అన్ని మతాల్లోకి మనువు

జిగేలుమంటున్న స్టార్లు
వీధుల నిండా కట్టి వున్నాయి
మనుషులు సంతోషంగానే వున్నారు
వారి పండగ వారు చేసు కుంటున్నారు

క్రీస్తు  పుట్టినరోజు ద్రాక్షా రసం
ఏరులై పారుతుంది
ప్రజలు మత్తులో జోగుతున్నారు
ప్రతి సంతోషం వెనుక ఒక దుః ఖం
అవునూ!
ఏసు  అంటే మేలు కొలుపే  కదా !
వీరు మత్తులో ఎందుకుంటున్నారు?
ప్రభుత్వాల దమన కాండను
ఎందుకు సహిస్తున్నారు ?
ప్రవహిస్తున్న నదీ తరంగాలలో 
వీరు ఒక అలగ  ఎందుకు లేరు?
క్రీస్తు బోధించిన నీతికి భిన్నంగా 
వీరు ఆయన దేవాలయ ప్రాంగణాలను
ఐదు నక్షత్రాల హోటళ్లకు ఎందుకు విక్రయిస్తున్నారు?
సమాజ సేవ పేరుతో  అనాధ పిల్లల
రొట్టెలను ఎందుకు కాజేస్తున్నారు?
మురుగు వాడల్లో ఎందుకు కునారిల్లు తున్నారు?
చలికి వణుకుతున్నముదుసళ్ళ కిచ్చిన రగ్గులను
మార్కెట్ చేస్తున్నది ఎవరు?
దోపిడీ ప్రభుత్వాలను దీవిస్తూ
దీప స్తంభాలను వెలిగిస్తున్నవారెవరు?

అవును !
వీరు హిందూ  సామ్రాజ్య వాదానికి
క్రీస్తు పేరు తో కొమ్ము కాస్తున్నారు
గుజరాత్ ఎన్నికల్లో మోడికి పట్టం గట్టిన
వీరి అవకాశవాదానికి
క్రీస్తు కన్నీరు కార్చడం లేదా!

 అవును !
 క్రిస్మస్
దళితుల జీవితాల్లో ఒక వెన్నెలే
కొత్త జండా
కొత్త బట్టలు
కొత్త సువార్త
అది ఒక నాటి మాట


ఈనాడు
చీకటి దొంతర్ల  మధ్య
చిరిగి పోతున్న జీవితాలను
అద్దంలో  చూపించి
సుఖ భోగాలనుభవిస్తూ
భోక్త స్వాముల దురన్యాయానికి
ఒక సాదృశ్యం

మనుస్మృతి  అన్ని మతాలకు ఈనాడు దర్శన మయ్యింది
అన్ని మతాలూ వర్ణ తత్వాన్నే పోషిస్తున్నాయి
కులం హద్దులు దాటలేక ప్రవక్తల్ని కూడ
కుల, వర్ణ, జాతి  గిరుల్లోకే మళ్లి  లాగుతున్నారు
విశ్వ  జనీన మైన భావనలు రంగురంగుల బూరల్లా  పగిలిపోతున్నాయి
సాంప్రదాయం  చాందసత్వం  బుర్రల్లో కూరుకుపోయి
నీతి , వ్యక్తిత్వాలు రాను రాను నశిస్తున్నాయి 
ఒక పక్క పెద్ద పెద్ద చర్చిలు, మసీదులు, గురుద్వారాలు
మర ఒక పక్క రామాలయాలు
మధ్యలో మాన భంగాలు
ఇది మన మతాలు సాధించిన సెక్యులర్ నీతి
ఈనాడు  మనకు కావల్సింది మనుధర్మం కాదు మానవ ధర్మం 

అంబేద్కర్ మతం మారటం కాదు
హిందూ వాదానికి
ప్రత్యామ్నాయాన్ని సృష్టించటమే
నిజమైన విప్లవం అన్నాడు
ఆ పండగ  కోసం ...........


డా . కత్తి పద్మారావు
25.12.12

కన్నీళ్లు ఇంకిన చోట

కన్నీళ్లు ఇంకిన చోట 

నాటకాలు నడుస్తున్నాయి
దుఃఖం నటిస్తున్నారు
ఎవరు దోపిడీ దారులో వారే
దొంగలు దొంగలని  కేకలేస్తున్నారు
దేశంలో దొంగలు బడ్డారు 
ఇప్పుడొక హాస్య నాటిక !

సముద్రం కదలాడినపుడంత 
ఆ గుడిసె కు గుండె పోటే మరి 
వారెందుకో దేనికోసమో 
పాకులాడుతూనే వుంటారు   
ఏది దొరికినా మరోకదానికోసమ్  
అన్రెస్ట్  మరి 
స్థిరత్వం  వారికి   కోరవడింది  
చెట్టులు,  పుట్టలు 
వాగులూ, వంకలు పట్టుకు 
తిరుగుతున్నారు 

అవును!
దేశంలో ఏమ్మార్పుంది? 
కన్నీళ్లు ఇంకి ఇంకి 
భూమి గిడస బారింది 
గ్యాసు నిధులు  
ఖనిజ సంపద
బొగ్గు గనులు 
సముద్ర  తీరాలు 
ఒకటేమిటి
అన్నింటిని అమ్ముకున్న వాళ్ళు 
ఊరూరా విగ్రహాలయ్యారు 
ముందు అందరూ శభాష్ అన్నారు 
తర్వాత అందరూ దిష్టి బొమ్మ అన్నారు 

అవును! 
అనేక మంది హతులు ప్ర సిద్ధు లే 
హంతకులు అనామకులు 
ప్రతి కుంభ కోణం వెనుక 
ఒక అగ్ని పర్వతం

అవును! 
చైనా సముద్రంలో
అమరులైన భారతీయులు 
స్మృతి  వెనుక ఎవరి  అలసత్వం  వుంది?
కాశ్మీరు తెల్ల తెమ్మెర్లలో 
ఎర్ర  చారలు  
ఏ గులాబీ  రేకులవి?
    
నిజమే!
తవ్విన కొద్ది 
ఎన్ని పుర్రెలు 
ఎన్ని కధలు 
చెప్తున్నాయో
ఒక్కో విగ్రహం వెనుక
ఒక్కో అరణ్య పర్వం వుంది 
వ్యక్తిత్వాల ప్రకాశం 
సత్య వాక్కుల్లోనే వున్నాయి 
సత్యం ఒక జీవన వేదం.

Dr. Kathi Padma Rao 
21.10.12




లక్షింపేటలో 'కారంచేడు' -డాక్టర్ కత్తి పద్మారావు

రాష్ట్రంలో దళితుల మీద అగ్రకులాల దమనకాండ నిరంతరం సాగుతూనే ఉంది. రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తుంటే ఆ కులాల వాళ్ళు దళితులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఎన్‌టి రామారావు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వియ్యంకుడి ఊరు కారంచేడులో ఆరుగురు దళితుల్ని ఊచకోత కోశారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లా చుండూరులో ఎనిమిది మంది దళితుల్ని తలలు నరికి తుంగభద్రలో తొక్కారు. ఇప్పుడు బీసీగా చెప్పుకుంటున్న బొత్స పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బొత్స వాసుదేవరావునాయుడు తూర్పు కాపుల గుంపు కత్తులతో గండ్రగొడ్డళ్లతో శ్రీకాకుళం జిల్లా లక్షిం పేటలో దళితుల్ని చిత్ర వధ చేసి చంపడం జరిగింది. 

అసలేం జరిగింది? శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్షింపేటలో భూస్వామ్య తూర్పుకాపులు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో దళితపల్లెని చుట్టుముట్టారు. బరిసెలు, గండ్రగొడ్డళ్లు, బాంబులు, కత్తులతో ఒక్కొక్కింటికి 20 మంది చొప్పున చుట్టు ముట్టారు. ఇంట్లో ఉన్నవారిని బయటికి లాగారు. అమానుషంగా, దారుణంగా బూతులు తిట్టారు. కుల అహంకారంతో 'మీరు కూడా పొలాలు చేసే అంతటి వాళ్ళు అయ్యార్రా మాల నా కొడుకుల్లారా!' అని దూషించా రు. 'మా పక్కన పొలాలు దున్నేంతటి వాళ్ళా!' అని నివర్తి వెంకటి (60), ఆయన కుమారుడు నివర్తి సంగమేష్ (35)ను, బూరాడ సుం దరరావు (35), చిత్తిరి అప్పడు (25) -ఈ నలుగురి పైన అమానుషంగా దాడి చేశారు. 

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురుప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి.బెంజిమన్, నూతలపాటి చంద్రశేఖర్, బోకర నారాయణరావు స్వయంగా చూసిందాని ప్రకారం ఒక్కొక్కరి దేహంపై 40, 50 కత్తి, బల్లెం పోట్లు ఉన్నాయి. ఈ దాడి కక్షతో జరిగింది. దీని వెనుక పథకమూ, వ్యూహమూ, ద్వేషమూ ఉన్నాయి. ఈ పోట్లు పడిన వెంటనే వెంటనే అక్కడికక్కడే మరణించారు. వీరు భూమి పోరులో అమరులయ్యారు. కుల ద్వేషానికి ఆహుతయ్యారు. ఈ నలుగురిపై దాడి సంఘటనలో తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తి బొద్దూరి పాపయ్య (60) బుధవారం విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆస్పత్రిలో మరణించారు. అంటే లక్షింపేట ఊచకోతలో మొత్తం ఐదుగురు బలయ్యారు. 

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆయా ప్రాంతాల్లో ఉన్న భూమి కలిగిన కులాల వాళ్ళు కమ్మ అయినా, రెడ్డి అయినా, కాపు అయినా, కాళింగులు అయినా, వెలమ అయినా, క్షత్రియులు అయినా దళితులు భూమి దున్నుతుంటే కళ్లలో కారం చల్లుకోవడం, సహించలేకపోవడం, దళితులకు భూమి మీద హక్కులేదు అని కక్ష కట్టడం, వారి మీద దాడులు చేయడం, పల్లెల నుంచి వెళ్లగొట్టడం జరుగుతోంది. ఈ కుల ద్వేషానికి రాజ్యాధికారానికి అవినాభావ సంబంధం ఉంది. పెద్దల అండ వల్లే ఈ దారుణం జరిగింది. ఆంధ్రులు ఎంతో సిగ్గు పడాల్సిన ఈ దారుణ, అమానుష సంఘటనలో హతులతో పాటు మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.


ప్రస్తుతం వీరు శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలమట గణపతి (35), కలమట ప్రకాశ్ (50), కలమటి సింహాచలం, కలమటి గంగులు, గోనెల రవి (25), నివర్తి గంగయ్య (50), కలమట గడ్డియ్య (లచ్చయ్య కుమారుడు), కలమటి గడ్డయ్య (చిన ముత్యాలు కుమారుడు), నివర్తి సింహాచలం, నివర్తి నర్సయ్య, నివర్తి రామారావు, బొద్దూరి బోగేషు, గొంగాడ శివుడు, నివర్తి దారప్పడు, నివర్తి గంగయ్య, కలమటి సంగమ్మ, చిత్తిరి ఎల్ల య్య, కలమటి గంగులు, బొద్దూరి గౌరయ్య ఆస్పత్రి లో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. 

లక్షింపేట ఘటన కారంచేడు, చుండూరు తరువాత అతిపెద్ద అగ్రకులాల దమన కాండ. ఈ కుల ముష్కరులు రెండున్నర గంటలు మారణాయుధాలతో దళితులను చుట్టు ముట్టి వెంటాడి, వేటాడి మృత దేహాలపై కూడా వికటాట్టహాసాలతో కత్తులతో పాశవికంగా దాడిచేశారు. ఇక్కడ తూర్పుకాపు భూస్వాములు పేరుకి బీసీలైనా కుల అహంకారం ఉన్న వారు. శ్రీకాకుళం జిల్లాలో కాళింగులు, కొప్పుల వెలమలు, తూర్పు కాపులు, కోస్తాంధ్రలో కమ్మ, రెడ్డి, క్షత్రియులు నిర్వహించే పాత్రని నిర్వహిస్తున్నారు. 


భూస్వామ్య కాపులు చేసిన ఈ దాడిలో పక్క గ్రామా ల్లో ఉన్న తూర్పుకాపులు కూడా కులం, బంధుత్వంతో పాల్గొన్నారు. ఈ దారుణమైన దాడి వలన 26 సంవత్సరాల చిత్రి శ్రీదేవి, బోరాడ కాసాలు, నివర్తి రాముడమ్మ, నివర్తి వెంకటమ్మ భర్తల్ని కోల్పోయిన అనాథలుగా మిగిలిపోయారు. వీరందరు 30-40 ఏళ్ళ మధ్య వయస్సు వాళ్ళు. వీళ్ళందరూ మాతృమూర్తులే. ఉదయం ఐదు గంటలకు భర్తలు కలిగివున్నవారు 7.30 గంటలకు భర్తల్ని కోల్పోయారు. వాళ్ళు చేసిన తప్పేంటి? 

80 దళిత కుటుంబాలు 60 ఎకరాల గవర్నమెంటు భూమిని దున్నుకోవటమా? అది 2002లో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ స్వయంగా భూమిని కేటాయించి మీరు దున్నుకోండి అంటే ఒక్కొక్కరూ 45 సెంట్లు పంచుకుని దున్నుకుంటున్నారు. ఈ దేశంలో దళితులు భూమి దున్నుకోవడం తప్పా? దానికి కళ్ళలో నిప్పులు పోసుకోవాలా? ఈ ఘటన మీద సిబిఐ విచారణ చేయించకుండా మాఫీ చేయడం కోసం శవాల్ని పూడ్చి పెట్టక ముందే వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కేవలం మొక్కుబడిగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించి రావడం ఆయన అగ్రకుల భూస్వామ్య తత్వానికి నిదర్శనం. ప్రతి చిన్నదానికి సిబిఐ ఎంక్వైరీ వేసే ఈ పెద్ద మనుషులు ఇంత మారణ హోమం జరిగితే ఎందుకు వేయటం లేదు? పెద్దలు ఇరుక్కుంటారనే కాదా? 

లక్షింపేట బాధితులు చిత్రి గంగయ్య, గొంగోడ గంగయ్య, నివర్తి సింహాచలం, నివర్తి తిరపతిరాజు, బోడిసింగు రాము చెప్పిన వివరాలివి: తాము సాగుచేసుకొంటున్న భూమి పది సంవత్సరాల క్రితం మద్దుకూరు రిజర్వాయరు కోసం వివిధ కులాల వారి నుంచి సేకరించినది. వారందరికీ ప్రభుత్వం అప్పుడే ఎక్స్‌గ్రేషియా ఇచ్చివేసింది. ఇప్పుడు ఇది అసైన్డ్ ల్యాండ్. ప్రభుత్వానికి ఎవరికైనా ఇచ్చే అధికారం ఉంది. ఈ 250 ఎకరాల భూమిని దళితులకు ఇస్తున్నట్టు ఇంత రక్తం నేలలో ఇంకిన తరువాత కూడా ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటించలేదు? ఇక్కడ ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకిగా వ్యవహరించారు. ఇది ముఖ్యంగా దళిత మంత్రి కొండ్రు మురళి నియోజక వర్గం. 


దళిత మంత్రులు సిబిఐ విచారణని కోరక పోవడం, 250 ఎకరాల భూమిని కోరకపోవడం అధికార వర్గానికి భజనపరులుగా ఉండి, దళితులపై కత్తులతో దాడులు జరిగినా పదవీ వ్యామోహంతో వ్యవహరించడం సిగ్గుచేటైన విషయం. వీళ్ళు ఏ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల ద్వారా మంత్రులయ్యారో ఆ విషయాన్ని విస్మరించారు. ఈనాడు దళిత ప్రజా సంఘాలు, లెఫ్ట్ పార్టీల అనుబంధ దళిత ప్రజాసంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయి. ఈ డిమాండ్లు నెరవేరే వరకు అన్ని ప్రజాశక్తులు మూకుమ్మడిగా అగ్రకుల రాజ్యాధికారం మెడలు వంచి దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని విజయవంతం చేయాల్సిన చారిత్రక సందర్భం ఇది. 

