కొవ్వొత్తుల ప్రదర్శనతో చీకటి పోదు

                                                                                                             29.8.11
అన్నా హజారే ఊరిలో మాంసం తింటే
దళితులను చెట్టుకు కట్టేసి కొడతారు   
హజారే అక్కడొక  మనుస్మృతి రాజ్యాన్ని నిర్మించారు
నీతి పేరుతొ హిందూ పునరుద్ధరణవాదం
మనిషిని విభజించే మనువాదం
గ్రామ రాజ్యం పేరుతో మళ్లీ వస్తుంది జాగ్రత్త!
అవినీతి పుట్టుక బ్రాహ్మణవాదంలోనే ఉంది
రాళ్ళపేరుతో రప్పలపేరుతో యితరుల సొమ్ము
కైంకర్యం చేస్తూనే వున్నారు
కొవ్వొత్తుల ప్రదర్శనతో చీకటి పోదు
ముందు మెదడులలో వెలుగునింపండి
సమసమాజ రూపం రాజ్యాంగంలోనే దర్శనమిస్తుంది
అంబేద్కర్  శిల్పం  ఇక్కడే  ఉంది.

అన్నా హజారే పోరాటం అర్థసత్యమే

                                                                                                   22.8.11
రామలీల మైదానంలో కేకలు 
భారత పార్లమెంటులో
రణగొణ  ధ్వనులు

ఎవరిని దించి
ఎవరిని ఎక్కిస్తారు ?
అందరూ!  ప్రజల సొమ్ముతో
పల్లకీలు ఎక్కిన వారేగా !!
ఊరు బయట వాడ
గట్టిన  ధర్మజ్ఞులేగా...

మనుషులను విడదీసిన
ధర్మ దండం వీరిది
అస్పృశ్యతా నిర్మూలన కోసం
గాంధేయ మేమైయ్యింది?

మనిషిని మనిషి
అంటుకోకపోవడం నేరం కాదా ?
దానిపై కొరడా ఎత్తరే!!

మరో స్వతంత్ర  పోరాటం
చేయవలసింది దళితులే ....
వారి శ్రమకు ఈ దేశం
ఋణపడి వుంది.

 

రాజ్యాంగానిదే విజయం

                                                                                22.8.11
అవినీతి పతాకలెత్తి
నడుస్తున్నాడు జగన్
ప్రతి రాజు మరణం వెనుక
ఒక పెద్ద కుంభకోణమే ఉంది.

విదిలించిన మరమరాలకు
వచ్చిన కీర్తి అపారం.
దోచేసిన ధననిధులఫై
లేదు నిఘా!

రాజుల కొడుకులందరూ మళ్ళీ ప్రభువులైతే
ప్రజాస్వామ్యానికి అర్ధం ఏమిటి ?
ముందు గొయ్యని తవ్వనివ్వండి
బాబులు, బాబాలు, స్వాములు
అందరూ దొరుకుతారు

ఇప్పుడు న్యాయస్థానం
అంబేద్కర్ మార్గంలో నడుస్తుంది
ఇక రాజ్యాంగానిదే విజయం.

విజేత

                                                                                    19.8.2011
మనిషికి ఊపిరి జ్ఞానం
మనిషికి నడక జిజ్ఞాస
మనిషికి వికాసం పరిశోధన
మనిషి సంఘజీవి
మనిషి అభివ్యక్తే కావ్యం
మనిషి ప్రపంచానికి
విస్తరిస్తున్నాడు
ప్రపంచం మనిషికి
దగ్గరవుతుంది
ప్రపంచీకరణ మనిషికి
అధీనమవుతుంది
అంతిమంగా
మనిషే విజేత!

అన్యాయం ఏదైనా నిలవేయడం ఓ చరిత్ర

                                                                                                             17.8.11
ప్రజల్లో వచ్చిన కదలిక
ప్రజ్వలించటం ఓ హక్కు
అన్యాయం ఏదైనా
నిలవేయడం ఓ చరిత్ర

పర్వతాల పై నుండి
కిందకు బొట్టు జారడం లేదు
దోసిలి బట్టినోడు
ఆకాశంవేపు చూడడమే తప్ప
దప్పిక తీరడం లేదు

జేబుల్లో కుక్కుకునేవారు కొందరు
డొక్కల్ని ఎండ బెట్టుకునేవారు కొందరు
దిక్కులన్ని పిక్కటిల్లేలా
అరుస్తున్న అరుపులు

ఆఫీసుల్లో వున్న అధికారులకు
వినిపించని ఉరుములు
జీవన సంక్షోభమంతా
యిచ్చేవాడికి తీసుకునే వాడికి
మధ్యనున్న చేతులే సృష్టిస్తున్నాయి
యిచ్చేవాడే మింగేస్తే
ఇంకా పాలనేముంది?
పాలకులేమున్నారు?

ఉద్యమమేదైనా
కొవ్వొత్తిలానే వెలుగుతుంది
సూర్యగోళం అంత కావడానికి
ఎంతోకాలం పట్టదు.

స్వాతంత్ర్యం జిందాబాద్ !!

                                                                                                      15.8.11
అరవై ఐదు ఏళ్ళ స్వాతంత్ర్యం
నలభై ఐదు శాతం మందికి
చదువు లేదు !

