లక్షింపేటలో 'కారంచేడు' -డాక్టర్ కత్తి పద్మారావు

రాష్ట్రంలో దళితుల మీద అగ్రకులాల దమనకాండ నిరంతరం సాగుతూనే ఉంది. రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తుంటే ఆ కులాల వాళ్ళు దళితులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఎన్‌టి రామారావు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వియ్యంకుడి ఊరు కారంచేడులో ఆరుగురు దళితుల్ని ఊచకోత కోశారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లా చుండూరులో ఎనిమిది మంది దళితుల్ని తలలు నరికి తుంగభద్రలో తొక్కారు. ఇప్పుడు బీసీగా చెప్పుకుంటున్న బొత్స పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బొత్స వాసుదేవరావునాయుడు తూర్పు కాపుల గుంపు కత్తులతో గండ్రగొడ్డళ్లతో శ్రీకాకుళం జిల్లా లక్షిం పేటలో దళితుల్ని చిత్ర వధ చేసి చంపడం జరిగింది. 

అసలేం జరిగింది? శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్షింపేటలో భూస్వామ్య తూర్పుకాపులు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో దళితపల్లెని చుట్టుముట్టారు. బరిసెలు, గండ్రగొడ్డళ్లు, బాంబులు, కత్తులతో ఒక్కొక్కింటికి 20 మంది చొప్పున చుట్టు ముట్టారు. ఇంట్లో ఉన్నవారిని బయటికి లాగారు. అమానుషంగా, దారుణంగా బూతులు తిట్టారు. కుల అహంకారంతో 'మీరు కూడా పొలాలు చేసే అంతటి వాళ్ళు అయ్యార్రా మాల నా కొడుకుల్లారా!' అని దూషించా రు. 'మా పక్కన పొలాలు దున్నేంతటి వాళ్ళా!' అని నివర్తి వెంకటి (60), ఆయన కుమారుడు నివర్తి సంగమేష్ (35)ను, బూరాడ సుం దరరావు (35), చిత్తిరి అప్పడు (25) -ఈ నలుగురి పైన అమానుషంగా దాడి చేశారు. 

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురుప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి.బెంజిమన్, నూతలపాటి చంద్రశేఖర్, బోకర నారాయణరావు స్వయంగా చూసిందాని ప్రకారం ఒక్కొక్కరి దేహంపై 40, 50 కత్తి, బల్లెం పోట్లు ఉన్నాయి. ఈ దాడి కక్షతో జరిగింది. దీని వెనుక పథకమూ, వ్యూహమూ, ద్వేషమూ ఉన్నాయి. ఈ పోట్లు పడిన వెంటనే వెంటనే అక్కడికక్కడే మరణించారు. వీరు భూమి పోరులో అమరులయ్యారు. కుల ద్వేషానికి ఆహుతయ్యారు. ఈ నలుగురిపై దాడి సంఘటనలో తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తి బొద్దూరి పాపయ్య (60) బుధవారం విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆస్పత్రిలో మరణించారు. అంటే లక్షింపేట ఊచకోతలో మొత్తం ఐదుగురు బలయ్యారు. 

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆయా ప్రాంతాల్లో ఉన్న భూమి కలిగిన కులాల వాళ్ళు కమ్మ అయినా, రెడ్డి అయినా, కాపు అయినా, కాళింగులు అయినా, వెలమ అయినా, క్షత్రియులు అయినా దళితులు భూమి దున్నుతుంటే కళ్లలో కారం చల్లుకోవడం, సహించలేకపోవడం, దళితులకు భూమి మీద హక్కులేదు అని కక్ష కట్టడం, వారి మీద దాడులు చేయడం, పల్లెల నుంచి వెళ్లగొట్టడం జరుగుతోంది. ఈ కుల ద్వేషానికి రాజ్యాధికారానికి అవినాభావ సంబంధం ఉంది. పెద్దల అండ వల్లే ఈ దారుణం జరిగింది. ఆంధ్రులు ఎంతో సిగ్గు పడాల్సిన ఈ దారుణ, అమానుష సంఘటనలో హతులతో పాటు మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.