దళిత ఉద్యమాల ఐక్యతే ఈనాటి పోరాటరూపం. నేలలో ఇంకిన దళితుల నెత్తురు వృధా పోదు. ఈ నెత్తుటి ప్రశ్నకు చరిత్ర సమాధానం చెప్పాల్సిందే. అమరవీరులైన వారి ఆత్మగౌరవ భేరి మోగుతుంది. దళిత శిబిరం లక్షింపేటలో ఆత్మరక్షణ నినాదం చేస్తుంది. ఐదుగురు చనిపోయినా బాధితులు నిస్సారంగా లేరు. 250 ఎకరాలు దళితుల సొంతం అయ్యేవరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటంలో భాగస్వాములవుతున్న ఎర్ర, నీలి ఉద్యమాలన్నీ ఈ డిమాండ్లు నెరవేరేవరకు ఐక్యంగా పోరాడాలి. 

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మిగిలిన సంఘాలతో కలిసి, బాధితులతో కలిసి పనిచేస్తుంది. ఈనాటి ఈ దళిత ఆత్మగౌరవ ఉద్యమం కులాధిపత్యాన్ని, భూస్వామ్య ఆధిపత్యాన్ని, రాజ్యాధిపత్యాన్ని నిలదీయాల్సిన చారిత్రక సమర దినాలివి. దళిత బహుజన మైనారిటీల్లారా! పార్టీల్ని పక్కన పెట్టి నెత్తురు ఇంకిన నేల నుంచి వస్తున్న పెను కేకలకు స్పందించండి. దళిత సమరయోధులుగా పోరుకు సిద్ధంకండి. చరిత్ర పీడితులదికాదు పీడించబడేవారిదే. తిరుగుబాటే విజయానికి బాట. 


(ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో జూలై 17న 'చలో హైదరాబాద్' కార్యక్రమం తీసుకుంటున్నాం. అందరూ కలిసి రావాలని పిలుపునిస్తున్నాం.)

-డాక్టర్ కత్తి పద్మారావు


కార్పొరేట్లకు దాసోహం పేదలకు రిక్త హస్తం!
June 7, 2012
ఏదీ తేల్చని వర్కింగ్‌ కమిటీ సమావేశం
ప్రధానిని రక్షించే పనిలో అధినేత్రి
అంతుపట్టని ద్రవ్యోల్బణం మూలాలు
బొగ్గు గనుల కుంభకోణంలో సతమతం
ప్రత్యామ్నాయ వ్యవస్థే శరణ్యం 

Soniaఇటీవల జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశ వివరాల్ని గమనిస్తే, జాతీయోద్యమాన్ని నడిపి ఎంతో ప్రతిష్ఠ తెచ్చుకున్న కాంగ్రెస్‌కు ఈ దుర్గతి పట్టిందా అని ఎవరెైనా ఆశ్చర్యపోతారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడుతూ, అనేక రాష్ట్రాల్లో ఓటమికి గురవుతూనే ఉంది. తన నాయకత్వంలోని యూపీఏ పాలన మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా అనేక గొప్పలు చెప్పుకుంది. చివరకు స్వయంగా సోనియా గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్‌ను ఆరోపణల బారినుంచి రక్షించుకోవలసిన దశకు పార్టీ చేరింది. ఆమ్‌ ఆద్మీ నినాదంతో గద్దె నెక్కిన యూపీఏ-2 మంత్రివర్గంలో ప్రణబ్‌ ముఖర్జి, శరద్‌ పవార్‌, కపిల్‌ సిబాల్‌, జయరామ్‌ రమేష్‌, కిశోర్‌ చంద్రదేవ్‌ వంటివారి శాఖల్లో కూడా ప్రావీణ్యత కనపడడం లేదు. 14 మంది కేంద్ర మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అన్నా హజారే బృందం సంధిస్తున్న బాణాలకు క్షతగాత్రులు కావడమేకాని తిరిగి సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో సతమతమవుతున్నారు.

సోనియా గాంధీకి భారతదేశం అర్థం కాలేదు. కాంగ్రెస్‌లో పెద్ద మనుషులు గా చెలామణి అవుతూ తన వెంట నడుస్తున్న వారిలో ఎక్కువ మంది కార్పొరేట్ల గొడుగు నీడలో ఉన్నారని తెలుసుకోలేక పోతున్నారు. ప్రభుత్వ పరిపాలన గాడితప్పి, జీడీపీ స్థాయి 9 నుంచి 6 శాతానికి పడిపోతుంటే దాని మూలాన్ని ఆమె అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆహార ధాన్యాల్ని ఇతర దేశాలనుంచి ఇబ్బడి ముబ్బడిగా దిగుమతి చేసుకుంటూ, రెైతులకు గిట్టుబాటు ధరలేక జీవించే హక్కును కోల్పోతున్న వెైనానికి మూల కారణం ఏమిటో ఆమె అర్థం చేసుకోలేక పోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒకటొకటిగా కూలుస్తూ, ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, సునీల్‌ బి. మిట్టల్‌, అనీల్‌ అగర్వాల్‌, మాలెైన్‌ పీటర్స్‌, లక్ష్మీ మిట్టల్‌, కె.ఎం. బిర్లీ, అనిల్‌ అంబానీ, శశి రూయా, సజ్జన్‌ జిందాల్‌ వంటి ప్రెైవేట్‌ పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ దిగ్గజాలకు దాసోహమంటున్నారు.

దేశ సంపదను, మూల వనరులను ఇటివంటి వారందరికీ తాకట్టు పెట్టడంవల్ల దేశం అధోగతి పాలవుతుందని సోనియాగాంధీ గానీ, ప్రధాన మంత్రిగానీ గుర్తించక పోవడమే ద్రవ్యోల్బణం నానాటికీ పెరగడానికి కారణమవుతోందని తెలుసుకోలేక పోతున్నారు. నానాటికీ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో వర్కింగ్‌ కమిటీ వివరించలేక పోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోలు ధర ఎందుకు పెరుగుతుందో వర్కింగ్‌ కమిటీ తేల్చలేకపోయింది. ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో పాత్రధారులెైన అధికార బృందం ఆర్‌.ఎస్‌. గుజ్రాల్‌, జె.ఎస్‌. శర్మ, పులో్‌ ఛటర్జీ, జోహ్ర ఛటర్జీ వంటివారి తప్పుడు నడకల వల్ల కార్పొరేట్‌ సంస్థలకు మేలు కలుగుతూ ప్రభుత్వ రంగ సంస్థలు శిథిలమౌతున్న విషయంపెై నోరు విప్పలేక పోయారు.

అన్ని వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, సామాన్యుడి మీద పన్నుల భారం ఎందుకు పడుతున్నది, విద్యుత్తు, నీరు, విద్య, ఉపాధి రంగాలన్నీ ఎందుకు కుంటుపడుతున్నాయనే అంశాలమీద నిర్దిష్టమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేదు. పొరుగు దేశం చెైనా స్ర్తీల శ్రమశక్తిని వస్తూత్పత్తికి ఉపయోగించి ప్రపంచ దేశాలకు వస్తువులు ఎగుమతి చేసుకోగలుగుతోంది. క్రియాశీలకమైన ఆర్థిక, రాజకీయ వ్యవస్థల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగాయి. 2 జీ స్ప్రెక్ట్రమ్‌లో లక్ష 76 వేల కోట్ల రూపాయల ధనాన్ని రికవరీ చేయడానికి ఏమి చర్యలు తీసుకున్నదో ప్రభుత్వం వివరించలేకపోతోంది. అవినీతి పరుల విషయంలో సుప్రీం కోర్టు అక్షింతలు వేసినా కాని అరెస్టులు చేయడం లేదు. మళ్లీ వారు బెయిళ్లపెై బయటకు వస్తున్నారు. విద్యా వ్యవస్థను మరింత విస్తృతం చేయడానికి ప్రయత్నించకుండా దాన్ని కూడా చివరకు అంతర్జాతీయ సంస్థలకు తాకట్టు పెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. ఫలితంగా అట్టడుగు కులాల ప్రజలు ఉన్నత విద్యను అందుకొనే అవకాశాలు అంతరిస్తాయి.

పాశ్చాత్యీకరణ చెందుతున్న ఉన్నత విద్యలో ఉపాధి కల్పన కంటే ఇతర హంగులే ఎక్కువ. విద్యకు ప్రభుత్వం పెట్టే ధనం కూడా పెట్టుబడిగా మారి ధనవంతుల పిల్లలే ఉన్నత విద్యను, కార్పొరేట్‌ విద్యను అందుకోగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. కపిల్‌ సిబాల్‌ జాతీయ విద్య పేరుతో ఇంగ్లీష్‌ ప్రాధాన్యాన్ని పెంచి, జాతీయ భాషలెైన హిందీ, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, ఒరియా వంటి ప్రాంతీయ భాషల్లో పుట్టి పెరిగిన దళిత బహుజన మైనారిటీ విద్యార్థుల్ని ఉన్నతంగా ఎదగకుండా చేస్తున్నారు. ఫలితంగా రాబోయే తరాల్లో ధనికుల విద్యకు- బడుగు వర్గాల విద్యకు దేశ వ్యాప్తంగా అంతరం ఏర్పడి ఒకే దేశంలో ఇంగ్లీష్‌ సంస్కృతికి, దేశీయ సంస్కృతికి చెందిన పిల్లలు రెండు తెగలుగా విడిపోయే ప్రమాదం ఏర్పడింది.ఇప్పుడు ప్రధాన మంత్రి మీద వచ్చిన బొగ్గుకు సంబంధించిన ఆరోపణలు కూడా తక్కువేమీ కావు. 2006-09 మధ్య కాలంలో బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రధాని అజమాయిషీలో ఉండగా జరిగిన కేటాయింపులపెై ‘కాగ్‌’ నివేదిక- కేంద్ర పాలకుల వెైఫల్యాన్ని ఎండకట్టింది.

‚దేశానికి బొగ్గు అతి కీలకమైనది. భారత దేశంలోని అన్ని పరిశ్రమలు బొగ్గు మీదే ఆధారపడి నడుస్తున్నాయి. బొగ్గు భారతీయుల జీవన వనరు. ఆ శాఖ శిబూ సోరెన్‌ దగ్గరి నుంచి ప్రధానమంత్రి చేతికి వచ్చింది. మునుపటినుండి జరిగిన అవకతవల్ని కాగ్‌ నివేదిక బయట పెట్టింది. ప్రభుత్వ ఖజానాకు రూ. 10 వేల 64 లక్షల కోట్ల నష్టం వాటిల్లిం దని కాగ్‌ నివేదిక పేర్కొంది.
2004-09 మధ్య కాలంలో 156 కోల్‌ బెల్టులను 100 ప్రెైవేటు కంపెనీలకు, కొన్ని ప్రభుత్వ సంస్థలకు కేంద్రప్రభుత్వం కట్టబెట్టిన వెైనంపెై కాగ్‌ ముసాయిదా నివేదికను రూపొందించింది. లబ్ధి పొందిన కంపెనీల్లో జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, టాటా గ్రూప్‌, అదిత్య బిర్లా గ్రూప్‌ వంటి ప్రెైవేట్‌ సంస్థలతో పాటు ఎన్‌టీపీసీ, పలు రాష్ట్రాల విద్యుత్‌ బోర్డులున్నాయని పేర్కొంది. ఈ కేటాయింపుల సందర్భంగా ప్రభుత్వం బొగ్గుగనులను చాలా తక్కువ ధరకు విలువ కట్టిందని, వేలంపాట నిర్వహించి ఉంటే ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరి ఉండేదని కాగ్‌ వ్యాఖ్యానించింది.

ఈ నివేదికలన్నింటిని అనేక పత్రికలు తమ పరిశోధనాత్మక జర్నలిజంద్వారా బయటపెట్టేవరకు ప్రభు త్వం దాచి ఉంచడం వల్ల దేశ ప్రయోజనాలు కుంటుపడుతున్నాయి. నిజానికి బొగ్గు తవ్వకాల్లో ప్రభుత్వ సంస్థలకు ఉన్న సామర్థ్యం ప్రెైవేట్‌ సంస్థలకు లేదు. 155 కోల్‌బెల్ట్‌లను 100 ప్రెైవేట్‌ కంపెనీలకు అప్పజెప్పడం వల్ల భారతదేశ సామాజిక సంపదకు జరుగుతున్న నష్టాన్ని కాంగ్రెస్‌ పూడ్చగలదా! దీనంతటికీ కారణం- ప్రధానమంత్రి నీతిమంతుడనే కితాబిచ్చి సరళీకరణ, ప్రెైవేటీకరణ, ప్రపంచీకరణ, పాశ్చాత్యీకరణ, కార్పొరేటీకరణలను ముమ్మరం చేసి, పాలకపక్ష మంత్రులు, ఎంపీలు కోట్లకు పడగలెత్తుతున్నారు.
ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జయరామ్‌ రమేష్‌ ఉపాధి హామీ పథకాన్ని ఎద్దేవా చేస్తున్నారు. అది మట్టి తీసి మట్టేసే పథకం, అందులో సృజనాత్మకత లేదు, ఉపాధికి హామీ లేదు, గ్రామాల పునరుజ్జీవనం లేదంటున్నారు. పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్‌ పరిశ్రమలు అభివృద్ధి చెందితే చాలు పర్యావరణం కుంటుబడినా సరే అని అంటున్నారు.

మరొక వెైపు ప్రధాన మంత్రి- భారత దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఆర్థిక రంగానికి గడ్డు కాలం వస్తుంది, అనేక అంశాలు మా నియంత్రణలో లేవు అంటున్నారు. దీనికంతటికి కారణం ఎక్కువ మంది పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద ఏజెంట్లు ఎంపీలుగా ఎన్నికై తమ వ్యక్తిగత సంపదను పెంపొందించుకునే దిశగా దేశాన్ని కొల్లగొడుతున్నారు. ఇందులో మన రాష్ట్ర ఎంపీలు ముందంజలో ఉన్నారు.ఇంత వరకూ దేశ ప్రజలకు 40 శాతం మందికి అక్షరాలు నేర్పుకోలేకపోయాము. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనానికి రూ. 3 నుంచి పెంచలేకపోయారు. పిల్లలు నడి ఎండలో చారుతో అన్నం తింటున్నారు. వారికి పప్పుదినుసులు అందించలేకపోతున్నారు. జెైలులో ఉన్న రాజకీయ నాయకులను, కార్పొరేట్‌ దొంగలను మాంసం, గుడ్లు, పాలు, పండ్లు ఇచ్చి ప్రభుత్వ డబ్బుతో మేపుతున్నారు.