అప్పు ఒక మంత్రం,
అవినీతి ఒక తంత్రం
పార్లమెంటు ఒక యంత్రం

దిల్లు లేని బిల్లులు
పాసవడం ఒక ఫార్మాలిటీ

మూడువేల ముప్పైమూడు కోట్లు
గిరిజనుల కోసం
తవ్వుకు వెళ్ళే నిధులు మాత్రం
లక్షల కోట్లు

కంటికి దృశ్యం కనబడుతుంది
చెవికి శబ్దం వినబడుతుంది
2జి లు , 3జి లు ఓకే

రొట్టె మాటేమిటి ?
రాజ్యంలో భాగస్వామ్యం మాటేమిటి ?

స్వాతంత్ర్యం నాడైనా
అంబేద్కర్ చూపుడు వేలు సాక్షిగా
 ప్రశ్నించనివ్వండి

స్వాతంత్ర్యం జిందాబాద్ !!

మనిషి మనుగడకు మాతృ భావనే ఊపిరి

                                                                                                14.8.11
అవును!
వారు ఆడశిశువుని
ఆహ్వానించలేకపోతున్నారు.


సృష్టిని నిరాకరించి
ఎడారిలో పయనిస్తున్నారు.

స్త్రీలు ప్రాకృతిక శక్తులు
ప్రపంచ మూలాలు
వారి జీవనంలో ఉన్నాయి.

లింగ భేదం
సమతుల్యానికి గొడ్డలిపెట్టు
ప్రకృతి సృజనాన్ని కోల్పోతే
తుఫానులు తప్పవు.

మాతృత్వం ఒక కళ కాదు !
వాస్తవం !

ప్రతి మనిషి మనుగడకు
మాతృ భావనే ఊపిరి .
"आरक्षण" एक समाजक विद्रोह
बिना रोटिका पाध्ये और 
हजारो दीपोमका नेचे पाध्ये
दोनोमे तलेंट किस्काहे ?
फ़िवे स्टार होतेल्मे रहने वलोमको 
क्या पता ?
 बिना  रोटी कपड़ा और माकन से 
 स्टार कैसे बने . . . 
इस  मिल्लें निउम्की 
 सब से बड़ा तालेंतेड
 बुध 
महात्मा फुले
आंबेडकर 
टीनू  ब्रह्मिन नहिहेना ?
 भारत  देश में रहेने वलोमको
राज्यम्गा ध्रुस्ती आवश्याहे 
  सामाजिक ध्रुस्ती से जो नहीं देह्क्सकता 
 ओ अन्धो जैसे हे . . .

రాజ్యాంగపు చూపు అవసరం

                                                                                                   12.8.11
'ఆకర్షణ్' ఒక
సామాజిక విద్రోహం

రొట్టెలేని వాడి చదువా
వేయి దీపాలలో చదువా
ఏది ప్రతిభావంతం?

ఫైవ్ స్టార్లో జీవించేవాడికి
మురికి వాడ నుండి
నక్షత్రంలా వెలగడం
ఏమి తెలుసు?

వెయ్యేళ్ళలో
ప్రతిభావంతులుగా వెలిగిన
ఓ బుద్ధుడు
ఓ మహాత్మాఫూలే
ఓ అంబేద్కర్
బ్రాహ్మణులు కారు కదా!

భారత దేశంలో బ్రతికేవాడికి
రాజ్యాంగపు చూపు అవసరం
సామాజిక దృష్టి లేనివారు అంధులే. 

వారి స్వేదం నుండే!

                                                                                                           ౬.౮.11
ఆకాశం ఉరుముతూ ఉంది
ఒక్క చుక్క పడటం లేదు !
అక్కడ జడివానే పడుతుంది !
ఆ  దాన్యాగారాల మీద కప్పు లేదు
చెట్టు ఊపితే పూలే కురుస్తాయి
కాయలు పండ్లు కావడం లేదు

అవును!
అంతా పూల దారే
ఏదో సంగీతం వినిపిస్తుంది
ఇన్ని కోట్ల మంది
ఊపిరి పీలుస్తున్నారంటే
ఆ ఊగుతున్న చెట్టుకు
ద్వేషం లేదు మరి!
శ్రామికులూ అంతే
అన్ని ఉత్పత్తులను
సృష్టిస్తునారు
వారి స్వేదం నుండే
సమాజానికి ఉనికి

ప్రజల చైతన్యమే అన్నింటికీ పరిష్కారం

అధిక ధరలు పార్లమెంట్ ను కుదిపాయి.
మంచి ఆంగ్ల భాషలో సమాధానాలు కురిసాయి .
బోర్డర్ అంతా టెర్రరిజంతో నిండింది,
మరి రక్షణ కోసం ఖర్చుపెట్టే లక్షల కోట్ల సంగతేంటి ?
తప్పుకోవడమే రాజకీయ క్రీడా !
మంత్రివర్యులు ప్రతివాదంలో ప్రావీణ్యులు
సమస్యలకు పరిష్కారాలు వారిదగ్గర లేవు
ప్రజల చైతన్యమే అన్నింటికీ పరిష్కారం !

వీక్షకులా... ఆలోచనాపరులా...

                                                                                                 ౧.౮.11
నిర్భాగ్యులూ, అనాధలూ,
నిరాశ్రయులు పెరుగుతున్నారు.
కోట్లకు పడగలెత్తిన వారి
బంగళాలూ పెరుగుతున్నాయి.

ఈ వైరుధ్యాల మధ్య
ప్రభుత్వం ఒక నాటక శాల.

అవును!
ఆలోచించని వారే ఘనులు
ఆలోచిస్తే అంతరాలు సాక్షాత్కారం
విద్యావంతులు దేశాన్ని
కంటతా పెడుతున్నారా!
వీక్షకులుగా మిగులుతున్నారా!

ఏ మనిషైనా
పురోగామిస్తే అంబేద్కర్.
తిరోగామిస్తే గాంధీ.