ప్రస్తుతం వీరు శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలమట గణపతి (35), కలమట ప్రకాశ్ (50), కలమటి సింహాచలం, కలమటి గంగులు, గోనెల రవి (25), నివర్తి గంగయ్య (50), కలమట గడ్డియ్య (లచ్చయ్య కుమారుడు), కలమటి గడ్డయ్య (చిన ముత్యాలు కుమారుడు), నివర్తి సింహాచలం, నివర్తి నర్సయ్య, నివర్తి రామారావు, బొద్దూరి బోగేషు, గొంగాడ శివుడు, నివర్తి దారప్పడు, నివర్తి గంగయ్య, కలమటి సంగమ్మ, చిత్తిరి ఎల్ల య్య, కలమటి గంగులు, బొద్దూరి గౌరయ్య ఆస్పత్రి లో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. 

లక్షింపేట ఘటన కారంచేడు, చుండూరు తరువాత అతిపెద్ద అగ్రకులాల దమన కాండ. ఈ కుల ముష్కరులు రెండున్నర గంటలు మారణాయుధాలతో దళితులను చుట్టు ముట్టి వెంటాడి, వేటాడి మృత దేహాలపై కూడా వికటాట్టహాసాలతో కత్తులతో పాశవికంగా దాడిచేశారు. ఇక్కడ తూర్పుకాపు భూస్వాములు పేరుకి బీసీలైనా కుల అహంకారం ఉన్న వారు. శ్రీకాకుళం జిల్లాలో కాళింగులు, కొప్పుల వెలమలు, తూర్పు కాపులు, కోస్తాంధ్రలో కమ్మ, రెడ్డి, క్షత్రియులు నిర్వహించే పాత్రని నిర్వహిస్తున్నారు. 


భూస్వామ్య కాపులు చేసిన ఈ దాడిలో పక్క గ్రామా ల్లో ఉన్న తూర్పుకాపులు కూడా కులం, బంధుత్వంతో పాల్గొన్నారు. ఈ దారుణమైన దాడి వలన 26 సంవత్సరాల చిత్రి శ్రీదేవి, బోరాడ కాసాలు, నివర్తి రాముడమ్మ, నివర్తి వెంకటమ్మ భర్తల్ని కోల్పోయిన అనాథలుగా మిగిలిపోయారు. వీరందరు 30-40 ఏళ్ళ మధ్య వయస్సు వాళ్ళు. వీళ్ళందరూ మాతృమూర్తులే. ఉదయం ఐదు గంటలకు భర్తలు కలిగివున్నవారు 7.30 గంటలకు భర్తల్ని కోల్పోయారు. వాళ్ళు చేసిన తప్పేంటి? 

80 దళిత కుటుంబాలు 60 ఎకరాల గవర్నమెంటు భూమిని దున్నుకోవటమా? అది 2002లో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ స్వయంగా భూమిని కేటాయించి మీరు దున్నుకోండి అంటే ఒక్కొక్కరూ 45 సెంట్లు పంచుకుని దున్నుకుంటున్నారు. ఈ దేశంలో దళితులు భూమి దున్నుకోవడం తప్పా? దానికి కళ్ళలో నిప్పులు పోసుకోవాలా? ఈ ఘటన మీద సిబిఐ విచారణ చేయించకుండా మాఫీ చేయడం కోసం శవాల్ని పూడ్చి పెట్టక ముందే వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కేవలం మొక్కుబడిగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించి రావడం ఆయన అగ్రకుల భూస్వామ్య తత్వానికి నిదర్శనం. ప్రతి చిన్నదానికి సిబిఐ ఎంక్వైరీ వేసే ఈ పెద్ద మనుషులు ఇంత మారణ హోమం జరిగితే ఎందుకు వేయటం లేదు? పెద్దలు ఇరుక్కుంటారనే కాదా? 

