరిచయం చేసిన 
కే.జి సత్యమూర్తిగారికి నివాళ్ళు అర్పిస్తున్నాం
                                                                                      Dr.Kathi  Padma Rao  

అంబేడ్కరుడా!

కుల నిర్మూలనోద్యమ భాస్కరా!
బౌద్ధ సంస్కృతీ పరివ్యాప్త కర్తా!
సంఘ పునర్నిర్మాణ దక్షుడా!
సామాజిక విప్లవ జ్యోతీ!
అక్షర గవాక్షాలు తెరిచిన దార్శనికుడా!
నూతన నాగరికతలకు వారధుడా!
సాంస్కృతిక విప్లవ పతాకా !
అంబేడ్కరుడా!
122 సంవత్సరాలు తర్వాత
కూడా నీ స్మృతి ఒక ప్రపంచ దర్శనం.
మనుధర్మానికి ప్రత్యామ్నాయం నీవు
నీకు ఇదే నా అభివాదం
ఇదే నా అభివాదం

అంబేద్కర్

అంబేద్కర్ ఓ అస్తమించని సూర్యుడు
తిరుగుతున్నా భూగోళం 
ప్రవహిస్తున్న నది 
పొంగుతున్నసముద్రం
మరోబుద్ధుడు మరో అశోకుడు 
భారత రాజ్యాంగ జీవన శిల్పి
ఆయన విగ్రహం ఒక చెరపలేని చారిత్రక గుర్తు 
ఒక పరిణామానికి మైలురాయి 
ఆయన విగ్రహాన్ని కూల్చటం అంటే 
జాతి వ్యక్తిత్వాన్ని కూల్చుకున్నట్టే 
తండ్రి కన్నుల్లో బల్లెంతో పోడిచినట్లే
అంబేద్కర్ నిత్య జీవన కళారూపం
ఆయన్ని శిధిలం చేయగలిగిన శక్తి
ఏ సమూహానికి లేదు
ఆ మూర్తిత్వాన్ని
అసెంబ్లీ ముందు నిర్మించండి
ప్రజాస్వామ్య సంస్కృతికి బాటలు వేయండి
జైభీమ్ జైభీమ్


డా.కత్తి పద్మ రావు

ఎండ బతుకు

                                                                                          12 .4 .12
ఆ అమ్మ ఓ కుండెడు 
నీళ్ళు మోసుకు నడుస్తూనే వుంది. 
సెగ ఇసిరి ఇసిరి 
కొట్టేటప్పుడు కూడా 
కళ్ళలో వున్న కాంతి తగ్గలేదు 
నదీ తరంగాల ప్రక్కన జీవిస్తున్నామా!
ఇసుక మేటల ప్రక్కన జీవిస్తున్నామా !
అన్నది కాదు.
కొంగు చాటుగా 
సూర్యుడు దాక్కోవాలనుకున్నాడు. 
అన్నీ చిరుగులేమరి
ఇసుక మేటలకు కందిన అరికాళ్ళు 
ప్రకృతి కొన్నిసార్లు  
పేదలకు శత్రువా !
మిత్రమా !
హద్దులు దాటినపుడంతా
అది పిల్లలు గన్న తల్లుల పైనే 
కాలు దువ్వుతోంది సుమా !       

నిశ్శబ్దం

                                                                                      9 .4 .12


నిశ్శబ్దం ఒక అంతరంగ సంగీతం
నిశ్శబ్దం ఒక లబద్ధ గీతం 
నిశ్శబ్దం ఒక చారిత్రిక  ఆవహనం  
నిశ్శబ్దం ఒక పరిమళ  పూలగుచ్చం
శబ్ద  ప్రపంచం ఒక ధ్వని కాలుష్యం  
మనిషి  తననుతాను  పునర్వివేచించు  కోవడానికి 
కొన్నిక్షణాలు  దాచుకోలేక పోతున్నాడు 
వేగం అతివేగం అంతర్మధనానికి దూరం 
సింహం కూడా వెనక్కి తిరిగి చూసుకున్నాకే
ఒక్కడుగు ముందుకు వేస్తుంది.

Dr .Kathi  Padma Rao






























































































మీరు నిజంగా నిద్ర పొండి

                                                                        9 .4 .12
పెదాల పై పలకరింపులు
రాలిపోతున్న పూల వంటివి
హృదయం నుండి మాట్లాడడం
బాగా తగ్గిపోతున్న కాలమిది
మానవ సంబంధాలు
ఆర్ధిక సంబంధాలుగా మారుతున్నాయి
ఆ శిశువు నవ్వులోనే
సుగంధ పరిమళాలు
నిజమే!
ఆ పాప ఎక్కువ సేపే నిద్రిస్తుంది
ఈ కృత్రిమ సమాజంలోకి ప్రవేశించడానికి
తన మెదడుని సిద్ధం చేసుకోవడానికే నిద్రిస్తుంది
సూర్యోదయానికి ముందు
వీస్తున్న చల్లని గాలి కోసమే
ఆ పాప ఎదురు చూపు
మానవులారా!
మీరు నిజంగా నిద్ర పొండి
మేల్కోవడానికి అప్పుడే
అర్ధం తెలుస్తుంది.

అటువైపే నా ప్రయాణం

                                                                                8.4.12
ప్రేమ వైయక్తికమైతే 
ఒక జీవితం ఒక వ్యక్తికే సరిపోతుంది 
ప్రేమ విశ్వజనీనం అయితే 
ఒక జీవితంలోనే సమాజాన్ని మార్చొచ్చు 
చెట్టు ఇచ్చే ఫలాలు 
అందరికీ చెందినవవడం వల్లే 
మనిషి జీవించగలుగుతున్నాడు 
నేనూ నా పిల్లలు అనే సిద్దాంతం 
నిన్నటిది 
నాకు నేనే అనేది 
ఈ నాటి వర్తన
నేనూ, నీవు, మనం అంటేనే
సమాజం వర్ధిల్లుతుంది
ప్రేమ విస్వజనీనమైతేనే
ప్రేమ, ప్రజ్ఞ, కరుణ వర్దిల్లుతాయి
అటువైపే నా ప్రయాణం.

స్నేహ పాత్రత

                                                                                            6.4.12
మనిషి తననుతాను 
నిర్మించు కోవడం చాలా కష్టం 
ఎవరి లోపాలు వారు గుర్తించడమే 
వ్యక్తిత్వ నిర్మాణంలో మొదటి అంశం 
ఏది చెప్తున్నామో అది చేస్తే 
సామాజిక కాలుష్య ముండదు
మానవాభ్యుదయం 
స్నేహ పాత్రత లోనే వుంటుంది.
డా.కత్తి పద్మారావు