సమాజం మారుతున్న మాట నిజం
కొవ్వొత్తులు వెలుగుతున్న కొద్ది
చీకటి మటుమాయమవు తూనే వుంది
అనుబంధాలు మరోప్రక్క చిక్కుబడుతున్నాయి
రాత్రిని జయిస్తున్న ఉత్తేజెం ఒక ప్రక్క
పగటిని కోల్పోతున్న నిస్తేజెం మరో ప్రక్క
అవును
అందరూ సంతోషంగా వుండాలని ప్రయత్నిస్తున్నారు
అంటే దుః ఖం లేదని కాదు
దుః ఖాన్ని అనుభవించడానికి భయం
మనిషంటే
సుఖ దుఃఖా ల కలయిక కదా
ప్రధానమంత్రి ఆకాశ హర్మ్యములో
నిలబడి జి .డి .పి. గురించి మాట్లాడు తున్నాడు
పిల్లోడి నోటికాడ బడిని లాగేసి
కూటికోసం వలస వెళ్తున్న
బాబు అమ్మల గోడు చూడండి
పచ్చని పంట పొలాలు ,
ధాన్యాగారాలు,
గాయ పడిన కోకిల లే కాదు,
దహించ బడిన కాకుల గుంపులూ వున్నయి
ఎందుకు వీరు ప్రేమికుల మధ్యలో
కులం చిచ్చు రాగిలుస్తున్నారు?
పెరియార్ రామస్వామి రగిలించిన
కులవ్యతిరేక పోరాటానికి
ధర్మపురి గృహ దహనాలు సంకేతమా !
ఏమి ధ్వంసం అవుతున్నాయి?
ఏమి పునరుజ్జీవనమౌతున్నాయి
మానవ విలువలు మృగ్యమవుతున్నాయి
మానవుని లోని కరుణ, ప్రేమ,
రాను రాను నశిస్తున్నాయి
మానవులు స్వార్ధ పూరితం గానే కాక
అభద్రులై మూఢ విశ్వాసాలను ఆహ్వానిస్తున్నారు
మెదడులో పేరుకుపోతున్న
బూజును తొలగించలేక
తమను తాము నమ్మ లేక
స్వాములకు బాబాలకు అధీనులౌతున్నారు
ఎన్ని పార్కులూ, బృందావనాలు నిర్మించుకున్నా
కులం ముళ్ళ పొదలు మెదడుల్లో మొలవడం వల్ల
విశాల ప్రపంచాన్ని చూస్తున్న
ఓ సంకుచిత మానవ స్వరూపం.
ప్రపంచం దగ్గరౌతున్న మాట నిజం
మనుషులు ఒకరికొకరు
దూరమౌతున్న మాట నిజం
ఎత్తైన కట్టడాలు
మనసు ఇరుకైన గోడల్లో
వ్యక్తినిష్టం అవుతుంది
అవును
పాత కట్టడాలు కోటలు
దేనికి గుర్తుగా మిగిలాయి
నిర్బంధం అవుతున్న ప్రతి అంశం
స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తుంది
అమ్మాయిలు అర్ధ రాత్రిలో చిందు లేస్తే
తాగి, సిగార్లు కాలిస్తే
ఆనందం వస్తుందా ?
ఆనందం నిజంగా ఎక్కడుంది?
వ్యక్తీకరణ లోని తీవ్రత లో వుందా !
ఆత్మీయ అనుబంధాల్లో వుందా ?
వీరు ఎవరిని ప్రేమిస్తున్నారు ?
ఏమి కోరు కుంటున్నారు ?
నిందిస్తున్న అంశాలనే
వీరు ఆహ్వానిస్తున్నారు
మనిషిని శరీర పరంగా చూసి
వ్యామోహ పడే
ఈ మృగ రాయుళ్ళు
పగుల గొడుతున్న బూరలుఎన్ని?
వివేచనను చంపడమే వినోదమా
విద్యంటే తెగ బలిసిన వికృతమా?
ధనం గడించడమంటే
వాటిని నిప్పు కణికలుగా మార్చుకొని
నెత్తిన పోస్కోవడమా?
గుర్తులన్ని గాయాలమయమైతే
చరిత్రకు మిగిలేది నెత్తుటి గాధే
మనిషి నిద్రించ డానికోక యుద్ధం
మనిషి మేల్కోవడానికొక యుద్ధం
సహజమైన ప్రకృతులన్ని ఘర్షణలోనే వున్నాయి
ముందు కొత్త రోజు ను రానివ్వండి
దాన్ని జీవితానికి అన్వయించుకొని
ముందుకు సాగుదాం...
Dr. Kathi Padma Rao