జైభీమ్

                                                                                            23 .2 .12    
అంబేద్కర్ ఓ అస్తమించని  సూర్యుడు
తిరుగుతున్న భూగోళం 
ప్రవహిస్తున్న నది 
పొంగుతున్నసముద్రం
మరోబుద్ధుడు మరో అశోకుడు 
భారత రాజ్యాంగ జీవన శిల్పి
ఆయన విగ్రహం ఒక చెరపలేని చారిత్రక గుర్తు 
ఒక పరిణామానికి మైలురాయి 
ఆయన విగ్రహాన్ని కూల్చటం అంటే 
జాతి వ్యక్తిత్వాన్ని కూల్చుకున్నట్టే 
తండ్రి కన్నుల్లో బల్లెంతో పోడిచినట్లే
అంబేద్కర్ నిత్య జీవన కళారూపం
ఆయన్ని శిధిలం చేయగలిగిన శక్తి
ఏ సమూహానికి లేదు
ఆ మూర్తిత్వాన్ని 
అసెంబ్లీ ముందు నిర్మించండి 
ప్రజాస్వామ్య సంస్కృతికి బాటలు వేయండి 
జైభీమ్  జైభీమ్
                                                                 డా.కత్తి  పద్మ రావు                                                            

జీవన సంక్షోభంలో ప్రకృతి సుడులు సృష్టిస్తుంది

                                                                                                               17.1.12
జీవన సంక్షోభంలో 
ప్రకృతి సుడులు సృష్టిస్తుంది 
ఆవాసం లేనివాడు 
ఆరుబైట వణుకుతూ
చలిలో పోరాడుతున్నాడు
లక్షలాది గృహాలు 
నిర్మిస్తున్నామని ప్రకటనలు! 
దుప్పటే ఇవ్వలేని ప్రభుత్వం 
గచ్చు మీద వొట్టి వంటితో
నోటుబుక్కులు తలగడ జేసుకున్న 
విద్యార్ధిని ఏమి రక్షిస్తుంది?
యిచ్చే చేతికి తీసుకునే చేతికి 
మధ్య వెయ్యి చేతులు 
మనిషి ప్రకృతిని ఎదిరించాలంటే 
సమతుల్య సమజీవనం కావలి.
                                                                                                   Dr.Kathi Padma Rao

చలి కూడా ఒక బెబ్బులే

                                                                                                                               15.1.12

చలి కూడా ఒక బెబ్బులే 

ఎముకలు, కీళ్ళు గజగాజా వణుకుతూ 

శరీరం ముద్ద అవుతుంది 

పొత్తిళ్ళలోని శిశువులు 

వెచ్చదనం కోసం ఆరాట పడుతున్నారు 

వృద్ధులు వేళ్ళు కొంగర్లుపోయి

చేతికర్ర పట్టుకోలేక పోతున్నారు 

యిప్పుడు వెచ్చదనమే వెన్నెల

ప్రకృతికీ మనిషికీ 

నిరంతరం ఓ యుద్ధం

Dr.Kathi Padma Rao

నూతన వత్సరానికి స్వాగతం


                                                                                                                                           1.1.12
ఆ క్రిస్మస్ చెట్టు నిండా బూరలే వున్నాయి 
కొవ్వూత్తుల వెలుగు చీకటిని చేదిస్తుంది
చేకటి కూడా సౌందర్యవంతమైనదే
అనేక సార్లు మనం కళ్ళు మూసుకొని 
ఆనందాన్ని అనుభవిస్తాం 
నిజమే
కళ్ళు తెరచి ఆ దృశ్యాన్ని చూడలేక పోయాను
శరీరానికి నిప్పంటించుకొని 
కాల్చుకోవడం చూడలేక పోయాను
ధర్మావేశం ఉద్యమ కెరటాలు లేపింది 
లోతైన గుండె కోత కలిగించింది 
నిజమే
వాళ్ళు అర్ధరాత్రిలో  చైతన్యం గా వుంటున్నారు 
అర్ధనగ్నంగా కేరింతలు కొడుతున్నారు 
ముక్కు రంద్రాల నుండి కొకెయిన్ పీలుస్తున్నారు 
జీవితానికి వారు అర్ధం చెప్పాలేక పోతున్నారు
రక్తం లోపల ఏ జేర్రులో జలగలో 
పారే అనుభూతి వారికి కావాలంట?
అవును
ఆ రాస్తా ముందు నెత్తురు 
వారగా పారింది
అమాత్యుల వారి సతుల వేగానికి
తారే కాదు గులకే కాదు 
భూమి పొరలు కూడా తట్టు కోలేక 
పోతున్నాయి 
వారికి చెక్కు బుక్కులు 
స్లీవ్ లెస్ జాకెట్లు 
స్వీయ గమనంలో వేగం 
వారిని అతలాకుతలం చేస్తుంది 
తండ్రులకు వీరికి తరాలుకాదు
యుగాల దాటివేత 
నిజమే
ఆ చేనేత శిల్పికి 
చేతికి రంద్రాలయ్యాయి 
మగ్గం అనేక సార్లు తడిసి ఆరింది 
ఆకాశం వైపు చూడడమే కాదు
నక్షత్రాలను లెక్క పెట్టడమా 
అతనికి తెలిసింది 
ఆకలికి ఓ ఖగోళశాస్త్రం వుంది 
అవును
ఆ యానాదులు చిన్న చేపలే పడతారు 
చట్టిలోనే ఇంత కూర యిగరేసుకుంటారు
ఈ బర్గార్లకూ , జీడి పప్పు మిటాయికి
గుండె నాళాలు మూసుకు పోయిన వారు 
మేము నాగరికులం 
అందుకే నాగలోకానికి ప్రయాణమయ్యాం  అంటున్నారు?
తల్లంటే యింటిలో దీపం వెలిగించేది 
ప్రభుత్వం దీపం ఆర్పుతుంది
అన్నం పెట్టలేనివాడు 
దీపం వెలిగించలేనివాడు
ఏమి ప్రభువు అనేది ప్రశ్న
అతనెవరు
శవాన్ని భుజాన వేసుకొని తిరుగుతున్నాడు 
ఒక సారి దేశాన్ని దోచుకునే
అవకాశం ఇవ్వమంటున్నాడు
చచ్చిన  ప్రతివాడికీ  సానుభూతే, రాజతర్పణే  
వంశ పారంపర్య  చీడ 
ఈ సంవత్సరం ఎన్నో పీడకలలు 
అయినాఏమి?
పోరాటం
చైతన్యం
రక్తాక్షరాలు రాసాయి 
మనిషి, మానవత 
వెలుగొందుతూనే వున్నాయి 
మూగవోయిన డప్పులూ, డోలక్కులూ
మోగుతూనే వున్నాయి 
రాజ్యాధికారం ఒక కేకే కాదు 
ఒక ఆచరణ కూడా 
నూతన వత్సరానికి  స్వాగతం 
Dr.Kathi Padma Rao