Katti Padmarao is the founder of Dalita Mahasabha that spearheaded the Dalit movement in Andhra Pradesh in the aftermath of killings of Dalits in Karamchedu in coastal Andhra. He has a wide range of writings to his credit. He is the visionary from Coastal Andhra region who welcomed the bifurcation of Andhra Pradesh state.
Modi Cabinet and Social Equation - Dr Katti Padmarao
Published at: 07-06-2014 00:41 AM
అనేక సందర్భాల్లో దళిత బహుజన, మైనార్టీలు తమకు వ్యతిరిక్తమైన రాజ్య వ్యవస్థలో తమ భావజాలాన్ని నిలుపుకోగలిగారనేది చారిత్రక వాస్తవం. బీజేపీ వర్గాలు దళితులకు కాంగ్రెస్ కల్పించిన నామమాత్రపు సంస్కరణలు అంటే 'ఉపాధి హామీ' వంటి వాటి మీద వేటు వేయాలని చూస్తున్నారు. నిజానికి దళితులకు భూమే పంచాలి. కానీ ఉపాధి హామీని కూడా ఇవ్వకపోతే ఇంక పేద ప్రజలను రక్షిస్తాననే మోదీ హామీలో అర్థమేముంది?
భారతదేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధంలోని ధర్మ సూత్రాలను మేళవించి కూర్చారు. స్వేచ్ఛ సమానత్వాలతో పాటు విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో అందరికీ సమభాగం లభించడానికి వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని శిల్పించారు. అన్ని మతాల, అన్ని కులాల అస్తిత్వాలు తమ స్వేచ్ఛకు భంగం కాకుండానే ఒక సంఘంగా, ఒక దేశంగా సమతుల్యతను అనుభవించే జీవన ప్రభాతాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇప్పటి పాలకవర్గం కూడా జనాభా నిష్పత్తిని బట్టి రూపొందవలసిన చారిత్రక బాధ్యతను వహించాల్సి ఉంది. అయితే ఈనాడు భారతదేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. చాలా కొత్త ముఖాలు పార్లమెంటులోకి అడుగుపెట్టాయి. ఇందులో కొత్తదనం ఉన్నా, నరేంద్ర మోదీ కేబినెట్లో ఎక్కువ మంది బ్రాహ్మణులకే చోటు దక్కింది. సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, కల్రాజ్ మిశ్రా, మేనకా గాంధీ, అనంత్ కుమార్, ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్, మనోజ్ సిన్హా మొదలైన వారు ఉన్నారు. నిజానికి భారతదేశ వ్యాప్తంగా బ్రాహ్మణుల జనాభా నిష్పత్తి ఒక్క శాతమే ఉంటుంది. మరి బ్రాహ్మణులకు ఇంత మందికి ఎందుకు నరేంద్ర కేబినెట్లోను, మంత్రి మండలిలోను స్థానమిచ్చారు.
ఎక్కువ మంది బ్రాహ్మణులు, ఆర్ఎస్ఎస్లోనూ, ఏబీవీపీలోనూ క్రియాశీలక పాత్రలో ఉన్నారు. ఇవాళ ఈ దేశంలో బ్రాహ్మణులు అత్యున్నత వర్ణంగా భావించి మిగిలిన వారు తమ ఆధీనంలో ఉండాలని కోరుకుంటారు. ఈ రోజు దళితులు 17 శాతం భారతదేశ వ్యాప్తంగా ఉంటే రాంవిలాస్ పాశ్వాన్, తవర్చంద్ గెహలోర్, నిహల్ చంద్ ముగ్గురికే మోదీ అవకాశం ఇచ్చారు. అంటే మోదీ మంత్రివర్గంలో 3.7 శాతం మాత్రమే దళితులున్నారు. ఓబీసీగా ప్రధానమంత్రి అయిన మోదీ బీసీలకు కూడా మంత్రివర్గంలో తగినంత మందికి ఇవ్వలేదు. గోపీనాధ్ ముండే (కారు ప్రమాదంలో మృతి చెందారు), ఉమాభారతి, శ్రీపద్నాయక్, జితేంద్ర సింగ్, రావు ఇంద్రజిత్, ఉపేంద్ర కౌశ్వాక, రాధాకృష్ణన్.పి, కృష్ణపాల్, దాదారావు సాహెబ్, ధన్వేలకు మాత్రమే చోటు లభించింది. వీళ్ళలో కేబినెట్ మినిస్టర్లు అయిదుగురే.
