దీపం చెప్పిన విషాద కథ

కొండనిండా పచ్చని పచ్చిక
ఆకాశంలో అద్దం చూసుకుంటోంది
కొండల్లో ఉన్న చల్లదనం పొదిగిట్లో
అవి నిద్రపోతున్నాయి.
వెన్నెల మనుష్యుల నొదిలి
ఈ పచ్చిక బయళ్ళ మీద
ఒళ్ళు విరుచుకుంటోంది.

నిజమే!

చీకటి ఇప్పుడు నగరం నడిబొడ్డునే రాజ్యం ఏలుతోంది
దీపపు కాంతి ఇప్పుడో ఎదురుచూపు
వీరంతా ఆ రాజ్యాన్నికి కొమ్ముకాస్తున్నారు.
'ఆ రాజ్యం చెడ్డదీ' అని అంటున్నారు
ఎరుపు, పసుపు తేడా ఇప్పుడేమీ లేదు?
అంతా 'కమ్మ' దనమే చేయి చేయి కలిపే ఉంటారు
జెండాలు మోసేవాళ్ళకే లాఠీ దెబ్బలు
అగ్రాసనాలమీద ఉన్నవాళ్ళంతా క్షేమమే
రాజీ పోరాటాలకు
వెలుతురే కాదు వేలు కూడా వంగదు.
అవును హిపోక్రసీయే రాజ్యమేలుతోంది
రాజ్యం ఒక వడ్డించిన విస్తరి.
ఆ మురికి వాడల్లోని రోడ్లు
ఎన్నిసార్లు కాగితాలపై పరచబడ్డాయో
ఎన్ని గ్రాంట్లుతిని ఆ తోడేళ్ళు బలిసి ఉన్నాయో!
ఎలక్షన్ ఒక కుతంతు బ్రోకర్లకు విందు భోజనం
జైల్లో రోజూ మంతనాలు
వెలుగు మేసినోళ్ళంతా
జైల్లో రాజకీయశాలలు నిర్మించుకుంటున్నారు
మన బొగ్గు, గ్యాస్, ఉక్కు
మానవ వనరులు అమ్ముకున్న వదాన్యులెవరు?
అంబానీల దయాభిక్షమీద
భారతావనిలోని పొయ్యిలో మంట వస్తుందా!
ఈ మురికివాడల్లో శిశువు మరణానికి కారకులైన
వెలుగు దొంగలకు
శిక్షాస్పృతిలో ఏ సెక్షన్ లేదా?
ఒకడి సుఖంకోసం
వేలాదిమంది గుండెల్లో నిప్పు రవ్వలు
ఆ ముదుసలి కళ్ళు కనబడక కటిక చీకట్లో
కుక్కి మంచం ఊపిరాడని పెనుగులాట
ఆ శిశువు చిరుగాలి లేక అంధకారంలో
తల్లి గర్భంలోనే సుఖంగా ఉన్నాననే తలపోత
ఆ వృత్తికారుడు తన యంత్రం తిరక్క
ఊసురోమంటూ వెనుదిరుగుతున్న దృశ్యం
ఎవరు ఈ వెలుగు చోరులు?
అద్దాల హర్మ్యాలు నిర్మించుకొని
పోటా పోటీల పాదయాత్రలు చేస్తున్న కృతఘ్నులు
జాతి సింహాసనాన్ని ఎక్కిస్తే
జాతి వెన్నుమీద పొడిచిన క్రౌర్యులు
సముద్ర ఘర్షణలోను నిప్పు తునకలు వస్తున్నాయి
ఇప్పటివరకు చీకటిని తొలిగించడానికి
ఓ చిరుదివ్వె కావాలి ఇక చీకటిలో జీవించడానికి
ఓ వేదాంతం కావాలి
బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు అన్నీ దేదీప్యమానమే
రాళ్ళకు రప్పలకు వెలుగు దివ్వెలు
మనిషికి మాత్రం వెలుగు ఓ శూన్యం

నిజమే!

చీకటి చిక్కగా ఉన్నప్పుడే యుద్ద భేరి మ్రోగుతుంది
రాజ్యానికి మనిషికి జరుగుతున్న యుద్ధంలో
దీపం చెప్పే కథలో గెలుపు ఎవరిదో?
- కత్తి పద్మారావ్

No comments:

Post a Comment