లక్షింపేట బాధితులు చిత్రి గంగయ్య, గొంగోడ గంగయ్య, నివర్తి సింహాచలం, నివర్తి తిరపతిరాజు, బోడిసింగు రాము చెప్పిన వివరాలివి: తాము సాగుచేసుకొంటున్న భూమి పది సంవత్సరాల క్రితం మద్దుకూరు రిజర్వాయరు కోసం వివిధ కులాల వారి నుంచి సేకరించినది. వారందరికీ ప్రభుత్వం అప్పుడే ఎక్స్‌గ్రేషియా ఇచ్చివేసింది. ఇప్పుడు ఇది అసైన్డ్ ల్యాండ్. ప్రభుత్వానికి ఎవరికైనా ఇచ్చే అధికారం ఉంది. ఈ 250 ఎకరాల భూమిని దళితులకు ఇస్తున్నట్టు ఇంత రక్తం నేలలో ఇంకిన తరువాత కూడా ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటించలేదు? ఇక్కడ ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకిగా వ్యవహరించారు. ఇది ముఖ్యంగా దళిత మంత్రి కొండ్రు మురళి నియోజక వర్గం. 


దళిత మంత్రులు సిబిఐ విచారణని కోరక పోవడం, 250 ఎకరాల భూమిని కోరకపోవడం అధికార వర్గానికి భజనపరులుగా ఉండి, దళితులపై కత్తులతో దాడులు జరిగినా పదవీ వ్యామోహంతో వ్యవహరించడం సిగ్గుచేటైన విషయం. వీళ్ళు ఏ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల ద్వారా మంత్రులయ్యారో ఆ విషయాన్ని విస్మరించారు. ఈనాడు దళిత ప్రజా సంఘాలు, లెఫ్ట్ పార్టీల అనుబంధ దళిత ప్రజాసంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయి. ఈ డిమాండ్లు నెరవేరే వరకు అన్ని ప్రజాశక్తులు మూకుమ్మడిగా అగ్రకుల రాజ్యాధికారం మెడలు వంచి దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని విజయవంతం చేయాల్సిన చారిత్రక సందర్భం ఇది. 

దళిత ఉద్యమాల ఐక్యతే ఈనాటి పోరాటరూపం. నేలలో ఇంకిన దళితుల నెత్తురు వృధా పోదు. ఈ నెత్తుటి ప్రశ్నకు చరిత్ర సమాధానం చెప్పాల్సిందే. అమరవీరులైన వారి ఆత్మగౌరవ భేరి మోగుతుంది. దళిత శిబిరం లక్షింపేటలో ఆత్మరక్షణ నినాదం చేస్తుంది. ఐదుగురు చనిపోయినా బాధితులు నిస్సారంగా లేరు. 250 ఎకరాలు దళితుల సొంతం అయ్యేవరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటంలో భాగస్వాములవుతున్న ఎర్ర, నీలి ఉద్యమాలన్నీ ఈ డిమాండ్లు నెరవేరేవరకు ఐక్యంగా పోరాడాలి. 

ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మిగిలిన సంఘాలతో కలిసి, బాధితులతో కలిసి పనిచేస్తుంది. ఈనాటి ఈ దళిత ఆత్మగౌరవ ఉద్యమం కులాధిపత్యాన్ని, భూస్వామ్య ఆధిపత్యాన్ని, రాజ్యాధిపత్యాన్ని నిలదీయాల్సిన చారిత్రక సమర దినాలివి. దళిత బహుజన మైనారిటీల్లారా! పార్టీల్ని పక్కన పెట్టి నెత్తురు ఇంకిన నేల నుంచి వస్తున్న పెను కేకలకు స్పందించండి. దళిత సమరయోధులుగా పోరుకు సిద్ధంకండి. చరిత్ర పీడితులదికాదు పీడించబడేవారిదే. తిరుగుబాటే విజయానికి బాట. 


(ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో జూలై 17న 'చలో హైదరాబాద్' కార్యక్రమం తీసుకుంటున్నాం. అందరూ కలిసి రావాలని పిలుపునిస్తున్నాం.)

-డాక్టర్ కత్తి పద్మారావు


కార్పొరేట్లకు దాసోహం పేదలకు రిక్త హస్తం!
June 7, 2012
ఏదీ తేల్చని వర్కింగ్‌ కమిటీ సమావేశం
ప్రధానిని రక్షించే పనిలో అధినేత్రి
అంతుపట్టని ద్రవ్యోల్బణం మూలాలు
బొగ్గు గనుల కుంభకోణంలో సతమతం
ప్రత్యామ్నాయ వ్యవస్థే శరణ్యం 

Soniaఇటీవల జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశ వివరాల్ని గమనిస్తే, జాతీయోద్యమాన్ని నడిపి ఎంతో ప్రతిష్ఠ తెచ్చుకున్న కాంగ్రెస్‌కు ఈ దుర్గతి పట్టిందా అని ఎవరెైనా ఆశ్చర్యపోతారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడుతూ, అనేక రాష్ట్రాల్లో ఓటమికి గురవుతూనే ఉంది. తన నాయకత్వంలోని యూపీఏ పాలన మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా అనేక గొప్పలు చెప్పుకుంది. చివరకు స్వయంగా సోనియా గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్‌ను ఆరోపణల బారినుంచి రక్షించుకోవలసిన దశకు పార్టీ చేరింది. ఆమ్‌ ఆద్మీ నినాదంతో గద్దె నెక్కిన యూపీఏ-2 మంత్రివర్గంలో ప్రణబ్‌ ముఖర్జి, శరద్‌ పవార్‌, కపిల్‌ సిబాల్‌, జయరామ్‌ రమేష్‌, కిశోర్‌ చంద్రదేవ్‌ వంటివారి శాఖల్లో కూడా ప్రావీణ్యత కనపడడం లేదు. 14 మంది కేంద్ర మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అన్నా హజారే బృందం సంధిస్తున్న బాణాలకు క్షతగాత్రులు కావడమేకాని తిరిగి సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో సతమతమవుతున్నారు.

సోనియా గాంధీకి భారతదేశం అర్థం కాలేదు. కాంగ్రెస్‌లో పెద్ద మనుషులు గా చెలామణి అవుతూ తన వెంట నడుస్తున్న వారిలో ఎక్కువ మంది కార్పొరేట్ల గొడుగు నీడలో ఉన్నారని తెలుసుకోలేక పోతున్నారు. ప్రభుత్వ పరిపాలన గాడితప్పి, జీడీపీ స్థాయి 9 నుంచి 6 శాతానికి పడిపోతుంటే దాని మూలాన్ని ఆమె అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆహార ధాన్యాల్ని ఇతర దేశాలనుంచి ఇబ్బడి ముబ్బడిగా దిగుమతి చేసుకుంటూ, రెైతులకు గిట్టుబాటు ధరలేక జీవించే హక్కును కోల్పోతున్న వెైనానికి మూల కారణం ఏమిటో ఆమె అర్థం చేసుకోలేక పోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒకటొకటిగా కూలుస్తూ, ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, సునీల్‌ బి. మిట్టల్‌, అనీల్‌ అగర్వాల్‌, మాలెైన్‌ పీటర్స్‌, లక్ష్మీ మిట్టల్‌, కె.ఎం. బిర్లీ, అనిల్‌ అంబానీ, శశి రూయా, సజ్జన్‌ జిందాల్‌ వంటి ప్రెైవేట్‌ పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ దిగ్గజాలకు దాసోహమంటున్నారు.