వారిని కోర్టులకు తెచ్చేటప్పుడు బులెట్‌ ప్రూఫ్‌ కార్లలో తీసుకువస్తూ, పది కిలోమీటర్ల దూరంవెళ్ళి చదివే ఆడపిల్లలకు ఒక సైకిల్‌ కొనిపెట్టలేకపోతున్నారు. దొంగలు దొరలుగా, పారిశ్రామిక వేత్తలుగా సొంత విమానాలు కొనుక్కొని రాజకీయ నాయకులుగా, కుల పెత్తందారులుగా మారి ఆయా రాష్ట్రాల్లో సొంత టీవీలు, మందీ మార్బలంతో పాటు గూండాల్ని ముఠాలుగా చేసుకొని ప్రభుత్వ సంపదను దోచుకుంటూ సొంత దళారీ వ్యవస్థలు ఏర్పరచుకొంటున్నారు. ఈ అవినీతి నేతల బాగోతం సోనియా గాంధీకి తెలియదా? 80 ఏళ్లనాడే డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ విషయాలను పసిగట్టి ‘వాట్‌ కాంగ్రెస్‌ అండ్‌ గాంధీ హ్యెవ్‌ డన్‌ టుది అన్‌టచబుల్స్‌’ అనే గ్రంథంలో కాంగ్రెస్‌ బ్రాహ్మణ- బనియాల పార్టీగా చెప్పాడు.

padmaraoబీజేపీ ఇంతకంటే సాంప్రదా యక హిందూ కుల, వర్ణ దోపిడీ వివక్షతో కూడుకున్న పార్టీ. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కుల వర్గ ఆధిపత్య పెత్తందారీ తనంతో రాష్ట్రంలోని పేదలను దోచుకుంటున్నాయి. ఈ పరిస్థితిల్లో దేశ వ్యాప్తంగా దళిత బహుజన మైనారిటీ, ఆదివాసీలు రాజకీయంగా చెైతన్య వంతమై మహాత్మా ఫూలే, అంబేడ్కర్‌ల ఆలోచనావిధానంతో ఈ దేశ సంపదను, ఈ దేశ వనరులను, ఈ దేశ మేధోశ క్తిని ఈ దేశ ప్రజలకే ఉపయుక్తమయ్యే రాజ్య వ్యవస్థ నిర్మాణానికి పూను కోవలసిన చారిత్రకసందర్భం ఇది. ప్రత్యామ్నాయ, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నిర్మాణానికి సన్నద్ధం కావటమే కర్తవ్యం.

సిబిఐ దర్యాప్తుల్లో దళిత కోణం


                                                                                    ANDHRA JYOTHI 31/5/12

సిబిఐ దర్యాప్తుల్లో దళిత కోణం

నిజానికి సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులు తెలంగాణకే కాదు సీమాంధ్ర దళిత బహుజనులకు పెద్ద ఎత్తున సామాజిక ద్రోహం చేశారు. వీరి అక్రమాల వల్లనే తెలంగాణ డిమాండ్ కూడా ముందుకు వచ్చింది. అగ్రకుల రాజ్యాధికార స్వభావాన్ని దళిత బహుజనులు అర్థం చేసుకోవల్సిన అవసరం వుంది. ఆర్థిక నేరాలు, రాజకీయ హత్యలు, అబద్ధ ప్రచారాలతో ఇప్పుడు నడుపుతున్న కార్పొరేట్ రాజకీయాల స్వభావాన్ని అర్థం చేసుకోవల్సిన చారిత్రక సందర్భం ఇది. 

కేంద్ర నేర పరిశోధక సంస్థ (సిబిఐ) దేశవ్యాప్తంగా తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది. అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందనే అపప్రథ ఈ సంస్థపై ఉన్నది. అయితే వివిధ కుంభకోణాల్లో మాజీ కేంద్ర మంత్రులు రాజా (డిఎంకె), సురేశ్ కల్మాడీ (కాంగ్రెస్), కరుణానిధి తనయ కనిమొళిని అరెస్ట్ చేయడం వల్ల సిబిఐ కొంత పారదర్శకత కూడా చూపిస్తూనే వెళుతుందనక తప్పదు.

దళిత బహుజనులు కరుణాశీలురు. సహజంగానే ఎవ్వరు అరెస్ట్ అయినా వారు సానుభూతి చూపుతారు; అయితే తమ భూములు, సంపదలను దోచుకున్న వారు అరెస్టయినప్పుడు, శిక్షలకు గురయినప్పుడు కూడా జాలిపడడం ఆశ్చర్యం. నిజమే, చంద్రబాబు లాంటి వాళ్ళు ఎందరో ఇంకా నేర పరిశోధనకు గురికావలసివుంది. దాని కోసం కూడా చిత్తశుద్ధితో అందరూ కృషిచేయాలి. సుప్రీంకోర్టులో ఈ విషయం పెండింగ్‌లో ఉంది. ఒక దళిత మంత్రి చేసిన ఆరోపణల మూలంగా సిబిఐ నాలుగు రోజుల క్రితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేసింది. ఆయన అక్రమార్జన వ్యవహారాలను రాజకీయ కోణం నుంచి కాకుండా నిష్పక్షపాతంగా సిబిఐ కోణం నుంచి దళిత బహుజనులు చూడాల్సిన సందర్భం ఇది. ఒకవేళ ఇటువంటి నేరపరిశోధనలే లేకపోతే దేశసంపద ఏమౌతుందో కూడా ఆలోచించాల్సివుంది. అందరికీ చెందాల్సిన సంపద కొందరి గుత్తస్వామ్యం కావడం రాజ్యాంగ విరుద్ధం అనే విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి మీద భాతర శిక్షా స్మృతి సెక్షన్ 120 బి. రెడ్ విత్ 480, 409, 468, 471; అవినీతి నిరోధక చట్టంసెక్షన్ 13 (2) రెడ్ విత్ (13) 1 సి.డి. కింద కేసులను సిబిఐ నమోదు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.శంకర్‌రావు 2011 ఆగస్టులో రాసిన ఒక ఉత్తరం మేరకు జగన్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణపై రాష్ట్ర హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో భాగంగానే సిబిఐ తన దృష్టిని జగన్‌పై కేంద్రీకరించింది.

2004 మార్చి చివరినాటికి రూ.11 లక్షల ఆదాయం ఉన్న జగన్ నేడు రూ.43వేల కోట్ల ఆస్తులకు అధిపతి. ఇదెలా సాధ్యమయింది? జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలోని వేలాది ఎకరాల భూములు బహుళజాతి కంపెనీలకు, దేశీయ పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసి తన కుమారుడి పరిశ్రమల్లోకి దొడ్డి దోవన ధనాన్ని ప్రవహింప జేశారు. జగన్ కంపెనీల్లో భారీ ప్రీమియంతో వారు పెట్టుబడులు పెట్టారని సిబిఐ తన పరిశీలనలో నిగ్గు తేల్చింది. హెటిరో గ్రూప్, ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, పొట్లూరి వరప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా గ్రూప్, ల్యాంకో గ్రూప్, సజ్జల గ్రూప్ తదితరులు రూ.250 నుంచి రూ.1140 వరకు ప్రీమియంతో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సిబిఐ గుర్తించింది. 
వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశ్రిత పక్షపాతానికి ఒడికట్టారు, కొందరు పారిశ్రామిక వేత్తలతో కుమ్మక్కై దేశ సంపదనే అమ్మడానికి చూశారు. ఇదంతా ఆయనొక పథకం ప్రకారమే చేశారు. దేశ సంపదను కుదువ పెట్టడానికి ఆయన ఎన్నుకున్న పారిశ్రామికవేత్తలందరూ అక్రమార్జనలో గజగండులే. జగన్‌కు ముందు అరెస్ట్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ విషయానికి వస్తే ఈ విధమైన దోపిడీలో అతనికి చాలా ప్రావీణ్యం వున్నట్టు కనబడుతుంది. పన్నెండు సంవత్సరాలకు ముందు ఆయన ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే. ఎంతో నష్టాలకు గురైన ఔషధ సంస్థ హెరెన్ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి మ్యాట్రిక్స్ లేబోరేటరీస్ అని పేరు మర్చారు.

2007లో అమెరికన్ ఔషధ సంస్థ 'మిలన్'కు మ్యాట్రిక్స్ లేబోరేటరీస్‌ను అమ్మడం ద్వారా రూ.570 కోట్లు సంపాదించారు. మారిషస్‌కు సంబంధించిన కొన్ని సంస్థల ద్వారా రూ.864.4 కోట్ల డబ్బును జగన్ మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ ఆరోపిస్తుంది. ఆ తరువాత కొంత వాటా అమ్మిన తరువాత కూడా రూ.505 కోట్ల మేరకు ప్రసాద్ పెట్టుబడులు యింకా ఆ మీడియా సంస్థలో మిగిలే వున్నాయి. నిమ్మగడ్డ ప్రసాద్ ప్రారంభించిన గిల్ క్రిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా విల్లాస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్‌లు జగన్‌కు చెందిన సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయని సిబిఐ భావిస్తుంది.

ఈ పరిశోధన చేసే కొద్దీ దేశీయ వనరులు అమ్మడానికి మంత్రిమండలిని మొత్తాన్ని ప్రభావితం జేసి అక్రమంగా 26 జీ.ఓ.లు, వైఎస్ రాజశేఖర రెడ్డి తన మంత్రులపై వొత్తిడితో జారీ చేయించారని అర్థమవుతుంది. ఈ వ్యవహారంలో మోపిదేవి వెంకట రమణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి మంత్రులందరికీ ప్రమేయముంది. ఇప్పటికే మోపిదేవిని సిబిఐ అరెస్టు చేసింది. ఈ ప్రక్రియలో బలమైన రెడ్డి మంత్రులు నెవ్వరినీ రాజశేఖరరెడ్డి పెట్టుకోలేదు. కాపులు, ఎస్సీ, బీసీ మంత్రులే ఎక్కువగా ఇందులో ఇరికించబడ్డారు. ఇద్దరు మహిళా మంత్రులను ఇరికించారు. 

'వాన్ పిక్' ప్రాజెక్టులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు ధారాదత్తం చేసిన భూముల్లో ఎస్సీ, బీసీ రైతులే ఎక్కువగా ఉన్నారు. నిజానికి ఈ విషయాలపై ఎవరు అరెస్టవుతున్నారు? కేసులు ఎవరి మీద జరుగుతున్నాయి? అనే దాని మీద కంటే దేశ సంపద ఎలా ఈ అవినీతి రాజకీయవేత్తల వల్ల కొల్లగొట్ట బడుతుంది? దేశం ఎలా తాకట్టులోకి వెళుతుంది? అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎస్సీ బీసీ మంత్రులు కమ్మ, రెడ్డి ఆధిపత్యంలో నేరానికి గురౌతున్నారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కమ్మా రెడ్డి పెట్టుబడిదారీ రాజకీయ దోపిడీ యుద్ధం అయినప్పటికీ కూడా రెండు వర్గాల వల్ల నష్టపోతున్నది దళిత బహుజనులే అని గుర్తించాలి.

920 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన కోస్తా తీర ప్రాంత వాసులైన బెస్తలు, యాదవులు, దళితులు, అగ్ర కులాలకు చెందిన కొందరు రైతులు కూడా ఈ మోసపూరితమైన చర్యల వల్ల తమ జీవన వ్యవస్థను కోల్పోయారు. 2007లో ప్రపంచ స్థాయిలో ఒక నౌకాశ్రయాన్ని, పారిశ్రామికవాడను నిర్మిస్తామని వాన్‌పిక్ ప్రాజెక్టును వ్యూహాత్మకంగా ప్రారంభించారు. మొదట ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, యుఏఇ లోని రస్-అల్-ఖైమా సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. రస్-ఆల్-ఖైమా ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ యుఏఇ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించింది. ఈ ఒప్పందం కుదిరిన వెంటనే ఆ ప్రాజెక్టులో 49 శాతం ఈక్విటీతో భారతీయ భాగస్వామిగా ఎమ్ఈహెచ్‌పీఎల్ చేరింది. 

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కారిడార్‌లను, ఓడరేవులను నిజాంపట్నం నౌకాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించి బదలాయించే పద్ధతిని ఈ సంస్థలు చేపట్టాల్సివుంది. ఈ సంస్థ నిజానికి మొత్తం 'వాన్ పిక్' ప్రాజెక్టును ఎంఇహెచ్‌పిఎల్ - ప్రక్రియల సంయుక్త సంస్థ అయిన వాన్‌పిక్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (విపిపిఎల్) అభివృద్ధి చేయాల్సి ఉంది. కాగా ప్రసాద్ ఇంతలో తన చెప్పుచేతల్లో ఉండేలా 'వాన్ పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్' పేరిట సమాంతరంగా మరో సంస్థను సృష్టించారు. 'వాన్ పిక్' ప్రాజెక్టు పేరుతో ఆ కొత్త సంస్థ ఇప్పటిదాకా దాదాపు 13 వేల ఎకరాల భూమిని చేజిక్కించుకుంది.

నిమ్మగడ్డ ప్రసాద్ ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భూములు అపహరించి ఏ విధమైన నిర్మాణాలు చేయకపోవడం వల్ల దళిత బహుజన రైతులు అటు ఉద్యోగాలు లేక, ఇటు ఆ పరిశ్రమల ద్వారా వచ్చే ఉపాధి లేక దిక్కులేని వారయ్యారు. దీని వలన పదిమంది పారిశ్రామిక వేత్తలు, పదిమంది రాజకీయవేత్తలు బాగుపడితే ప్రయోజనం ఏమిటి? ఇందుకేనా ఇంగ్లీషు వాళ్ళ మీద మనం పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకొంది? డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దేశసంపదను గూర్చి, సహజ వనరుల సంరక్షణ గూర్చి తెలిపిన అంశాలు మృగ్యమవ్వాల్సిందేనా? ఇక దళిత బహుజనులు ఆలోచించాల్సిన విషయం.

కోస్తా తీర ప్రాంతంలో అనేక భూముల్ని వివిధ కంపెనీలకు ప్రభుత్వాలు ధారాదత్తం చేయడం సబబేనా? విశాఖపట్నంలో ఫార్మా సిటీకి 2,143 ఎకరాల భూమిని కేటాయించిన విషయంలో రాంకీ సంస్థ రూ.113.74 కోట్లు ఆయాచిత ప్రయోజనం పొందడం అందుకుగాను జగతి పబ్లికేషన్స్‌కు రూ.10 కోట్లు వచ్చి చేరడం వంటివి చూస్తే స్వప్రయోజనం కోసం వివిధ పెట్టుబడిదారీ సంస్థల్ని పెంచి పోషించి, అక్రమ లావాదేవీలకు పెద్ద పీట వేసి, చిన్న చిన్న సంక్షేమ పథకాలతో పెద్ద ప్రచారాన్ని చేసుకున్న రాజశేఖరరెడ్డి బండారం మరింత బయటకు వస్తుంది. అయితే రాజశేఖరరెడ్డి మరణాన్ని ఒక సెంటిమెంటుగా చూస్తున్న దళిత బహుజనులు అసలు మొత్తం వ్యవస్థలోనే దళిత బహుజనులు జీవించే హక్కు రద్దయ్యే ప్రమాదం వుందని, ఇది చాలా ప్రమాదకరంగా మారుతుందనే విషయం 2004-05లో యిచ్చిన సెజ్‌లను చూస్తే మనకు అర్థమౌతుంది. 

2004-05 నుంచి సెజ్‌ల కోసం 80వేల ఎకరాలను సేకరించింది. దీనితో సంబంధం లేకుండా ప్రభుత్వం మరో 30 వేల ఎకరాలను సేకరించింది. ఇందులో 70 వేల ఎకరాలను ఐదు సెజ్‌ల కోసం సేకరించారు. దానిలోంచి 50వేల ఎకరాలను కేవలం వాన్‌పిక్, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి, లేపాక్షి నాలెడ్జ్ హబ్, సత్యవేడు సెజ్, కృష్ణ పట్నం ఇన్‌ఫ్రా సెజ్‌కు అప్పగించారు.