ట్రైబల్స్కు అయితే మంత్రి మండలిలో 6.13శాతం దక్కింది. జోవెల్ ఓరమ్, కిరణ్ రిజాజ్, విసున్ దేవ్శాయి, సుదర్శన్ భగత్, సర్బానంద సోన్వాల్లకు చోటు దొరికింది. ఇక భూస్వామ్య కులాలైతే రాజ్పుట్స్, కమ్మ, క్షత్రియ, వక్కళిగలు బలంగానే ఉన్నారు. రాజనాధ్ సింగ్ (రాజ్ పుట్), వెంకయ్య నాయుడు (కమ్మ), అశోక్ గజపతిరాజు (క్షత్రియ), రవిశంకర ప్రసాద్ (క్షత్రియ), నరేంద్ర సింగ్ తోమర్ (రాజ్ పుట్), రాధా మోహన్ సింగ్ (రాజ్ పుట్), జనరల్ వి.కె. సింగ్ (రాజ్ పుట్) వీరంతా కేబినెట్ మినిస్టర్లుగా ఇండిపెండెంట్ ఛార్జ్ మంత్రులుగా రూపొందారు. ఇక స్త్రీల విషయానికి వస్తే సుష్మా స్వరాజ్ (బ్రాహ్మిణ్), మేనకా గాంధీ, స్మృతి ఇరానీ (జూరాస్టియన్), ఉమా భారతి (హిందూ ఓబీసీ), నజ్మా హెప్తుల్లా (ముస్లిం). స్త్రీలకు రావాల్సిన శాతం రాలేదు. దక్షిణ భారతదేశానికి చాలా తక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల, భారతదేశ భౌగోళిక సామాజిక సమతుల్యత తప్పింది. బ్రాహ్మణ అగ్ర కులాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మోదీ తన వెనుకబడిన వర్గాల ముద్రను వేయలేకపోయారు.
నరేంద్రమోదీ ఏబీవీపీ వారి నుంచి ఎక్కువ మందిని తీసుకోవడానికి కారణం భారతదేశంలో మహాత్మా ఫూలే, అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ల ఆలోచనలు పెరుగుతున్నాయి. దీనికి ప్రతిగా హిందూ విప్లవాన్ని తేవడానికే హిందూ భావజాల పునాదులకు సంబంధించిన టీమ్లను తయారు చేసుకున్నారు. ఈ టీములో రాజ్నాధ్ సింగ్, అరుణ్ జైట్లీ, పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజీజ్, ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళంతా హిందూ పునరుద్ధరణకు కట్టుబడిన మంత్రి వర్గ సహచరులు. వీరి ద్వారా హిందూ భావజాల ఎజెండాను భారతదేశంలో తీసుకురావడం కోసం మోదీ ఈ కేబినెట్ రూపొందించుకున్నారు. ఈ కూటమి మహాత్మా ఫూలే, అంబేద్కర్, పెరియార్ భావజాలాలకు వ్యతిరిక్తంగా ఉన్నారు. వారి భావజాలాన్ని తగ్గించి హిందూ భావజాలం పాఠ్యాంశాల్లోనూ పెంచాలనేది వీరి ఉద్దేశం. అస్పృశ్యులు హిందూ మతంలో ఉంటూనే తమకు సమాజం అప్పజెప్పిన బాధ్యతలు నెరవేర్చాలనేది హిందూ ఆర్ఎస్ఎస్ వాదుల వాదన. దీనికి అంబేద్కర్ ఇలా సమాధానమిచ్చారు.