దేశ సంపదను, మూల వనరులను ఇటివంటి వారందరికీ తాకట్టు పెట్టడంవల్ల దేశం అధోగతి పాలవుతుందని సోనియాగాంధీ గానీ, ప్రధాన మంత్రిగానీ గుర్తించక పోవడమే ద్రవ్యోల్బణం నానాటికీ పెరగడానికి కారణమవుతోందని తెలుసుకోలేక పోతున్నారు. నానాటికీ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో వర్కింగ్‌ కమిటీ వివరించలేక పోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోలు ధర ఎందుకు పెరుగుతుందో వర్కింగ్‌ కమిటీ తేల్చలేకపోయింది. ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో పాత్రధారులెైన అధికార బృందం ఆర్‌.ఎస్‌. గుజ్రాల్‌, జె.ఎస్‌. శర్మ, పులో్‌ ఛటర్జీ, జోహ్ర ఛటర్జీ వంటివారి తప్పుడు నడకల వల్ల కార్పొరేట్‌ సంస్థలకు మేలు కలుగుతూ ప్రభుత్వ రంగ సంస్థలు శిథిలమౌతున్న విషయంపెై నోరు విప్పలేక పోయారు.

అన్ని వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, సామాన్యుడి మీద పన్నుల భారం ఎందుకు పడుతున్నది, విద్యుత్తు, నీరు, విద్య, ఉపాధి రంగాలన్నీ ఎందుకు కుంటుపడుతున్నాయనే అంశాలమీద నిర్దిష్టమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేదు. పొరుగు దేశం చెైనా స్ర్తీల శ్రమశక్తిని వస్తూత్పత్తికి ఉపయోగించి ప్రపంచ దేశాలకు వస్తువులు ఎగుమతి చేసుకోగలుగుతోంది. క్రియాశీలకమైన ఆర్థిక, రాజకీయ వ్యవస్థల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగాయి. 2 జీ స్ప్రెక్ట్రమ్‌లో లక్ష 76 వేల కోట్ల రూపాయల ధనాన్ని రికవరీ చేయడానికి ఏమి చర్యలు తీసుకున్నదో ప్రభుత్వం వివరించలేకపోతోంది. అవినీతి పరుల విషయంలో సుప్రీం కోర్టు అక్షింతలు వేసినా కాని అరెస్టులు చేయడం లేదు. మళ్లీ వారు బెయిళ్లపెై బయటకు వస్తున్నారు. విద్యా వ్యవస్థను మరింత విస్తృతం చేయడానికి ప్రయత్నించకుండా దాన్ని కూడా చివరకు అంతర్జాతీయ సంస్థలకు తాకట్టు పెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. ఫలితంగా అట్టడుగు కులాల ప్రజలు ఉన్నత విద్యను అందుకొనే అవకాశాలు అంతరిస్తాయి.

పాశ్చాత్యీకరణ చెందుతున్న ఉన్నత విద్యలో ఉపాధి కల్పన కంటే ఇతర హంగులే ఎక్కువ. విద్యకు ప్రభుత్వం పెట్టే ధనం కూడా పెట్టుబడిగా మారి ధనవంతుల పిల్లలే ఉన్నత విద్యను, కార్పొరేట్‌ విద్యను అందుకోగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. కపిల్‌ సిబాల్‌ జాతీయ విద్య పేరుతో ఇంగ్లీష్‌ ప్రాధాన్యాన్ని పెంచి, జాతీయ భాషలెైన హిందీ, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, ఒరియా వంటి ప్రాంతీయ భాషల్లో పుట్టి పెరిగిన దళిత బహుజన మైనారిటీ విద్యార్థుల్ని ఉన్నతంగా ఎదగకుండా చేస్తున్నారు. ఫలితంగా రాబోయే తరాల్లో ధనికుల విద్యకు- బడుగు వర్గాల విద్యకు దేశ వ్యాప్తంగా అంతరం ఏర్పడి ఒకే దేశంలో ఇంగ్లీష్‌ సంస్కృతికి, దేశీయ సంస్కృతికి చెందిన పిల్లలు రెండు తెగలుగా విడిపోయే ప్రమాదం ఏర్పడింది.ఇప్పుడు ప్రధాన మంత్రి మీద వచ్చిన బొగ్గుకు సంబంధించిన ఆరోపణలు కూడా తక్కువేమీ కావు. 2006-09 మధ్య కాలంలో బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రధాని అజమాయిషీలో ఉండగా జరిగిన కేటాయింపులపెై ‘కాగ్‌’ నివేదిక- కేంద్ర పాలకుల వెైఫల్యాన్ని ఎండకట్టింది.