ఈ సెజ్‌ల మూలంగా మొత్తంగా నష్టపోయింది దళిత బహుజన రైతులే. మూలవాసుల్ని దెబ్బతీసే ఈ చర్యలను కేవలం రాజకీయంగా చూడటానికి వీలులేదు. ఆంధ్రుల ఆర్థిక సామాజిక సంస్కృతి అంతా భూమి, నీరు, ఖనిజ సంపద, అడవుల మీద ఆధారపడి వుంది. సముద్రతీరాన్ని ఎస్సీ, బీసీలు అడవులను ఎస్సీ, ఎస్టీలు ఆధారం చేసుకొని బతుకుతున్నారు. వారికి మూలాధారమైన సంపదను కార్పొరేట్ సంస్థలకు, మల్టీనేషనల్ కంపెనీలకు అమ్ముకుంటూ వారిని మధ్యతరగతిగా మారుస్తామని, కాలనీలను కట్టిస్తామని పరిశ్రమలు నిర్మించి ఉద్యోగ వసతి కల్పిస్తామని బూటకపు మాటలు చెప్పారు;

పెట్టుబడుదారులకు అనుకూలంగా జీ.ఓ.లను విడుదల జేస్తూ సామాజిక ఆర్థిక దోపిడీకి గురౌతున్న ప్రతి అంశం మీద వ్యక్తులకతీతంగా నేర పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ భూములను తిరిగి ప్రజలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించాలి. నిజానికి ఈ దోపిడీకి బీజం మన రాష్ట్రంలో చాలాకాలం క్రితమే పడింది. అందుకు కారకుడైన ముఖ్యమంత్రి ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన చంద్రబాబు. 2002లో రాంకీ సంస్థకి 3,148 ఎకరాలను చంద్రబాబు అప్పగించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. దళిత బహుజనులకు న్యాయం జరగడం ఆయనకు ఇష్టంలేని విషయం. 
దాదాపుగా నిరాస్తిపరుడైన ఈ వ్యక్తి మూడు దశాబ్దాలలో అపర కుబేరుడు ఎ లా అయ్యారు? పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయ ణ ఆనాడు వైఎస్‌కు ఆంతరంగికుడు. దళిత బహుజనుల సంపద కుదువపెట్టడంలో తన నాయకుడికి తోడునడిచిన వాడే. చంద్రబాబు పాలనలో కమ్మ వారిలో నయా పెట్టుబడిదారీ వర్గం స్థిరపడింది. ఈ అంశాలు కూడా సిబిఐ ద్వారా బయటకు రావాల్సివుంది. నేరపరిశోధనా సంస్థలు రాజకీయ ప్రాబల్యాలకు, అధికారాలకు గురికాకుండా తప్పక స్వతంత్ర ప్రతిపత్తిని సంపాదించవల్సివుంది.

లోక్‌పాల్ బిల్లులో ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది. ఎవరు ప్రభుత్వంలోఉంటే సిబిఐ వారికి అనుకూలంగా ప్రవర్తిస్తుందనే వాదనలు ఉన్నాయి. ఒక కులాధిపతి తీర్పును కప్పిపుచ్చడానికి ఒక మీడియా, మరో కులాధిపతిని కాపాడడానికి మరొక మీడియా ప్రయత్నిస్తున్న సందర్భంలో నిర్ధారితాంశాలు పాక్షికంగానే ప్రజల్లోకి వెళుతున్నాయి. నిజానికి సీమాంధ్ర నుంచి పాలించిన ముఖ్యమంత్రులు తెలంగాణకే కాదు సీమాంధ్ర దళిత బహుజనులకు పెద్ద ఎత్తున సామాజిక ద్రోహం చేశారు. అవి సెంటిమెంట్స్‌తో మాఫీ చెందే విషయాలు కాదు.

ఆంధ్రప్రదేశ్ ఈనాడు అవినీతికి అడ్డాగా మారిపోయింది. వీరి అక్రమాల వల్లనే తెలంగాణ డిమాండ్ కూడా ముందుకు వచ్చింది. అగ్రకుల రాజ్యాధికార స్వభావాన్ని దళిత బహుజనులు అర్థం చేసుకోవల్సిన అవసరంవుంది. ఆర్థిక నేరాలు, రాజకీయ హత్యలు, అబద్ధప్రచారాలతో ఇప్పుడు నడుపుతున్న కార్పొరేట్ రాజకీయాల స్వభావాన్ని అర్థం చేసుకోవల్సిన చారిత్రక సందర్భం ఇది. అమాయకత్వం వల్ల, బలవంతుల వల్ల ఈ రాజకీయ దోపిడీదారుల వల్ల నష్టపోయినవారు ఎక్కువ మంది బడుగులే. అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జి హబ్ కోసం, చిలమత్తూరు మండలంలో 16,608 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. 
అందులో 3,330 దళిత బహుజన కుటుంబాల 8800 ఎకరాలు భూములను తక్కువ రేట్లకు బలవంతంగా ప్రభుత్వాధికారులు ఉపయోగించుకున్నారు. ఈ బోర్డర్ జిల్లా నుంచి ఎందరో దళిత బహుజనులు జీనవోపాధి లేక వలసపోయారు. ఓబుళాపురం మైనింగ్‌లో బిపి ఆచార్య అక్రమాలకు అంతులేదు. గచ్చిబౌలిలో అత్యంత ఖరీదైన 258 ఎకరాల భూమిని కారు చౌకకు కొన్న ఎమ్మార్ ప్రాపర్టీస్ చదరపు గజం 40వేల రూపాయలు చొప్పున అమ్మింది. ఈ ప్రక్రియల కథకు అంతులేదు. రాజకీయనాయకులు ప్రభుత్వాధికారులు దేశసంపదను ఇలా దోపిడీచేస్తూ పోతూ దళిత బహుజనులు జీవించే హక్కును కాలరాస్తున్నారు. మరో స్వాతంత్య్రం కోసం ప్రజలు పోరుచేసే పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో అగ్రకుల రాజ్యాధికార దోపిడీ పరిస్థితులను అర్థం చేసుకొని ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని సూత్రాల్ని రక్షించుకోవడం కోసం దళిత బహుజనులు పోరాడవలసిన చారిత్రక పరిస్థితి ముందుకు వచ్చింది. అన్ని వైరుధ్యాలు, అన్ని పోరాటాలను దళిత బహుజనులను సామాజిక ఆర్థిక, రాజకీయ పరిణామ దృష్టితో చూడడమే అంబేద్కర్ వాదం. ఇది కమ్మారెడ్డి రాజకీయ దోపిడీ శకం. దీనికి చరమ గీతం పాడాల్సింది దళిత బహుజనులే.
- డా. కత్తి పద్మారావు

Andhra Jyothy Telugu News Paper Online edition published from Andhra Pradesh, India, Andhra news, Andhra Pradesh Politics, India news, Telugu Literature, Telugu Cinema news, Analysis, Hyderabad news, Andhra Jyoti, Andhra Jyothi, Telugu Culture and Tradition, IT News, Telugu Matrimonials, Classifieds, etc

Andhra Jyothy Telugu News Paper Online edition published from Andhra Pradesh, India, Andhra news, Andhra Pradesh Politics, India news, Telugu Literature, Telugu Cinema news, Analysis, Hyderabad news, Andhra Jyoti, Andhra Jyothi, Telugu Culture and Tradition, IT News, Telugu Matrimonials, Classifieds, etc

ఇరవైఐదేళ్ళ కారంచేడు ఉద్యమం


ఇరవైఐదేళ్ళ కారంచేడు ఉద్యమం - డాక్టర్ కత్తి పద్మారావు Andhra Jyothi 27/12/2010



కారంచేడు దళితులపై 1985 జూలై 17 మారణహోమం జరిగిన తరువాత పెల్లుబికిన దళిత ఉద్యమం ఆంధ్రుల సామాజిక చరిత్రను మార్చివేసింది. అంతవరకు వర్గాధిపత్యం మీద జరుగుతున్న పోరు, కులాధిపత్యం మీద సిద్ధాంత పరం గా మళ్లింది. వధించిన వారిలో కేవలం వర్గాన్నే చూసేవారు అర్ధ సత్యమే పలుకుతున్నారని ఆ దాడికి ప్రధాన కారణం కులాధిపత్యమేనని దళిత ఉద్యమం తేల్చిచెప్పింది.

దళితుల ఐక్యత వర్ధిల్లాలనే నినాదంతో చీరాలలో 1985 సెప్టెంబర్ 1న జరిగిన 'దళిత మహాసభ' ఒక ఉద్యమానికి, ఒక పోరాటానికి, ఒక సిద్ధాంతానికి బాట వేసింది. మార్క్స్ వర్గాధిపత్య సిద్ధాంతాన్ని భారతదేశానికి అన్వయించినప్పుడు అది అర్ధ సత్యంగానే మిగులుతుందని, అంబేద్కర్ చెప్పిన కుల నిర్మూలనా దిశగా సమాజాన్ని నడిపించాలంటే తప్పక కులాధిపత్యం మీద పోరు చేసి తీరాలని నిర్ధారించింది. కారంచేడులో జరిగిన మారణ హోమం వెనుక కులకక్ష, కుల ద్వేషం, కులాధిపత్య రాజ్య స్వభావం ఉన్నాయని నిగ్గు తేల్చింది.

స్వాతంత్య్రానంతరం లభించిన రిజర్వేషన్ హక్కువల్ల, అనేక సాంఘిక పోరాటాల మూలంగా దళితులు స్వేచ్ఛా స్వాతంత్య్రా ల్ని కోరుకున్నారు. భారతదేశంలో కుల గ్రామం, కుల పంచాయతి ఆనవాయితీ. ఒకే ఊరు కులాలుగా విభజించబడి ముక్క లై ఉంది. బ్రహ్మకున్న నాలుగు ముఖాలు ఊర్లో ఉన్నాయి. శూద్రులు పాదాల దగ్గర ఉన్నారు. దళితులు ఊరికి అవతల వాడలో ఉన్నారు.


మౌఖిక విద్య, ప్రకృతి జ్ఞానం, విశ్వ సంస్కృ తి, సమత్వా మానవత, లోతైన మాతృత్వం ఇవన్నీ దళిత సమాజంలో భాగంగా ఉన్నాయి. లిఖిత విద్య వచ్చిన తరువాత వర్గ సమాజంతో కూడుకున్న, కులతత్వంతో నిండిన ఊరిని దళితవాడ ప్రశ్నించడం మొదలుపెట్టింది. దానికి ఊరు ఉరిమి చూసింది. అదే కారంచేడు దుర్ఘటనకు మూలం.
దళితుల తరఫున చరిత్ర పూర్వకాలంలో ఎందరో పోరాడా రు. చార్వాకులు వర్ణ వ్యవస్థను నిరసించారు. బ్రాహ్మణ ఆధిపత్యం మీద పౌరోహిత పెత్తనం మీద తిరుగులేని పోరాటం చేశారు. బౌద్ధులు మానవులందరూ సమానమేనని సంఘనీతిని బోధించారు. హింస మీద యుద్ధం చేశారు. జైనులు జీవ హింస నే కాదన్నారు. సాంఖ్యులు అణు వాదాన్ని బోధించారు.

వైశేషికులు ప్రకృతివాదాన్ని ముందుకు తెచ్చారు. తాంత్రికులు ఈ శరీరం బూడిదైపొయ్యేదే కనుక దీనికి వర్ణాలు అక్కరలేదని చెప్పారు. ఇవన్నీ దళితవాడల్లో పుట్టిన తత్వ శాస్త్రాలే. బ్రాహ్మణ అగ్రహారాల్లో యజ్ఞ యాగాదులు జంతు బలులే జరిగాయి గాని తత్వ శాస్త్రం పుట్టలేదు. అస్పృశ్య వాడలు పుట్టటానికి కార ణం దళితులు బౌద్ధాన్ని స్వీకరించడమేనని అంబేద్కర్ చెప్పా రు.

వీర శైవులు, వీర వైష్ణవులు భక్తి వాదాన్ని దళిత వాడలకు తీసుకెళ్ళారు. దళిత వాడల్ని చూడని వారెవరు తాత్వికులు కాలేకపోయారు. అస్పృశ్యమైన గీత అవతల మాతృస్వామ్య జీవన వ్యవస్థ బ్రతికుంది. ఈ పునాదుల మీదినుంచే దళిత వాదం, దళిత తత్వం, దళిత ఉద్యమం లేచింది. క్రీ.పూ. 3000 సంవత్సరాల నుంచి భారత సమాజంలో వలస వచ్చిన అనేక జాతులపై చేసిన పోరాటాల స్ఫూర్తి దళితులపై ఉంది.
దళిత ఉద్యమం ఈ చారిత్రక నేపథ్యాన్ని తీసుకుని తన పోరాటాన్ని ప్రారంభించిన తరువాత ఆంధ్రదేశంలో అప్పటికి ఉన్న పార్టీలు, ఉద్యమాలు అన్నీ తమ ఎజెండాలో కులాధిపత్యం కుల వైరుధ్యం, కుల వివక్ష అనే అంశాల్ని చేర్చుకోవాలనే పరిస్థి తి వచ్చింది. దళిత ఉద్యమం చార్వాకుల నుంచి అంబేద్కర్ వర కు, మహాత్మాఫూలే, పెరియార్, నారాయణ గురు వంటి కుల నిర్మూలన పోరాట వాదాలన్నిటిని సమన్వయం చేసుకుంది. అప్పటికి ఎం.ఎల్.పార్టీలు వర్గ నిర్మూలన వాదాన్నే బలంగా చెబుతున్నాయి.

కారంచేడు జరిగిన తరువాత భారతదేశంలో ఉన్న దేశీయ తత్వ శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసిన అంశాన్ని, దేశీయ వాస్తవ పరిస్థితులను స్వాతంత్య్రానంతరం వచ్చిన పరిణామాల కు బేరీజు వేసి ఎం.ఎల్. పార్టీలు తమ సిద్ధాంతాలను సర్దుకోవలసి వచ్చింది. ఈ సిద్ధాంత చర్చలో కులాధిపత్యాన్ని గుర్తించాల్సినంత గుర్తించలేదని కొందరు నాయకులు పార్టీ నుంచి బయటకు కూడా వచ్చారు.

పౌర హక్కుల సంఘాల్లోను, ఓపీడీఆర్ సంఘాల్లోను, విరసంలోను, జనసాహితీ సాంస్కృతిక సమాఖ్యలోనూ భారతదేశంలో కులం ప్రా«ధాన్యం మీద చర్చ జరిగింది. సిపిఎం, సిపిఐలో కూడా బలమైన ప్రశ్న ముందుకు వచ్చింది. ఇది వర్గ సమాజమా? కుల వర్గ సమాజమా? అనే ప్రశ్నల మీద అన్ని పార్టీల్లో ఉన్న దళితులు చర్చ చేశారు.

గ్రామాల్లో మంచినీటి బావుల దగ్గరకు వెళ్ళే దగ్గర, పాఠశాలలకు వెళ్ళే దగ్గర, బస్సులు ఎక్కే దగ్గర, హోటళ్ళలో కూర్చునే దగ్గర, భూముల్లోకి వెళ్ళే దగ్గర, వ్యవసాయం దగ్గర దళితుల ప్రవేశాన్ని నిరోధించాలని అగ్రకులాలు ప్రయత్నం చేస్తుంటే ఎప్పుడో వర్గ నిర్మూలన జరిగిన తరువాత, అందరూ ఆర్థికంగా బాగుపడిన తరువాత కులం పోతుంది. అస్పృశ్యత కూడా పోతుంది- అనే వాదం ఎంతవరకూ శాస్త్రీయం? అనే ప్రశ్న మీద వాదోపవాదాలు జరిగాయి. అయితే దళిత ఉద్యమం కులానికి ప్రత్యామ్నాయమైన ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు నడుస్తూ వచ్చింది.