'అస్పృశ్యుల సమస్యలపై కడవరకూ పోరాడతాం అని హిందూ సంఘ సంస్కర్తలు అంటే వారి ఉద్దేశం, చివరి అస్పృశ్యుడు మరణించే వరకూ పోరాటం కొనసాగించాలని వారు ప్రతిపాదిస్తున్నారన్న మాట. వారి ప్రకటన నుంచి నాకు అర్థమయ్యేది అదే. ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే వారు యుద్ధం గెలవలేరనే విషయాన్ని తెలుసుకోవడం కష్టం కాకూడదు. స్వేచ్ఛ కోసం మన పోరాటంలో మరణించాల్సి వస్తే, తప్పుడు చోట పోరాటం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? హిందూ సమాజాన్ని సంస్కరించడం మన లక్ష్యమూ కాదు, మన కార్యక్షేత్రమూ కాదు. మన లక్ష్యం మనకు స్వాతంత్య్రాన్ని సంపాదించడమే. మనకు వేరే వాటితో సంబంధం లేదు. మతం మార్చుకోవడం ద్వారా మనం స్వాతంత్య్రాన్ని సాధించగలిగినప్పుడు హిందూ సమాజాన్ని సంస్కరించే బాధ్యతను మనమెందుకు భుజానికెత్తుకోవాలి? అందుకోసం మన బలాన్ని, సంపదను, జీవశక్తిని ఎందుకు త్యాగం చేయాలి? మన ఉద్యమ ప్రధాన లక్ష్యం హిందూ సంస్కరణ అని ఎవరూ అపార్థం చేసుకోకూడదు.
మన ఉద్యమ ప్రధాన లక్ష్యం అస్పృశ్యులకు సామాజిక స్వేచ్ఛను సాధి ంచడం' అన్నారు. దళితులకు సామాజిక స్వేచ్ఛను నియంత్రించడ ంలో హిందూ రాజ్యం మొదట వీరుతినే ఆహారంపై ఆంక్ష పెట్టాలని చూస్తుంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో బుద్ధుడు ఆనందుడిని ఉద్దేశించి ఇలా అన్నారు. 'ఆనందా! సూర్యుడిలా స్వయంప్రకాశితులు కండి. భూమిలాగా కాంతి కోసం ఆధారపడకండి. మీపై మీరు విశ్వాసముంచుకొని, ఎవరిపైనా ఆధారపడకండి. నిజాయితీగా ఉండండి. ఎప్పుడూ సత్యాన్ని ఆశ్రయించండి. ఎవరికీ లోబడకండి' అన్నారు.
ఇది హిందూ బ్రాహ్మణ వాదానికి ప్రత్యామ్నాయంగా బుద్ధుడు చెప్పిన ఆనాటి మాటలు. హిందూ బ్రాహ్మణ వాదులు చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా, బుద్ధుడు దానికి భిన్నంగా సంఘమంతా ఒక్కటేనన్నారు. వ్యక్తిగత ఆస్తిని నిరసించాడు. స్త్రీ పురుష భేదం లేదన్నాడు. కానీ హిందూ మతం పితృస్వామ్యాధిపత్యం అంటే పురుషుడే కేంద్రంగా నడుస్తున్న రాజ్యం. అందుకే బుద్ధుడికి ప్రత్యామ్నాయంగా రాముడిని, కృష్ణుడుని ప్రచారంలోకి తీసుకువచ్చారు. రాముడు జనవాక్యాన్ని బట్టి సీతను అడవులకు పంపాడు. భార్య అనేది భర్తకు లోబడి ఉండాలి. ఆమెకు వ్యక్తిగత ఆస్తి ఉండకూడదు. పూజలతో, వ్రతాలతో శరీరాన్ని సుష్కింపచేసుకోవాలి అనే వాదాన్ని తీసుకువచ్చాయి. దీనికి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు తీసుకువచ్చి స్త్రీకి స్వేచ్ఛ, సమానత్వాలు ప్రతిపాదించారు. కుల నిర్మూలన ద్వారానే జాతి ఏకమవుతుందని ఆ స్ఫూర్తి హిందువులకి లేదని ఆ స్ఫూర్తి తీసుకురావడమే భారత రాజ్యాంగ ధర్మమని చెబుతూ ఎవరి కులంలో వారు జీవించడం నిజమైన లౌకిక జీవన విధానం కాదని అంబేద్కర్ చెప్పారు. ఆయన హిందూ సామాజిక వ్యవస్థ గురించి ఇలా వివరించారు.