‚దేశానికి బొగ్గు అతి కీలకమైనది. భారత దేశంలోని అన్ని పరిశ్రమలు బొగ్గు మీదే ఆధారపడి నడుస్తున్నాయి. బొగ్గు భారతీయుల జీవన వనరు. ఆ శాఖ శిబూ సోరెన్‌ దగ్గరి నుంచి ప్రధానమంత్రి చేతికి వచ్చింది. మునుపటినుండి జరిగిన అవకతవల్ని కాగ్‌ నివేదిక బయట పెట్టింది. ప్రభుత్వ ఖజానాకు రూ. 10 వేల 64 లక్షల కోట్ల నష్టం వాటిల్లిం దని కాగ్‌ నివేదిక పేర్కొంది.
2004-09 మధ్య కాలంలో 156 కోల్‌ బెల్టులను 100 ప్రెైవేటు కంపెనీలకు, కొన్ని ప్రభుత్వ సంస్థలకు కేంద్రప్రభుత్వం కట్టబెట్టిన వెైనంపెై కాగ్‌ ముసాయిదా నివేదికను రూపొందించింది. లబ్ధి పొందిన కంపెనీల్లో జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, టాటా గ్రూప్‌, అదిత్య బిర్లా గ్రూప్‌ వంటి ప్రెైవేట్‌ సంస్థలతో పాటు ఎన్‌టీపీసీ, పలు రాష్ట్రాల విద్యుత్‌ బోర్డులున్నాయని పేర్కొంది. ఈ కేటాయింపుల సందర్భంగా ప్రభుత్వం బొగ్గుగనులను చాలా తక్కువ ధరకు విలువ కట్టిందని, వేలంపాట నిర్వహించి ఉంటే ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరి ఉండేదని కాగ్‌ వ్యాఖ్యానించింది.

ఈ నివేదికలన్నింటిని అనేక పత్రికలు తమ పరిశోధనాత్మక జర్నలిజంద్వారా బయటపెట్టేవరకు ప్రభు త్వం దాచి ఉంచడం వల్ల దేశ ప్రయోజనాలు కుంటుపడుతున్నాయి. నిజానికి బొగ్గు తవ్వకాల్లో ప్రభుత్వ సంస్థలకు ఉన్న సామర్థ్యం ప్రెైవేట్‌ సంస్థలకు లేదు. 155 కోల్‌బెల్ట్‌లను 100 ప్రెైవేట్‌ కంపెనీలకు అప్పజెప్పడం వల్ల భారతదేశ సామాజిక సంపదకు జరుగుతున్న నష్టాన్ని కాంగ్రెస్‌ పూడ్చగలదా! దీనంతటికీ కారణం- ప్రధానమంత్రి నీతిమంతుడనే కితాబిచ్చి సరళీకరణ, ప్రెైవేటీకరణ, ప్రపంచీకరణ, పాశ్చాత్యీకరణ, కార్పొరేటీకరణలను ముమ్మరం చేసి, పాలకపక్ష మంత్రులు, ఎంపీలు కోట్లకు పడగలెత్తుతున్నారు.
ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జయరామ్‌ రమేష్‌ ఉపాధి హామీ పథకాన్ని ఎద్దేవా చేస్తున్నారు. అది మట్టి తీసి మట్టేసే పథకం, అందులో సృజనాత్మకత లేదు, ఉపాధికి హామీ లేదు, గ్రామాల పునరుజ్జీవనం లేదంటున్నారు. పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్‌ పరిశ్రమలు అభివృద్ధి చెందితే చాలు పర్యావరణం కుంటుబడినా సరే అని అంటున్నారు.