ఆ తరువాత చిత్తూరు జిల్లా బండ్లపల్లిలో అర ఎకరం భూమికోసం నలుగురు అన్న దమ్ములను, వారి తోబుట్టువుని పొలం లో చంపేసిన సంఘటనను తీసుకొని పోరాడింది. ఆ తరువాత చుండూరులో జరిగిన మారణ హోమంలో ఎనిమిది మంది హతులయ్యారు. ఆ పోరాటాన్ని జాతీయ స్థాయిలో నడిపింది. 107 మంది ఎంపీలను ఏకం చేసి ప్రధానమంత్రితో చర్చలు చేసి ఊర్లోనే ప్రత్యేక కోర్టును సాధించింది.

అనేక పార్టీల్లో దళిత అనుకూల వాదాలను ముందుకు తీసుకెళ్ళిన అనేక ప్రజా సంఘాలు చుండూరు కోర్టులో ముద్దాయిలకు శిక్ష పడడటం కోసం దళిత ఉద్యమంతో పాటు కృషి చేయడం ఒక చారిత్రక మలుపు. అయి తే దళిత ఉద్యమానికి ఉన్న సామాజిక స్ఫూర్తి మండల్ కమిషన్ తరువాత బహుజనుల మీద బలంగా పడింది. అంబేద్కర్‌తో పాటు ఫూలే ఆలోచనలు బిసిల్లో కూడా విస్తరించాయి.
1990 దశకంలో దళిత బహుజనుల సామాజిక, ఆర్థిక, రాజకీయ పోరాటాలు పెరిగాయి. మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఉన్న ఎస్సి, బిసి నాయకులు కూడా ఈ ఉద్యమాల ప్రభావంతో అగ్రకుల పార్టీల్లో కూడా తమ కు మెరుగైన స్థానాల కోసం పోటీ పడటం ప్రారంభించారు. ఎస్సి, బిసి ఎమ్మెల్యే ఫోరంలు ఏర్పడి తమ హక్కుల కోసం పోరాడటం నేర్చుకున్నారు. అనేక ఉద్యోగ సంఘాలు కేవలం తమ డి.

ఏ పెంపుదల కోసమే కాకుం డా ఏదైనా సంఘటన జరిగినపుడు దళిత బహుజన ఉద్యమాలకు మద్దతు పలకడం, రోడ్డున పడడం పెరిగింది. కుల నిర్మూలన భావం, కుల అస్తిత్వ వాదాలనుంచే పెరగాలని అనేక పొర ల్లో కులాలు, ఉపకులాల్లో ఉన్న అంతరాలు కూడా తొలగిపోవాలని ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. కారంచేడు ఉద్యమం ఈ పరిణామాల్లో తన పాత్ర తాను నిర్వహిస్తూ వచ్చింది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో హక్కులు కాలరాయబడుతున్నప్పుడు ప్రతిఘటన పోరాటంలో భాగంగా ప్రత్యేక సెటిల్ మెంట్ ప్రతిపాదన పెట్టింది. కారంచేడులో చనిపోయింది ఆరుగురు అయినా, చుండూరులో ఎనిమిది మంది అయినా ఊరు మొత్తానికి రీహ్యాబిటేషన్ చేయాలనే ప్రతిపాదన పెట్టి ఇళ్లు, భూములు, ఉద్యోగాలు సాధించి దళితుల్లో సాధికారితను పెంచింది.
దళితుల హక్కుల్లో ప్రధానమైన కేసుల విషయంలో పోలీసు కేసులు విఫలమైనప్పుడు ప్రైవేటు కేసులు పెట్టి ముద్దా యి ఎంతటివాడైనా ముఖ్యమంత్రి వియ్యంకుడైనా బోనులో నిలబెట్టడం నేర్పింది. భూస్వాములు శిక్షల నుంచి తప్పించుకోవడం కోసం హైకోర్టు కెళ్ళినా, సుప్రీంకోర్టు వరకు వెళ్లి కుల భూస్వాములకు శిక్ష వేయించగలిగింది. చుండూరులో ఊరిలో నే కోర్టు పెట్టి ముద్దాయిని ఊర్లోనే నిలేసి, సాక్షికి ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం ఇచ్చి సాక్ష్యాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాతావరణాన్ని ఉద్యమం రూపొందించ గలిగింది.

ఈ శిక్షల తరువాత దళితుల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. అంతే గాకుండా కారంచేడు ఉద్యమాల వల్ల దళిత సాహిత్యం, దళిత చరిత్ర, దళిత సాహితీ విమర్శ దళితుల తత్వ శాస్త్రానికి బలమైన పునాదులు పడ్డాయి. దళితులకు వార, మాస పత్రికలు పెరిగాయి. మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో కూడా దళిత సమ్యలకు గుర్తింపు పెరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తరువాత అనేక సందర్భాల్లో దళిత సమస్యకు దృశ్య రూపం కూడా వస్తోంది. ఇది అనేక రంగాల్లో దళిత యుగంగా మారిపోయింది.

భారత, అంతర్జాతీయ స్థాయిల్లో అనేక సదస్సుల్లో దళిత ఉద్యమ ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అణగారిన శక్తులన్ని కూడా ఏకమవుతున్నా యి. జాతి, మత, కుల, లింగ భేదాలతో అణగ ద్రొక్కబడుతు న్న వారంతా 1999లో మలేషియాలో ప్రపంచ దళిత మహాసభలు జరుపుకున్నారు. అక్కడ కారంచేడు, చుండూరు మృతవీరులకు ప్రపంచ వ్యాప్త ప్రతినిధులంతా నివాళులు అర్పించారు.
కారంచేడు సంఘటన జరిగి ఈ రోజుకి ఇరవై ఐదేళ్ళు. ఈ ఇరవై ఐదేళ్ళలో ఆంధ్రదేశంలో జరిగిన అన్ని పరిణామాల్లో దళిత ఉద్యమ ప్రభావం ఉంది. ముఖ్యంగా తెలంగాణ పోరా టం ముమ్మరమైన తరువాత ఆంధ్ర ప్రదేశ్ దళిత మహాసభ కారంచేడు, చుండూరులో ఎవరైతే నరికారో, ఆ రెండు అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ పోరాటాన్ని సమర్థించింది. కమ్మ, రెడ్డి కులాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో అనేక ఎత్తుగడల్ని వ్యూహాల్ని కూడా దళిత మహాసభ నేర్పింది.

అంబేద్కర్ ఆలోచనలని రాజకీయంగా ప్రయోగంలోకి తీసుకెళ్లింది. కాన్షీరామ్ మార్గంలో రెండు ప్రధాన కులాల ఆధిపత్యా న్ని ఎదుర్కోవడం కోసం ఇతరులతో చేయి కలపడం అనే వ్యూహాన్ని దళిత మహాసభ ఈనాడు అనుసరిస్తున్నది. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత దళితులే రాజ్యాధికారంలో ప్రధాన భూమికను వహించాలనే సిద్ధాంతంతో దళి త ఉద్యమం ముందుకు వెళుతున్నది.

అంబేద్కర్ ఆలోచనలో రాజ్యాధికారమే ప్రధానమైన 'కీ', అది మన చేతుల్లో ఉంటే అన్ని ద్వారాలు తెరవచ్చు అనే అవగాహనతో దళిత ఉద్యమం ముందుకు వెళుతుంది. ఈ శతాబ్దం దళితులది. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఎన్ని దశలున్నా యో దళిత ఉద్యమానికి కూడా అన్నే దశలు, అన్నే మెట్లు ఉన్నాయి. దళితుల అంతిమ విముక్తి వరకూ ఇది సాగుతూనే ఉంటుంది.
దళితులు నిరాపజయులు. ఇది కారంచేడు, చుండూరు మృతవీరులు ఇచ్చిన సందేశం. ఆ మృత వీరుల రుధిర క్షేత్రం, రక్త క్షేత్రం దళితుల పోరాటాన్ని చరిత్రీకరించా యి. అమరులైన వారి స్మృతి చిహ్నాలు భారతీయులకు ఎంత ముఖ్యమో, కారంచేడు, చుండూరు మృతవీరుల స్మృతి చిహ్నా లు దళితులకు అంతే స్ఫూర్తి . చరిత్రను నిర్మించడం కష్టం. ఆ తరువాత అందరూ ఈ చరిత్రలో భాగమనే ప్రకటించుకొంటారు. అదే దళిత ఉద్యమ పరిణామానికి అంబేద్కర్ తత్వ శాస్త్రమే దిక్సూచి.

- డాక్టర్ కత్తి పద్మారావు
(కారంచేడు దళితుల ఊచకోతకు నేటికి 25 ఏళ్లు)




కులరాజ్య వివక్ష


కులరాజ్య వివక్ష - డాక్టర్ కత్తి పద్మారావు Andhra Jyothi 22/03/2011


కులరాజ్య వివక్ష

- డాక్టర్ కత్తి పద్మారావు

ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. ఒక విచిత్రమేమిటంటే ఎస్సీ, ఎస్టీలే తమకు వ్యతిరేకమైన ప్రభుత్వాలను ఎన్నుకొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలన్నింటిలోనూ ఎస్సీ, ఎస్టీల విషయంలో వివక్ష చూపిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర మంత్రిమండలిలో అత్యధికులు రెడ్డి వర్గీయు లు; 14 కీలక శాఖలు వారివే. ఈ విషయమై ఏ పార్టీ మాట్లాడలేదు.

కారణమేమిటి? రెడ్డి వర్గానికి కాంగ్రెస్, కమ్మ వర్గానికి తెలుగుదేశం ప్రాతినిధ్యం వహించడమే కాదూ? సిపిఐ, సిపిఎం లలో సైతం అగ్ర నాయకత్వం కమ్మవారిదే. ఆ పార్టీల కార్యవర్గాల్లో దళితులకు సముచిత స్థానం లేదు. దాంతో కమ్యూనిస్టు నాయకులు రాష్ట్ర మంత్రివర్గంలో కులాధిపత్యాన్ని ప్రశ్నించలేకపోతున్నారు.

తీసికట్టు పదవులు దళితులకు ఇచ్చారు. దళిత మంత్రులు అగ్ర కులాలకు తాబేదారులుగా మారారు. అందువల్లే బడ్జెట్ కేటాయింపుల్లో దారుణమైన వివక్ష జరిగింది. బడ్జెట్ కేటాయింపుల మీద దళిత ఉద్యమం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రణబ్ ముఖర్జీ సామాజిక న్యాయాన్ని తోసిపుచ్చారు. 1981లో ప్రణాళికా సంఘం చేసిన సూచనలను రాష్ట్ర బడ్జెట్ పాటించలేదు. ప్రణాళికా సంఘం సూచనల ప్రకారం సాంఘిక సంక్షేమ శాఖకు కేటాయించాల్సిన ధనం 16.2 శాతం.

నోడల్ ఏజెన్సీ నేర్పాటు చేసి దాని ద్వారా కేటాయించిన నిధులను ఖర్చు చేయాలి. 2009-10 బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖకు రూ. 33,496 కోట్లు కేటాయించారు. ఇందులో ఎస్సీ ప్రణాళిక వాటా రూ.5,243 కోట్లు. ఇందులో కేవలం రూ.2,764 కోట్లే ఖర్చు పెట్టారు. మరి ఎస్సీ మంత్రులు ఈ విషయంలో ఏం చేస్తున్నారు? మూడు దశాబ్దాలుగా రూ.26,406 కోట్లకు పైగా ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించిన డబ్బు ఖర్చుపెట్టలేదు. ఆ నిధుల్ని దారి మళ్ళించారు. అగ్రకులాల ప్రయోజనాల కోసం వాడుతున్నారు.

శాసనసభలో 69 మంది ఎస్సీ, ఎస్టీ సభ్యులు ఉన్నారు. పార్లమెంటులో తొమ్మిది మంది దళిత సభ్యులు ఉన్నారు. వీరంతా అగ్రకుల రాజ్యాధికారానికి దాసోహమయ్యారు. వ్యక్తిగత ప్రయోజనా ల కోసం జాతి ధనాన్ని అగ్రకుల రాజకీయ వ్యవస్థకి తాకట్టు పెడుతున్నారు. ఇదంతా కేవలం రాజకీయంగానే జరుగుతుం ది. ప్రతిపక్షాలు దీనిని అంతర్గతంగా అంగీకరిస్తూనే పైకి నినాదాలు చేస్తున్నాయి.

ప్రధాన సమస్య అయిన భూ సమస్య కూడా ఈ ఇరవై ఏళ్ళలో పక్క దారి పట్టింది. డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్టు అగ్రకుల పార్టీల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీలు ప్రయోజన రహితమైన వాళ్ళు. తమ నాయకులు ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకులని తెలిసి కూడా వారికి లోబడుతున్నారు. తద్వారా దళితుల హక్కుల్ని కాలరాయడంలో దళిత నేతలే ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకే కాదు బీసీలకు ఈ సామాజిక ద్రోహం నిరంతరంగా జరుగుతుంది.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సరైన నిధులు కేటాయించక పోవ డం, కేటాయించిన నిధులను వాడక పోవడం జరుగుతుంది. దీనివలన ఆ వర్గాలవారు భూమిలేని, ఇళ్ళులేని, ఉపాధిలేని, చివరకు జీవించే హక్కులేని వారిగా కూలిపోతున్నారు. పట్టణా ల్లో ప్రస్తుతం సెంటు స్థలం లక్షల రూపాయల ధర పలుకుతుం ది. మరి ఆ పాటి స్థలం కొనుక్కోగల స్తోమత దళితుల్లో ఎంతమందికి ఉంది?

ఈ కోణం నుంచి చూసినప్పుడు దళితుడు రానురాను నివసించే హక్కునే కోల్పోతున్నాడు! ఒక మనిషి చచ్చిపోతే ఖననం చేయడానికి శ్మశాన స్థలం లేని పరిస్థితులలో దళితులు జీవిస్తున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో దళితుల శ్మశాన స్థలాలకు డబ్బు కేటాయింపు లేదు. లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తూ, మురుగువాడల్లో జీవనం గడుపుతున్న వారికి రోడ్ల కేటాయింపు లేదు. అగ్రకులాల వీధుల్లో వేసిన రోడ్లే వేస్తున్నా రు. అగ్రకులాల కాంట్రాక్టర్లు ఆ ధనాన్ని దోచుకుంటున్నారు.

మరి ఇది బడుగు వర్గాల ప్రభుత్వమేనా? సుప్రీంకోర్టు ఆదేశించినా బీసీల ఫీజు రీయెంబర్స్‌మెంటు జరగలేదు. ఆదివాసీ లు అయితే ఈ పాలకుల దృష్టిలోనే లేరు. ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేటు ఆస్పత్రులకు లబ్ధి చేకూర్చుతున్నారు. ప్రాథమిక ఆరో గ్య కేంద్రాలలో అన్ని సదుపాయాలను ఎందుకు కలుగజేయ డం లేదు? కనీస విద్యా, వైద్య సదుపాయాలు కొరవడి ఆదివాసీలు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. భారత రాజ్యాంగా న్ని అనుసరిస్తున్నామని చెబుతున్నప్పటికీ మనుస్మృతినే మన పాలకులు అమలుపరుస్తున్నారు.

దేశ జనాభాలో ఎస్సీలు 16.2 శాతం. వారి రక్షణ కోసం రాజ్యాంగంలోని 17వ అధికరణ అస్పృశ్యతను నివారిస్తుంది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు అందరికీ సమానమేనని అధికరణ 14 స్పష్టం చేసింది. దళితుల అభ్యున్నతికి తగి న కేటాయింపులు చేయాలని అధికరణ 46 నిర్దేశించింది. బడ్జెట్ పరంగా దళితులకి కేటాయింపులు తగ్గించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.