'ప్రతి కులమూ వాళ్ళలో వాళ్ళే కలిసి తింటూ, వివాహాలు చేసుకొంటూ ఉంటారు. అంతేగాక ప్రతి కులానికి ప్రత్యేకమైన వేషధారణ ఉంటుంది. ఇండియాలో స్త్రీ పురుషుల వస్త్రధారణను చూసి టూరిస్టులు వినోద పడుతున్నారంటే వివిధ రకాల రీతుల వేషధారణే కదా కారణం? నిజానికి ఒక ఆదర్శం హిం దువును ఇతరవాటితో ఏ సంబంధమూ పెట్టుకోకుండా తన కన్నంలో తాను బ్రతికే ఒక ఎలుకతో పోల్చవచ్చు. సమాజ శాస్త్రవేత్తలు చెప్పే 'జాతి చైతన్యం' అనేది హిందువులలో ఏ మాత్రమూ లేదు. హిందువులకు తామంతా ఒక జాతి అన్న చైతన్యమే లేదు. హిందువులలో ఉన్న చైతన్యం ఒక్కటే. అది కుల చైతన్యం. హిందువులు ఒక సమాజం అనిగానీ, ఒక 'నేషన్' అని గానీ చెప్పలేక పోవడానికి ఇదే కారణం' అని అన్నారు. మనం మొత్తంగా పరిశీలిస్తే మనుస్మృతి భావజాలానికి ప్రత్యామ్నాయంగా భారత రాజ్యాంగం భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామ్యవాదాలను సమన్వయించింది.
వీటికి తూట్లు పొడవాలనే ఆర్ఎస్ఎస్ ఎజెండా దళిత బహుజన మైనార్టీల విద్యావంతమైన సమాజంలో సాధ్యం కాదు. భారతదేశంలో రాముడి కంటే కృష్ణుడి కంటే బుద్ధుడు, మహాత్మా ఫూలే, అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ ఆలోచనలే ప్రజల్లో విస్తరించి ఉన్నాయి. విద్యార్థులు, మేధావులు ఆలోచనా పద్ధతులు దళిత బహుజన మైనార్టీలలో విస్తృతంగా పెరిగారు. ప్రజలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏదో ఒక ప్రభుత్వాన్ని తీసుకువద్దామనే కాంక్షతో బీజేపీని గెలిపించారు. అంతమాత్రాన భావజాల రంగంలో ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకోవడం అవివేకమే అవుతుంది. ప్రధానమంత్రికైనా, మంత్రిమండలికైనా పరిపాలనకు రాజ్యాంగమే గీటురాయి. దానిని అధిగమించడం ఎవరి వల్ల కాదు. హిందూ ప్రత్యామ్నాయ జీవన విధానంలో స్వేచ్ఛను అనుభవిస్తున్న వారంతా తమ మానవ హక్కుల పోరాటాలు ముమ్మరం చేయక తప్పదు. అంబేద్కర్ యుగాన్ని కొనసాగించడం అనివార్యం. ఇది చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న సందర్భం. అనేక సందర్భాల్లో దళిత బహుజన, మైనార్టీలు తమకు వ్యతిరిక్తమైన రాజ్య వ్యవస్థలో కూడా తమ భావజాలాన్ని నిలుపుకోగలిగారనేది చారిత్రక వాస్తవం.
ఈనాడు బీజేపీ వర్గాలు దళితులకు కాంగ్రెస్ కల్పించిన నామమాత్రపు సంస్కరణలు అంటే 'ఉపాధి హామీ' వంటి వాటి మీద కూడా వేటు వేయాలని చూస్తున్నారు. నిజానికి దళితులకు భూమే పంచాలి. కానీ ఉపాధి హామీని కూడా ఇవ్వకపోతే ఇంక పేద ప్రజలను రక్షిస్తాననే మోదీ హామీలో అర్థమేముంది? మోదీ ప్రభుత్వ నిర్మాణంలోనే బ్రాహ్మణవాదం ఉంది. తప్పక ఆయన మంత్రి మండలి విస్తరణలో జనాభా నిష్పత్తిని బట్టి, ఎస్టీలకు, బీసీలకు మంత్రి మండలిలో ప్రాధాన్యం కల్పించాల్సిన అగత్యం ఉంది. సొంత పార్టీలోనే తమతమ సామాజిక అస్తిత్వాల నుంచి పోరాటాలు ప్రారంభమవుతాయి. అణచివేత ఉన్నప్పుడే అనేక సందర్భాలో ప్రజలు చైతన్యవంతంగా ఉంటారు. ఇది భారత రాజ్యాంగం దళిత బహుజన మైనార్టీలకు ఇచ్చిన ఆత్మగౌరవ స్ఫూర్తి.
-డా. కత్తి పద్మారావు
సామాజిక తత్వవేత్త
సామాజిక తత్వవేత్త
Subscribe to:
Posts (Atom)