మరొక వెైపు ప్రధాన మంత్రి- భారత దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఆర్థిక రంగానికి గడ్డు కాలం వస్తుంది, అనేక అంశాలు మా నియంత్రణలో లేవు అంటున్నారు. దీనికంతటికి కారణం ఎక్కువ మంది పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద ఏజెంట్లు ఎంపీలుగా ఎన్నికై తమ వ్యక్తిగత సంపదను పెంపొందించుకునే దిశగా దేశాన్ని కొల్లగొడుతున్నారు. ఇందులో మన రాష్ట్ర ఎంపీలు ముందంజలో ఉన్నారు.ఇంత వరకూ దేశ ప్రజలకు 40 శాతం మందికి అక్షరాలు నేర్పుకోలేకపోయాము. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనానికి రూ. 3 నుంచి పెంచలేకపోయారు. పిల్లలు నడి ఎండలో చారుతో అన్నం తింటున్నారు. వారికి పప్పుదినుసులు అందించలేకపోతున్నారు. జెైలులో ఉన్న రాజకీయ నాయకులను, కార్పొరేట్‌ దొంగలను మాంసం, గుడ్లు, పాలు, పండ్లు ఇచ్చి ప్రభుత్వ డబ్బుతో మేపుతున్నారు.

వారిని కోర్టులకు తెచ్చేటప్పుడు బులెట్‌ ప్రూఫ్‌ కార్లలో తీసుకువస్తూ, పది కిలోమీటర్ల దూరంవెళ్ళి చదివే ఆడపిల్లలకు ఒక సైకిల్‌ కొనిపెట్టలేకపోతున్నారు. దొంగలు దొరలుగా, పారిశ్రామిక వేత్తలుగా సొంత విమానాలు కొనుక్కొని రాజకీయ నాయకులుగా, కుల పెత్తందారులుగా మారి ఆయా రాష్ట్రాల్లో సొంత టీవీలు, మందీ మార్బలంతో పాటు గూండాల్ని ముఠాలుగా చేసుకొని ప్రభుత్వ సంపదను దోచుకుంటూ సొంత దళారీ వ్యవస్థలు ఏర్పరచుకొంటున్నారు. ఈ అవినీతి నేతల బాగోతం సోనియా గాంధీకి తెలియదా? 80 ఏళ్లనాడే డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ విషయాలను పసిగట్టి ‘వాట్‌ కాంగ్రెస్‌ అండ్‌ గాంధీ హ్యెవ్‌ డన్‌ టుది అన్‌టచబుల్స్‌’ అనే గ్రంథంలో కాంగ్రెస్‌ బ్రాహ్మణ- బనియాల పార్టీగా చెప్పాడు.

padmaraoబీజేపీ ఇంతకంటే సాంప్రదా యక హిందూ కుల, వర్ణ దోపిడీ వివక్షతో కూడుకున్న పార్టీ. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కుల వర్గ ఆధిపత్య పెత్తందారీ తనంతో రాష్ట్రంలోని పేదలను దోచుకుంటున్నాయి. ఈ పరిస్థితిల్లో దేశ వ్యాప్తంగా దళిత బహుజన మైనారిటీ, ఆదివాసీలు రాజకీయంగా చెైతన్య వంతమై మహాత్మా ఫూలే, అంబేడ్కర్‌ల ఆలోచనావిధానంతో ఈ దేశ సంపదను, ఈ దేశ వనరులను, ఈ దేశ మేధోశ క్తిని ఈ దేశ ప్రజలకే ఉపయుక్తమయ్యే రాజ్య వ్యవస్థ నిర్మాణానికి పూను కోవలసిన చారిత్రకసందర్భం ఇది. ప్రత్యామ్నాయ, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నిర్మాణానికి సన్నద్ధం కావటమే కర్తవ్యం.