అధికరణలు 330, 335; 1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం దళితులకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను తప్పక అమలు జరపాలి. ఆయా అధికరణలు నిర్దేశించిన వాటినన్నిటినీ అమలుపరచడానికే ఒక ప్రత్యేక పరిశోధక బృందం చేత ఏటా ఒక నివేదికను రూపొందించాల్సి వుంది. ఈ నియమాలన్నిటినీ ప్రభుత్వం పాటించడం లేదు. ప్రభుత్వ అలక్ష్యాన్ని ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిలదీయడం లేదు.

అంబేడ్కర్ అనుకున్నట్టే పూనా ఒడంబడిక ద్వారా అగ్రకుల పార్టీల నుంచి దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలుగా వస్తున్నవారు సమాజానికి పనికి రాకుండాపోతున్నా రు. సమాజంలో ఉన్న కుల తత్వాన్ని, కులాధిపత్య భావాన్ని ఈ దళిత నేతల ద్వారా అగ్రకుల రాజ్యాధికారం పెంచి పోషిస్తుంది. భారతదేశ గ్రామాల్లో మనుస్మృతి రాజ్యమే నడుస్తుంది.

స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రజల ఆధీనంలో ఉన్న భూములను ఇప్పుడు పరిశ్రమల అభివృద్ధి పేరుతో అంతర్జాతీయ సం స్థలకు తాకట్టుపెడుతున్నారు. అమెరికాకు చెందిన ఒక బహుళజాతి సంస్థతో మన ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుం ది. ఆ ఒప్పందం మేరకు రాబోయే ఐదేళ్ళ కాలంలో విశాఖపట్నంకి సమీపంలో ఉన్న నక్కపల్లిలో ఆ సంస్థ రూ.2900 కోట్ల తో ఒక భారీ పరిశ్రమను నెలకొల్పబోతుంది.

ఇందుకు ఆ సంస్థ కు మన ప్రభుత్వం 800 ఎకరాలు ఇచ్చింది. అంతేగాక మరో రూ.22,672 కోట్లతో మరో 25 పరిశ్రమలను నెలకొల్పడానికి కూడా ఆ సంస్థకి భూములు కేటాయించారు. ఈ భూములన్నీ దళిత బహుజనులకు చెందాల్సినవే. వీటన్నింటిని కుదువ పెట్టడమంటే అగ్రకులాల రాజ్యం, విదేశీ పెట్టుబడిదారులు కలిసి దళిత బహుజనులకు నిలబడేచోటు లేకుండా చేయటమే. ఈ పరిశ్రమల్లో దళిత బహుజనులను చేర్చుకోవడం ఎలాగూ జరగదు. పైగా అవి వారికి కాలుష్యాన్నే మిగుల్చుతాయి.

2011-12 ఆర్థిక సంవత్సరపు రాష్ట్ర బడ్జెట్‌లో మొత్తం కేటాయింపులు రూ.1,28,542 కోట్లు. ఇందులో ఎస్సీ, ఎస్టీల జనాభాను బట్టి వారికి రూ.22,000 కోట్లు కేటాయించాలి. అయితే 10 శాతం లోపే ఎందుకు కేటాయించారు? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? విద్యా, వైద్యరంగాలు, పౌర సరఫరా లు, గృహ నిర్మాణానికి కేటాయింపులు తగ్గించారు. కొన్ని రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేశారు.

2010-11 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌కి సంబంధించి రూ.26,000 కోట్ల బకాయి లు ఇంకా తీర్చవలసి వుంది. ఇటువంటి వాటన్నిటికి సాంఘిక సంక్షేమ శాఖ కేటాయింపుల్లోంచి తీరుస్తూ ఉన్నారు. బడ్జెట్‌లో చూపించిన డబ్బునే దారి మళ్ళిస్తున్నప్పుడు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమి చేస్తున్నారు?

ఒక దళితవాడ వైశాల్యం రెండు ఎకరాల లోపు ఉంటుంది. అందులో 300 ఇళ్ళు ఉంటాయి. ఒక ఎస్టీ గూడెం వైశాల్యం అర ఎకరంలోపు ఉంటుంది. ఒక రెడ్డి ఊరు వంద లేదా పాతిక ఎకరాల్లో ఉంటుంది. వాళ్ల పొలాల్లోకి రోడ్లు వేస్తారు. గోదావరి జిల్లా ల్లో క్షత్రియుల పొలాలు, చెరువుల్లోకి రోడ్లు వేసి ఉంటాయి. దళితులు చనిపోతే శ్మశానానికి దారి ఉండదు. శ్మశాన స్థలాల కోసం, శ్మశానాల్లో దారి కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి.

చివరకు ఎమ్మార్వో కార్యాలయాల ముందు శవాలను పెట్టి పోరా టం చేశాం కూడా. శ్మశాన స్థలాల కొనుగోలుకు డబ్బులేదని ఎమ్మార్వోలు, కలెక్టర్లు అంటున్నారు. అంటే చచ్చిన మనిషిని పాతి వేయడానికి ఈ ప్రభుత్వానికి డబ్బులేదు. ఎస్సీలకు కేటాయించిన డబ్బు వారికి ఖర్చు పెట్టడంలేదు. ఎంత అమానుషం! మన దళిత మంత్రు లు, ఎమ్మెల్యేలు ఇన్నేళ్లుగా ఏం చేస్తున్నారు?

ఎండాకాలం వచ్చింది. 100కి 80 దళిత వాడ ల్లో తాగునీరు లేదు. అన్ని పంచాయతీ ట్యాంకు లు అగ్రకులాల వీధుల్లోకే నీరు సరఫరా చేస్తున్నాయి. వాటర్ ట్యాంకుల్లో దళిత వాడలకు నీటి కేటాయింపులేదు. ఒకటో రెండు పైపులు వేస్తారు. సొంతంగా పైపులు వేసుకునేవాళ్ళు రూ.10 వేలు కట్టమంటారు. పూటకే గడవని వాళ్ళు పదివేలు ఎలా కట్టగలరు? ఆదివాసీలు ఒక్క బిందె నీటి కోసం మూడు కిలో మీటర్లు నడిచి వెళ్ళుతుంటారు.

అగ్రకులాల వారి చెరువుల్లోకి దళితులని రానివ్వటం లేదు. వాళ్ల పశువుల్ని తోలి కడుగుతున్నారు. కాని దళితుల్ని చెరువుల్లోని నీరు తీసుకువెళ్లనివ్వని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎస్టీ, ఎస్సీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు? మన గ్రామాల్లోకి ఈ మహాశయు ల కార్లు రావు. రోడ్లన్నీ గోతుల మయమే. ఎవరైనా దళిత స్త్రీ నొప్పులు వస్తే మంచాల్తో కట్టుకుని మోసుకువెళ్ళాల్సిన గ్రామాలు ఇంకా ఉండడం మనకు సిగ్గుచేటు కాదా?

గ్రామాన్ని, వాడని వేరు చేశారు. గ్రామాన్ని సస్యశ్యామలం చేసుకుంటున్నారు. వాడని జీవించటానికి వీలులేనిదిగా మలుస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే దళితులు, ఆదివాసీల కు రాజకీయ, సామాజిక చైతన్యం కావా లి. 'మన ఓట్లు మనమే వేసుకుందాం, మన రాజ్యాన్ని మనమే నిర్మిద్దాం' అనే దృక్పథం పెరగాలి. దళిత యువకులు అగ్రకులాల నాయకత్వంలో కాకుండా వారే నాయకులుగా ఎదగాలి. గ్రామ రాజకీయ పెత్త నం దళిత బహుజనుల చేతుల్లోకి రావాల్సివుంది.

రాజ్యాధికార మే ప్రధానమైన 'కీ' అని అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు. దళిత బహుజనులు తమ రాజ్యాధికార సాధన కోసం అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలో కృషి చేయ డం ద్వారానే ఈ దోపిడీని ఎదిరించగలరు. అగ్రకులాలవారికి అనుకూలంగా వ్యవహరిస్తు న్న ఇప్పటి దళిత ఎమ్మెల్లేలు, ఎంపీల వల్ల ఎస్సీ, ఎస్టీలకే కాదు మొత్తం సమాజానికి కూడా నష్టమే.

- డాక్టర్ కత్తి పద్మారావు

మార్గం చూపిన మహోన్నతురాలు



ప్రపంచవ్యాప్తంగా తాత్వికులకు, ఉద్యమకారులకు , పోరాట వీరులకు బాసటగా నిలిచిన స్త్రీలలో సావిత్రి బాయి ఫూలేది అద్వితీయ చరి త్ర. మార్క్స్‌కు జెన్నీ ఎంతో సహకారాన్ని అందించారు. అయితే అది తాత్విక రంగంలోనే ఎక్కువగా జరిగింది. కానీ సావిత్రి బాయి మొత్తం పోరాటంలోనే భర్తకి అండగా నిలిచారు. భారతదేశ చరిత్రలో దళితులకు పాఠశాల పెట్టిన ఘనత ఫూలే దంపతులదే. అట్టడుగు వర్గాలకు విద్య చెప్పడమనే ఒక పోరాటాన్ని వారు అప్పుడే స్వీకరించారు. స్త్ర్రీని బానిసగా చూసే ఈ సమాజంలో తన భార్యను విద్యావంతురాలిని చేయడమే కాక ఆమెలో పోరాట స్ఫూర్తిని తీసుకురావడంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ఒక చరిత్రాత్మకమైన బాధ్యతను నిర్వహించారు.

మహారాష్ట్ర సంస్కర్తల్లో బాల్ శాస్త్రి, జింజేకర్, బాన్ మహాజన్, దాదోబ పాండరంగలౌర్కాడ్‌కర్ (1814-82), నానాశాంకర్ సేట్ (1803-85), గోపాలరావ్ హరి దేశ్‌ముఖ్ (1823-92) పేర్కొనదగినవారు. వీరందరి నుంచి ఫూలే ప్రేరణ పొందారు. 'విద్య మానవుణ్ణి వికాసవంతుణ్ణి చేస్తుంద'ని జ్యోతిబా ఫూలే భావించారు. అందునా స్త్రీ విద్యనభ్యసించకపోవడం వల్లనే మూఢాచారాల్లో చిక్కుకుపోయిందని భావించి 1848లో బుధవారపు పేటలో ఒక పాఠశాల ఫూలే దంపతులు ప్రారంభించారు.

ఇది మన దేశంలో స్త్రీ విముక్తోద్యమానికి ప్రప్రథమంగా అ, ఆలు దిద్దిన పాఠశాల. శూద్ర స్త్రీలకు, దళితులకు విద్యా ప్రదానం అనే ఆలోచన మన సమాజంలో 1830 వరకు లేనేలేదు. ఈ పరిస్థితిని మార్చడానికి తొట్ట తొలుత పూనుకున్న వారు జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రి బాయి. సావిత్రి బాయి తన భర్త అనే జ్యోతికి నూనెలా వ్యవహరించా రు. అంటే ఆమె లేకపోతే ఆ జ్యోతికి వెలుగులేదు అన్నంతగా మమేకమయ్యారు. ఆమె సహచర్యం వల్లే జ్యోతిబా ఆలోచనలన్నీ స్త్రీ సంక్షేమం వైపు మళ్ళాయి. ఆయన కుల మతాలకు అతీతంగా స్త్రీల నందరినీ అణగారిన శూద్ర వర్గంగానే గానే భావించారు. సావిత్రి బాయి కూడా అదే అవగాహనతో ముందుకు నడిచారు.

సావిత్రి బాయి 'భారత రత్న' పురస్కారానికి అర్హురాలు. భర్తతో కలిసి ఎన్నో సంస్థల్ని స్థాపించి, సమర్థంగా నిర్వహించారు. నేడు దళిత బహుజనుల్లో కొద్దో గొప్పో సమాజ సేవ చేద్దామనుకున్న కార్యకర్తలకు ఇండ్లలో సహకారం పెద్దగా లేదు. ఉపాధ్యాయులుగా, ఉద్యోగస్తులుగా ఉన్న స్త్రీలకు దళితవాడల్లో చదువురానివారికి చదువు చెపుదామనే ఆలోచన తక్కువ. ఇది శోచనీయం. ఇల్లుని ఒక విద్యాలయంగా తీర్చిదిద్దే సంస్కృతిని సావిత్రిబాయి నుంచి ఉద్యోగస్తులైన దళిత విద్యావతులు నేర్చుకోవల్సివుంది.

సావిత్రిబాయి త్యాగమయి. ఆమె ఒక నిర్మాణ కార్యకర్త. మహాత్మా ఫూలే, డాక్టర్ అంబేద్కర్ గురించి మనం ఎలా ప్రచారం చేస్తున్నామో, అలాగే సావిత్రి బాయి గురించి నిర్మాణాత్మకంగా ప్రచారం చేయవలసిన చారిత్రక సందర్భం మన ముందుకు వచ్చింది. ఆ రోజుల్లోనే దళితుల విద్య గురించి ప్రభుత్వానికి ఆమె ఇలా నివేదించారు: 'మహర్లు, మాంగులు అంటరానివాళ్లుగా భావింపబడటం వల్ల, వాళ్ళ పిల్లలు ఎలాంటి ప్రాథమిక విద్య అందుకోలేక పోతున్నారు. ఈ పరిస్థితి గమనించి ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక పాఠశాలలు తెరిచింది. కానీ అవి కేవలం పట్టణాలలో మాత్రమే ఉన్నాయి.

పూనా నగరంలో మహర్, మాంగ్‌ల జనాభా 5000కి మించి ఉంది. అక్కడ వారి పిల్లల కోసం కేవ లం ఒక్కటే పాఠశాల ఉంది. దానిలో చదివే పిల్లల సంఖ్య 30 కంటే తక్కువే. అందరూ బాలురే. ఈ స్థితి విద్యాశాఖాధికారులకు ఏ విధంగాను పేరు తెచ్చేది కాదు. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే విక్టోరియా మహారాణిగారి ప్రకటనలో వాగ్దానం చేసినట్టు మహర్, మాంగ్ కులస్తులకు ఇతర నిమ్న జాతులకు ఎక్కడైతే వారి జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందో అక్కడ వారికోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయవల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కుల వివక్ష వల్ల అగ్ర వర్ణాల వారు వీరిని సాధారణ పాఠశాలల్లోకి రానివ్వరు కనుక ఈ ఏర్పాటు అవసరం'.

ఎన్నో పోరాటాల ఫలితంగా దళిత విద్యార్థులకు పలు హాస్టల్స్ ఏర్పడ్డాయి. అయితే ఆ హాస్టల్స్‌లో వారు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. సావిత్రి బాయి ఆదర్శంగా ఈనాడు ఈ విద్యార్థులకు దళిత ధనవంతులు, ఉద్యోగులు ఎంతో సహకారాన్ని అందించవలసివుంది. లక్షలు ఖర్చు పెట్టి వివాహాలు చేసుకుంటున్నారు. పుట్టిన తేదీలకు పెద్ద పెద్ద కేకులు కోస్తున్నారు. పిల్లల్ని ఫైవ్‌స్టార్ చాక్లెట్లతో పెంచుతున్నారు. అయితే తమ పక్కనే తమ జాతి విద్యార్థులు ఒక కిలో కూర ముప్పై మంది వడ్డించుకుని జీవిస్తున్నారు. కొన్ని వేల హాస్టల్స్‌లో మగ్గుతున్న ఈ పిల్లలకు ఒక దళిత ఉద్యోగి యాపిల్ పండ్లు పంచిన సంఘటన మనకు కరువైంది.

ఈ పరిస్థితుల్లో సావిత్రి బాయి లాగా, ఉద్యోగస్తులైన దళిత స్త్రీలు ప్రతి ఆదివారం ఏదో ఒక హాస్టల్‌కి వెళ్ళి అక్కడ పిల్లల్ని పరామర్శించాల్సిన బాధ్యతను తీసుకోవాలి. 'విద్యావంతులు కండి'అని అంబేద్కర్ పిలుపునిచ్చింది కేవల ం ఉద్యోగులుగా జీవించడం కాదు. ఇతరులకు సహాయపడే గుణాన్ని పెంచుకోవాలి. ఈ స్ఫూర్తిని అంబేద్కర్ సైత ం సావిత్రి బాయి ఫూలే నుంచి అందుకున్నారు.

సావిత్రి బాయి ఫూలే ఒక సజీవమైన జీనవ స్రవంతి. మానవతా పరిమళాన్ని వెదజల్లిన కార్యకర్త. ఆమె కరుణ శీలి. భర్తని కాపాడటంలో వీర మాత. భారత్‌లో ఇంత మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహిళ మరొకరు లేరు అనడంలో అత్యుక్తిలేదు. తన పరిపరాలను సేవామయం చేసిన మహోన్నతురాలు సావిత్రి బాయి. మనం ఆమె మార్గంలో నడుద్దాం.

- డాక్టర్ కత్తి పద్మారావు

(నేడు సావిత్రీ బాయి ఫూలె 180వ జయంతి)
Andhra Jyothi News Paper Dated 03/01/2012

బడుగుల బాధలపై చర్చలేవీ? - డా. కత్తి పద్మారావు



పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ చర్చలు ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. అయితే ఈనాటి బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు దూషణ భూషణలతో కాలం గడుస్తుంది. ఇద్దరూ తమ సామాజిక వర్గాలకు ప్రతినిధులు మాత్రమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సామాజిక వర్గానికి క్యాబినెట్‌లో పెద్దపీట వేశారు. కిరణ్‌కుమార్ రెడ్డి తను కాక 13 మంది రెడ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్న వారిలో కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ చర్చలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. వారు మీరు దొంగలంటే మీరు దొంగలని మాట్లాడుకుంటున్నారు. 

నిజానికి వీరిద్దరూ అత్యల్ప సంఖ్యాకులకు ప్రతినిధులు. ఒకరు 3 శాతం కాగా మరొకరు 6 శాతం జనాభాకి ప్రతినిధులు. ఆంధ్ర రాష్ట్రంలో బీసీలు 52 శాతం ఉన్నారు. ఎస్సీలు 2001 జనాభా లెక్కల ప్రకారం ఒక కోటి ఇరవై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది ఉన్నారు. అలాగే ఎస్టీలు యాబై లక్షల ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు. శాసనమండలిలో కానీ శాసన సభలో కానీ అరవై మంది సభ్యులు ఎస్సీ, ఎస్టీలకు ప్రతినిధులుగా ఉన్నారు. అయితే బీసీల సమస్యలు గాని, ఎస్సీ, ఎస్టీల సమస్యలు గాని మాట్లాడే అవకాశం వీరికి రావట్లేదు. ఒకవేళ మాట్లాడే అవకాశం ఇస్తే పార్టీ గొప్పలు చెప్పడానికి మాత్రమే అవకాశం ఇస్తారు. 
బీసీల విషయానికి వస్తే ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ విషయం కాని, స్కాలర్‌షిప్ విషయం కాని, వృత్తులు కూలిపోతున్న విషయం కాని, చర్చకు రాలేదు. ఎస్టీల విషయంలో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం అటవీ ప్రాంతాల్లోని సహజ వనరులపై సంపూర్ణ హక్కులు గిరిజనులవే. 1995లో బమారియా కమిషన్ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే 50 శాతం యాజమాన్య హక్కులు వారికే చెందాలి. 20 శాతం భూమి సొంత దారులకు 30 శాతం భూమి పెట్టుబడిదారులకు ఇవ్వాలని కమిషన్ నివేదికలో పేర్కొనడం జరిగింది. 

గిరిజన హక్కుల్ని కాలరాస్తున్న రెడ్డి, కమ్మ ప్రభుత్వాలు ఈ ప్రస్తావన అసెంబ్లీలో రాకుండా చూస్తున్నాయి. బీసీలకు ఎస్సీలకు, సంబంధించి అగ్రకులాల ప్రతినిధులే సంస్కర్తల్లా మాట్లాడుతున్నారు. 2,760 కోట్లు ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించి 265 కోట్లు అందులో స్వాహా చేసినట్టు రుజువైనా రెండు పక్షాలు కలిసి ఆ చర్చను దాటవేశాయి. ఇక ఎస్సీల విషయానికి వస్తే రాజ్యాంగంలో పేర్కొనబడిన ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 (14)లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక మార్గదర్శకాలు కల్పించబడ్డాయి. 

1980లో దళితుల సామాజిక, ఆర్ధికాభివృద్ధి కోసం షెడ్యూల్డ్ కులాల సబ్ ప్లాన్ ఏర్పడింది. ప్లానింగ్ కమిషన్ దీనికిచ్చిన గైడ్‌లైన్‌ను బట్టి ఆయా రాష్ట్రాల్లో దళితుల జనాభా నిష్పత్తిని బట్టి ప్లాన్ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగాలి. అయితే మన రాష్ట్రంలో గడచిన 19 సంవత్సరాల్లో రూ.16,912,91 కోట్ల నిధులు ఎస్సీలవి 5 వేల కోట్లు ఎస్టీలవి దారి మళ్లించబడ్డాయి. ఎస్సీ, ఎస్టీల్లో భూమి లేని వారికి భూమి కొనివ్వడానికి ఎస్సీ, ఎస్టీ గ్రామాలకు లింకు రోడ్లు, గృహ వసతి, తాగునీరు, మురుగు కాల్వల నిర్మాణం, మరుగుదొడ్లు నిర్మించాలి. 

కాని ఇవేవి చేయకుండా ఈ రెండు ప్రభుత్వాలు దారి మళ్లించినందుకు వీరిని రాజ్యాంగం ప్రకారం శిక్షించవచ్చు. రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించటం అన్నిటి కంటే పెద్ద నేరం. గడిచిన 50 సంవత్సరాల్లో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు సాధారణ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీలు ఇప్పటికీ ఆరుగురు మాత్రమే గెలిచారు. ఇక రాజ్యసభ విషయానికి వస్తే 148 రాజ్యసభ సభ్యత్వంలో 14 మాత్రమే వీరికి లభించాయి. అంతేకాకుండా మంత్రి పదవుల్లో ప్రాధాన్యం ఉన్న ఆర్థిక, రెవెన్యూ, హోమ్ వంటివి ఎప్పుడోగాని లభించడం లేదు. ఇక మైనార్టీలకు వస్తే గత పన్నెండు ఎన్నికల్లో మొత్తం కలిపి 3.83 శాతం ప్రాతినిధ్యం పొందగలిగారు. 

రాజ్యాంగ రక్షణలున్న ఎస్సీ, ఎస్టీల సంగతి ఇలా ఉంటే బీసీల సంగతి ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు అన్నీ కూడా బలహీనవర్గాల పూర్తి భాగస్వామ్యం లేని ప్రభుత్వాలు, బలహీనవర్గాలని ఏదో ఒక విధంగా రాజకీయంగా అణచివేసిన ప్రభుత్వాలే అన్నది గుర్తుంచుకోవాలి. గతంలో జరిగిన అన్ని ఎన్నికలలో ఎన్నికల ముందు బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తామని చెబుతూనే టికెట్ల పంపిణీలో మొండిచెయ్యి చూపించి మోసగించడం నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియగా ఉంటూ వచ్చింది. చివరకు అసెంబ్లీలో కూడా బీసీల సమస్యల మీద మాట్లాడనివ్వలేదు. కొన్ని జిల్లాలైతే బీసీల ప్రాతినిధ్యాన్ని మరింత తగ్గిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 

గత పదకొండు ఎన్నికల్లో 186 మంది అభ్యర్థుల్లో 82.25 శాతం సీట్లు అనగా 153 మంది రెండు కులాల వారే ఎన్నికయ్యారు. బీసీలు కేవలం 2.68 శాతం మాత్రమే ఎన్నికయ్యారు. అంటే ఐదు సీట్లు మాత్రమే. ముస్లిములయితే 1.61 శాతం మాత్రమే ఎన్నికయ్యారు. కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీ మూడు పాలక కులాలకే పెద్దపీట వేశారు. గుంటూరు జిల్లాలో 4 పార్లమెంటు నియోజకవర్గాలు, 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత పదకొండు ఎన్నికలు పరిశీలిస్తే 209 మంది అభ్యర్థులు గెలిచారు. 89 శాతం అంటే 189 మంది అగ్రకులాల వారే గెలిచారు. 

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పోను బీసీలకు నామమాత్రంగానైనా సీట్లు ఇవ్వలేదు. 1978లో (ఇతర పార్టీలు) బీసీలకు ఒక సీటు ఇచ్చారు. 1983లో ఒక సీటు ఇచ్చారు. 1985లో (తెలుగుదేశం) ఒక సీటు ఇచ్చారు. 1994లో (తెలుగుదేశం) ఒక సీటు ఇచ్చారు. 1999లో ఇతర పార్టీలు ఒకటి, కాంగ్రెస్ 3 సీట్లు ఇచ్చాయి. 2004లో ఇతర పార్టీలు 1 సీటు ఇచ్చాయి. మొత్తం కలిపి 14 సీట్లు ఇచ్చారు. ఇది 6.7 శాతం అంటే బీసీలకు రావాల్సిన సీట్లు 52 శాతం వుండగా మొత్తంగా పెద్ద ఎత్తున అగ్రకులాలు దురాక్రమణ చేస్తున్నారు. ఆయా పార్టీల్లో బీసీలు తమ రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడలేక పోతున్నారు. నిజానికి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు లేకపోతే మొత్తం రాష్ట్రం మీద 4, 5 సీట్లు కూడా ఇచ్చేవారు కాదని అర్థమవుతుంది. 

ప్రకాశం జిల్లాలో మరీ దారుణం. గడిచిన పదకొండు ఎన్నికల్లో మొత్తం 149 మంది సభ్యులు ఈ జిల్లా నుంచి ఎన్నిక కాగా అందులో 88.59 శాతం (132) అభ్యర్థులు అగ్రకులాలకి ముఖ్యంగా కమ్మ, రెడ్డి కులాలకు చెందినవారు. 7.38 శాతం ఎస్సీలకు రిజర్వుడు నియోజకవర్గాల నుంచి ఎన్నిక కాగా, కేవలం 4.02 శాతం (6) మాత్రమే బీసీల నుంచి ఎన్నికయ్యారు. ఈ విధంగా ప్రతి జిల్లాను పరిశీలస్తే బీసీలు రాజకీయంగా ఈ రెండు పార్టీల చేత నిర్లక్ష్యానికి గురవుతున్నారు. బడ్జెట్‌లో సుమారు 21 శాతం ఎస్సీలు, ఎస్టీలకు ఇవ్వాలి. సుమారు రూ.30 వేల 450 కోట్లు రావాల్సి ఉంది. కనీసం 30 శాతం బీసీలకు కేటాయించాలి. కాని అలా కేటాయించలేదు. 

అసెంబ్లీలో రెండు కులాల వారే వాదించుకుంటున్నారు. ఆ రెండు కులాల్లో పేదలు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఫీజులు కట్టలేని వారు ఉన్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. సిపిఐ, సిపిఎంలో కూడా సీట్లు కమ్మ, రెడ్లకే ఇస్తున్నారు. అంతేకాదు, ఆయా పార్టీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు అగ్రకులాల బడ్జెట్‌కే మద్దతిస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ధనవంతులు రెడ్ల పార్టీ. ఇక టిఆర్ఎస్ వెలమ ఆధిపత్యంలో నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇంటా, బయట పోరాటం అవసరం. వీరంతా కలిసి రాజకీయ పార్టీని రూపొందించుకోవడంతో పాటు వివిధ పార్టీల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తమ సాధికారత కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. 

ప్రజలు సిగ్గుతో తల వంచుకునే కుంభకోణాల గురించి వ్యక్తిగత సమస్యల గురించి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. చట్ట సభల్లోని దళిత, బహుజన ప్రతినిధులు ఇంకా స్వీయ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించవలసి ఉంది. డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికే అవమానం జరిగినప్పుడు ఆ విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో వేయాలనే విషయాన్ని ప్రతిపాదిస్తూ ఆ డిమాండ్ కోసం పోరాడటంలో ఐక్యతను ప్రదర్శించాల్సి ఉంది. నిజానికి బడ్జెట్ కేటాయింపుల్లో దళిత, బహుజనులకు జరుగుతున్న అన్యాయం రాజ్యాంగ విరుద్ధమైనది. 
ఈ విషయంగా దళిత, బహుజన మేథావులు సిద్ధపడాలి. పోరాటం, పునర్నిర్మాణం దళితుల బహుజనులకు నిరంతర చర్య. చట్ట సభలను పోరాట కేంద్రాలుగా మార్చాలి. మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు పౌర హక్కులు కేవలం బహిరంగంగా చర్చించేవే కాదు. అవి తప్పక చట్ట సభల్లో ప్రమాణ బద్ధంగా చర్చించబడాలి. ఈ సందర్భంగా డా.బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషిని అందరూ ఒక్కసారి అధ్యయనం చేయాల్సి ఉంది. ప్రాతినిధ్యం అంటే వ్యక్తిగత ప్రాతినిధ్యం కాదు. అది తప్పకుండా సామాజిక శ్రేణుల ప్రాతినిధ్యం కావాలి. ఇది అంబేద్కర్ మహాత్మా ఫూలే ఆశయాల ద్వారానే సాధ్యం 

- డా. కత్తి పద్మారావు

Andhra Jyothi News Paper Dated : 14/03/2012 


మానవీయ విలువలు లేని దేశ బడ్జెట్--- కత్తి పద్మారావు



కేవలం సబ్సిడీల ద్వారా ఉపశమనాల ద్వారా అంకెల గారడీ ద్వారా దేశ సంపద వర్ధిల్లదు. రాజ్యాంగకర్త డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను ప్రణాళికా సంఘం, బడ్జెట్ రూపకర్తలు తప్పకుండా సమన్వయించుకోవాలి. నూతన జీవన విధానానికి ప్రత్యామ్నాయ సామాజిక ఆర్థిక జీవన విధానాన్ని రూపొందించగలిగినప్పుడే మానవాభ్యుదయం ప్రతిఫలిస్తుంది. లేకుంటే బడ్జెట్, తాబేదారులకు విస్తరి అవుతుంది తప్ప అభివృద్ధి వుండదు.

భారతదేశ ఆర్ధిక పరిస్ధితి మరింత దిగజారడానికి కారణం పరిశీలిస్తే దేశీయ వనరులను, శ్రమను సమన్వయం చేసే ప్రయత్నం మన్మోహన్ ప్రభుత్వం చేయలేకపోవడమే. అంతకు ముందున్న యన్.డి.ఎ. ప్రభుత్వానికి సెక్యులర్ విధానం లేకపోవడం, బడుగు వర్గాల మీద సామాజిక న్యాయ దృష్టి లేకపోవడం వల్ల ఆ ప్రభుత్వాన్ని ప్రజలు దించేశారు. యు.పి.ఎ. కూటమి అధికారానికి వచ్చాక వీరు అంతకంటే తీసికట్టుగా సామాజిక ఆర్ధిక విధానాలను రూపొందించారు.

ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మెజారిటీ ప్రజలకు పని కల్పించగలగాలి. దానితో పాటు జీవితం మీద ఆశ కల్పించాలి. నిరాశాజనకమైన వాతావరణంలో మనుష్యులు ఉత్తేజంగా వుండలేరు. తప్పక పునర్నిర్మాణాలకు ప్రత్యామ్నాయాలకు పునాదులు వేయాల్సివుంది. అప్పు లు చేసి బ్రతకండి, అప్పులతో జీవించండి వంటి పిలుపులనివ్వడం వల్ల వస్తూత్పత్తిరంగం కుప్పకూలింది. ప్రజలు వస్తు ఉత్పత్తిలో జీవన వ్యవస్ధల్ని పునరుజ్జీవింపచేసుకుంటారు.

వారికే పనిలేదంటే, పనినుంచి ఉత్పత్తి పరికరాల నుంచి తయారైన వస్తువు మార్కెట్టుకు వెళ్లి ధనాన్ని సంపాదించాల్సి వుంది. అయితే సామాజిక ఉత్పత్తులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. జీవనాధార అంశాల పట్ల ప్రభుత్వానికి ప్రభుత్వేతర సంస్ధలకు లక్ష్యం లేదు. ముఖ్యంగా ఆహారం, ఆహార్యం, నివాసం, వాహనం, విద్య, ఆరోగ్యం వంటివన్నీ ఒక క్రమంలో అభివృద్ధి చెందాల్సి వుంది. కానీ మౌలికాంశాల రూపకల్పనలన్నింటిలోనూ ప్రభుత్వం వెనుకబడి వుంది.

ఈ విషయంగా రైల్వే బడ్జెట్టును పరిశీలిస్తే దక్షిణ భారతదేశంలో 2010-2011 ఆర్ధిక సంవత్సరంలో కేవలం 33.7 కోట్ల మందిని రైళ్ల ద్వారా తరలించగలిగారు అంటే బ్రిటీష్ కాలం నుంచి రూపొందిన రవాణా వ్యవస్ధ వేగవంతం కాలేదని అర్ధం. ఆధునిక సమాజంలో వున్న కదలిక సామాజిక చలనాన్ని నిర్ణయిస్తుందనే సూత్రానికి కట్టుబడిందనే అర్ధం. కేంద్ర ప్రభుత్వం పనిమొత్తంలో ప్రధాన బాధ్యత భారత దేశ ప్రజలకు చలనాన్ని పెంచవలసివుంది. ఆయా రాష్ట్రాల్లో ఈ చలనం పట్ల కూడా వివక్ష వుంది. పశ్చిమబెంగాల్లో 44.06 కిలోమీటర్లు వుంటే ఆంధ్రప్రదేశ్‌లో 18.80 కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్లు వేసివున్నాయి. దీన్నిబట్టి సామాజిక చలనాన్ని పెంపొందించడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వుంది. అంతేగాక విద్య, వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధికి రైల్వే వ్యవస్ధ అభివృద్ధి కాకపోవడం కూడా గొడ్డలిపెట్టే అవరోధం అవుతుంది.

2012-2013 బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి 6,300 కోట్లు అంచనా వేశారు. నిజానికి భూమి పంపిణీ ప్రస్తావనే ఈ బడ్జెట్‌లో లేదు. బడ్జెట్‌కు భూమి పంపిణీకి సంబంధం వుంది. భూమి కొనుగోలు ప«థకం డా.బి.ఆర్.అంబేద్కర్ మొదటి బడ్జెట్‌లోనే ప్రతిపాదించారు. ప్రభుత్వం భూములన్నింటిని మల్టీనేషనల్స్ కంపెనీలకు అమ్ముకుంటున్న దశలో దళితులకు, ఆదివాసీలకు, భూమిలేని నిరుపేదలకు భూమిని పంచడం వల్లనే ఉత్పత్తి క్రమం పెరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయం ఆయా రాష్ట్రాలలో రెండు, మూడు కులాల చేతుల్లోనే వుంటుంది. వారిచేతుల్లోనే రాజ్యాధికారం వుంది.

వ్యవసాయం కొన్ని కులాల చేతుల్లోనే వుంటే దేశం బాగుపడదు. వ్యవసాయదారుడు భూమిమీద, వ్యవసాయం మీద నిలబడి లేడు. పెట్టుబడిదారులు కొందరు వడ్డీ వ్యాపారస్ధులుగా రూపొందుతుంటే కొందరేమో వ్యవసాయం గిట్టక అప్పులుచేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు వ్యవసాయ భూములను ప్రభుత్వమే తగురేటుకు కొని దళితులకు, గిరిజనులకు పంచాలనేది అంబేద్కర్ ఆలోచన. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి దళిత గిరిజనుల మీద నిర్లక్ష్యం వుంది. ప్రణబ్‌ముఖర్జీ రాజకీయ నిపుణుడు కాదు. ఆయన 2012-2013 వార్షిక బడ్జెట్ మొత్తం 14,90,925 కోట్లలో పార్లమెంటుకు సమర్పించబడింది. ఇందులో పన్నుల రాబడి 10,77,612 కోట్లు గాక పన్నులకు ఇతర ఆదాయం, లక్షాఅరవై నాలుగు వేల కోట్లు. నికర మార్కెట్ రుణాలు 4, 79,000 కోట్ల రూపాయలుగా తేల్చారు.

ఇందులో ప్రధానంగా 1,93,407 కోట్లు రక్షణకు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది 13 శాతం ఎక్కువ. చైనాతో పాకిస్తాన్‌తో పోటిపెట్టి దేశీయ రక్షణకు ఇబ్బడిముబ్బడిగా పెంచే క్రమం కొనసాగుతుంది. ఇందువల్ల ప్రధానమైన పరిణామానికి మూలమైన ప్రాధమిక విద్యకు క్రిందటి బడ్జెట్‌లో 52వేల కోట్లు కాగా, ఇప్పటి బడ్జెట్‌లో 61వేల కోట్లు పెంచారు. 9వేల కోట్లు మాత్రమే పాఠశాలకు పెంచారు. ఇంతవరకు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు, ప్రహరీలు ఆటస్థలాలు, ఆట వస్తువులు, చాక్‌పీసులు కూడా లేని బడులు వున్నాయి. విద్యాహక్కు చట్టం కింద 25 శాతం పేద విద్యార్ధులను ప్రయివేటు విద్యాలయాల్లో చేరుస్తామన్నారు. అది అమలు జరగడం లేదు.

భారతదేశ వ్యాప్తంగా ప్రాధమిక విద్య కుంటుబడటంతో చైల్డ్‌లేబర్ పెరిగిపోతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న చిన్న కర్మాగారాలు, గృహనిర్మాణ పనుల్లో కోట్లాది మంది చైల్డ్‌లేబర్ తమ జీవితాన్ని బుగ్గిచేసుకొంటున్నారు. దేశానికి పునాదియైన చిన్నారుల మీద కనికరం లేదు. ప్రాథమిక విద్య అభివృద్ధి చెందాలంటే భూమి పంపకం తల్లిదండ్రుల నికరాదాయంలోకి రావలసిన అవసరం వుంది.

ఉన్నత విద్యలు అభ్యసించే వారు ప్రపంచ సగటు 23 శాతం వుంటే, మన శాతం 12.4 మాత్రమే. సంపన్న వర్గాలే ఎక్కువగా ఈ విద్యకు చేరగలుగుతున్నారు. దేశంలోని 22 కేంద్రీయ విశ్వవిద్యాలయల్లో బ్రాహ్మణవాదం కొనసాగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మొదలైన సబ్జెక్టుల్లోకి శూద్రులను, అతిశూద్రులను రానివ్వడం లేదు. విశ్వవిద్యాయలాలు బ్రాహ్మణ అగ్రహారాల్లా నడుస్తున్నాయి. ప్రోగ్రెసివ్ సెక్టారులో కూడా బ్రాహ్మణులే ఎర్రముసుగులతో ఛాంపియన్‌లుగా వుంటున్నారు. ఇటు ఉన్నత విద్యలో బ్రాహ్మణులు, అటు భూస్వామ్య కులవ్యవస్ధలను కొనసాగిస్తున్న శూద్ర అగ్రకులాలు ఈ బడ్జెట్‌ల సారాన్ని పిండుకొంటున్నాయి.

మంత్రులు, అధికార యంత్రాంగంలోను ఉన్నత విద్యలోను ఉన్న కుల వివక్ష కారణంగా దళితులకు కేటాయించిన నిధులు దళితులకు చేరడం లేదు. దారి మళ్ళించబడుతున్నాయి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్లు దెబ్బకొట్టిన రెండు అంశాలు చేనేత, వ్యవసాయం. మిల్లు వస్త్రాల వల్ల మొత్తం చేనేత వ్యవస్థలను కుప్పకూల్చి నష్టాల్లోకి నెట్టారు. స్కూల్ డ్రస్‌లు, మిల్ట్రీ, పోలీసు, టీచర్లు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ వ్యవస్ధలన్నింటికి చేనేత వస్త్రాలను కంపల్సరీగా కొనడం నిర్ణయిస్తే ఇప్పుడున్న చేనేత కార్మికులు చాలరు. చేనేత మొదటి దళితులే ప్రామినెంట్‌గా నేసేవాళ్ళు. దీనికి ఆదాయ వనరులు పెంచి ఎస్‌సి, బిసిలకు సమాన ప్రతిపత్తి ఇందులో పెంచాలి. నశించిపోతున్న వృత్తులను పునరుద్ధరించడం ద్వా రా సామాజిక ఆర్ధిక పునరుజ్జీవనం జరుగుతుంది. ఆర్ధిక మంత్రికి భారతీయ మూల ప్రకృతుల మీద పట్టూ ఉండాలి. ఆంధ్రదేశంలో దొరుకుతున్న భూవనరులను ఇతర దేశాల కమ్ముకున్న ఉన్నతాధికారులు ఎంత దేశ ద్రోహానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా హోంశాఖకు కూడా నిధులు తగ్గించారు. ఒక పక్క అవినీతిని నిర్మూలించామంటున్నారు.

మరో ప్రక్క స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) నిష్పత్తి 2007-08లో 17.7 శాతం ఉండగా, అందులో కేంద్రం వాటా 12 శాతం. నేడు అది వరుసగా 15.4 శాతానికి పడిపోయింది. పనుల్లో ఇచ్చే మినహాయింపులు కూడా సబ్సిడీలే. కేంద్ర బడ్జెట్‌లు 2006-2007 నుంచి రాబడులు విషయం ముందే ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నాయి. సారాంశం ఏమిటంటే, మినహాయింపులు కనుక లేకపోతే పన్ను జిడిపిలో 5.5 శాతం పెరుగుదల కనిపించి ఉండేది. 2011-2012 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ లక్ష్యాలను, ముఖ్యంగా ఆహారం, పెట్రోలియమ్ ఉత్పత్తులకు సంబంధించి చేరుకోలేదని మనకు తెలుసు. కానీ, అదే బడ్జెట్ అంచనాలకు ఎవరైనా కట్టుబడి ఉండి, మిగిలిన సబ్సిడీలన్నింటినీ మినహాయించినప్పటికీ కూడా, ఇతరత్రా వెచ్చించగలిగిన మొత్తం 1.44 ట్రిలియన్ల వరకు ఉంటుందని నిపుణుల అంచనా.

అస్తవ్యస్తపు ప్రాధాన్యాల వల్ల ప్రభుత్వ, ఆరోగ్య, విద్యా రంగాలకు సంబంధించిన పథకాల కన్నా ఆహార సబ్సిడీకి, ఉపాధి హామీ పథకాలంటే మీదే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు చూపిస్తుంది. ఆహార సబ్సిడీకి రూ.60,750 కోట్లు కేటాయించింది. ఎస్ఆర్ఈడీఏకి 40,000 కోట్లు కేటాయించింది. ఆరోగ్య కార్యక్రమాలకి 26,750 కోట్ల కేటాయించింది. సర్వశిక్షా అభియాన్ 21,000 కోట్లు కేటాయించింది. పేదలకి ఇచ్చే ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు 60,000 కోట్లు వెచ్చిస్తోంది. బడ్జెట్‌లో భారీ వ్యయంతో కూడిన చట్టం ఏదైనా వుంటే అది ఆహార భద్రతా బిల్లుదే.

ఆహార సబ్సిడీల కోసం ఏటా చేస్తున్న ఖర్చును 90,000 కోట్లకు పెంచనుంది. దీనివల్ల ప్రతినెల రూ.2, రూ.3లకే 30 కిలోల బియ్యం పథకాలను రూపొందిస్తుంది. జనరల్ మార్కెట్‌లో కిలో బియ్యం రూ.36 లకు అమ్ముతున్నారు. సబ్సిడీలో ఇచ్చిన రూ.30 కిలోలు అయిపోయిన తర్వాత రూ.35కి జనరల్ మార్కెట్‌లో కొనాల్సి వస్తుంది. పెరిగిన రేట్లను బట్టి ప్రజలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోలేక పోతున్నారు. దానివల్ల ఎనిమిక్‌గా మారుతున్నారు. మనం ఆరోగ్య కార్యక్రమాలకి ఎంత ఖర్చు పెట్టినా మనుషుల శ్రమకు తగిన ఉపాధిని కల్పించకుండా ఉత్పత్తిని పెంచుకోకుండా శక్తిమంతమైన ఆహారాన్ని తీసుకోగలిగిన స్థాయికి చేర్చకుండా మానవ అభివృద్ధి, భారతదేశ ఆర్థిక ప్రగతి కుంటు పడక తప్పదుకదా!

ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే శ్రామికుడిని గుర్తించాలి. వ్యవసాయ దారుడిని గుర్తించాలి. విద్యావంతుడిని గుర్తించాలి. వారి అభివృద్ధికి , వారి ఉత్పత్తి రంగానికి నిరంతర ఉత్తేజం కలిగించాలి. కేవలం సబ్సిడీల ద్వారా ఉపశమనాల ద్వారా అంకెల గారడీ ద్వారా దేశ సంపద వర్ధిల్లదు. దేశం పురోగతి చెందదు. తప్పకుండా రాజ్యాంగ కర్త డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను ప్రణాళికా సంఘం, బడ్జెట్ రూపకర్తలు సమన్వయించుకోవాలి. నూతన జీవన విధానానికి ప్రత్యామ్నాయ సామాజిక ఆర్థిక జీవన విధానాన్ని రూపొందించగలిగినప్పుడే మానవాభ్యుదయం ప్రతిఫలిస్తుంది. లేకుంటే బడ్జెట్, తాబేదారులకు విస్తరి అవుతుంది తప్ప అభివృద్ధి వుండదు.
- కత్తి పద్మారావు
Andhra Jyothi News Paper Dated : 31/03/2012 

తెలుగు వారి "హోచ్ మాన్"

                                                                                            17.4.12
విప్లవ సూర్యుణ్ణి
ఆకాశం  నుండి 
భూమికి  దించినవాడు
తెలుగు సాహిత్యానికి 
నరుడూ, భాస్కరుడూ,
చెల్లి చంద్రమ్మకు  
నిజమైన అన్న 
ఆకాశాన్ని
నక్షత్రాన్ని ఏరుని
అలని
పోరాటానికి
సంకేతం 
చేసిన వాడు 
పోరాట సత్యమే 
మూర్తిగా కలవాడు
కటకటాల్లో 
కారడవుల్లో 
తెలుగు వారి "హోచ్ మాన్ గా
వెలుగొందిన వాడు 
ఎవరు కాదన్నా
అవునన్నా
తెలుగు వారి విముక్తి భానుడు 
సుర కుటుంబం నుండి 
బైటకు నెట్ట బడ్డ సూర్యుడుల్లా
దగా పడిన వాడు 
అతడే 
శివ సాగరుడు 
తెలుగు వీరుడు 
గర్వించ దాగిన 
విప్లవ వీరుడు 
నరుడు ...
భాస్కరుడు ...
సత్య మూర్తి గారు ఈరోజు మరణించిన సందర్భం గా  1986 లో రాసిన కవిత